బాగ్‌లింగంపల్లిలో ఘటన
22 మంది విద్యార్థినులకు అస్వస్థత
కింగ్‌కోఠి, నీలోఫర్ ఆస్పత్రులకు తరలింపు
నవతెలంగాణ-ముషీరాబాద్/సుల్తాన్ బజార్
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. హాస్టల్‌లో ఉదయం ఉప్మా తిన్న 22 మంది విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడ్డారు. కొందరు
విరోచనాలు, వాంతులతో ఇబ్బంది పడటంతో వారిని పాఠశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ వెంటనే కింగ్ కోఠి, నీలోఫర్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యార్థినులకు పెట్టే భోజనం నాణ్యంగా ఉండటం లేదన్నారు. ప్రిన్సిపాల్‌ను దీనిపై ప్రశ్నించగా సమాధానం దాటేశారని, ఎవరికీ తెలియకుండా విద్యార్థినులకు చికిత్స అందించడమేంటని ప్రశ్నించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించి.. వైద్యులతో మాట్లాడారు.
విద్యార్థినులను పరామర్శించిన అదనపు కలెక్టర్
కింగ్ కోఠి ఆస్పత్రికి విద్యార్థినులను తీసుకొచ్చిన వెంటనే కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు వైద్య బృందాన్ని అప్రమత్తం చేసి చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో చిల్డ్రన్స్ వార్డుకు మార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కడుపునొప్పి, డీ హైడ్రేషన్ కారణంగా అవస్థతకు గురయ్యారని, వారందరికీ గ్లూకోజ్, వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి చిల్డ్రన్స్ వార్డుకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీ వేశామని, రిపోర్ట్ రాగానే బాధ్యుల మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీకళ, ఆస్పత్రి వైద్యులు విజరత్, సోమశేఖర్, ఎల్‌టీ నరసింహారెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శమంతకమణి, గ్రేడ్ టు పద్మ, సాహేద బేగం తదితరులు ఉన్నారు.



