Tuesday, August 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగిరిజన ఆశ్రమ పాఠశాల, కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌

గిరిజన ఆశ్రమ పాఠశాల, కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌

- Advertisement -

– విద్యార్థులకు అస్వస్ధత
– వారం రోజులుగా భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ ఆరోపణ
– వార్డెన్‌, వర్కర్ల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానిక ఎమ్మెల్యేలకు ఫిర్యాదు
– ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో ఘటన
నవతెలంగాణ-కల్లూరు/ చిట్యాల

ప్రభుత్వ గురుకుల హాస్టల్స్‌లో తరచూ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్లకు, స్థానిక ఎమ్మెల్యేలకు గురుకులాలు, కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్స్‌, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. సోమవారం ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40మంది విద్యార్ధులు, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం కొరికిశాలలోని కేజీవీబీ బాలికల పాఠశాలలో 20 మంది విద్యార్ధులు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరులోని ఎన్‌ఎస్‌పీ క్రాస్‌ రోడ్‌లో ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో అల్పాహారం కింద విద్యార్థులకు కిచిడీ పెట్టారు. అది తిన్న గంటనుంచే విద్యార్థినులకు ఆయాసం, విరోచనాలు, వాంతులు కావటంతో గమనించిన హాస్టల్‌ వార్డెన్‌, ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ అజరు యాదవ్‌ ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్‌, ఎంపీడీవోను అప్రమత్తం చేసి విద్యార్థులకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలలో మొత్తం 90 మంది విద్యార్థులు ఉండగా సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరిశీలించారు. ఎమ్మెల్యే.. డాక్టర్‌ కూడా కావడంతో విద్యార్ధులకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతానికి విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హాస్టల్‌ను సందర్శించారు. అక్కడ వండిన అన్నం, సాంబార్‌ని పరిశీలించారు. సాంబార్‌ చూసి ఇది సాంబారా.. నీళ్ల చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని, అన్నం మెత్తగా.. గుజ్జుగా ఉంటుందని.. తక్కువ మందికే వంట చేస్తున్నారని, ఇదేమిటని అడిగితే ఇంటిదగ్గర ఇంతకంటే మీరు బాగా తింటారా.. ఎక్కువ మాట్లాడితే ఇంటికి పంపించేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. లీటర్‌ పాలతో సేమియా తయారు చేసి 80 మందికి పెడుతున్నారని, హాస్టల్‌ పరిశుభ్రంగా లేదంటూ ఎమ్మెల్యేకి వివరించారు. దాంతో ఆమె వార్డెన్‌, వర్కర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల గ్రామంలోని కేజీబీవీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో 20మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే 12 మంది విద్యార్థులను చిట్యాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. మిగతా 8 మంది విద్యార్థులకు గురుకులంలో వైద్యులు తాత్కాలిక వైద్యం చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు, అడిషనల్‌ కలెక్టర్‌ చిట్యాల సామాజిక ఆస్పత్రికి సందర్శించి విద్యార్థులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే జిల్లా కేంద్రానికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థినులతో ఎమ్మెల్యే మాట్లాడగా.. వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత వారం రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని, కూరలు సరిగ్గా ఉడకడం లేదని ఈ విషయాన్ని పలుమార్లు ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. కూరగాయలు, నూనెలు, బియ్యం నాణ్యతగా ఉండటం లేదని వాపోయారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. కాంట్రాక్టర్‌, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -