Wednesday, February 4, 2026
E-PAPER
Homeఖమ్మంలక్ష్మీపురం సొసైటీ కార్యాలయం ముందు అన్నదాతలు ఆందోళన 

లక్ష్మీపురం సొసైటీ కార్యాలయం ముందు అన్నదాతలు ఆందోళన 

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ : యూరియా కోసం అన్నదాతలో లక్ష్మీపురం సొసైటీ పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో సొసైటీ కార్యాలయం ముందు అన్నదాతలో ఆందోళనకు దిగారు. లక్ష్మీపురం సొసైటీ పరిధిలో గల రైతులకే ముందుగా యూరియా పంపిణీ చేయాలని ఆ తర్వాతే మిగతా వారికి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఫర్టిలైజర్ యాప్ వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సొసైటీ పరిధిలో యూరియా కొనుగోలు చేస్తే 2006.50 రూపాయలకే వస్తుంది. యాప్ ద్వారా బుక్ చేసుకుని కల్లూరు నుంచి యూరియా కట్ట తెచ్చినందుకు కట్టకు 400 రూపాయలు ఖర్చు వచ్చిందని అన్నదాతలు మండిపడుతున్నారు. అన్నదాతలు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని లక్ష్మీపురం సొసైటీకి బుధవారం ఉదయం 8 గంటలకు 890 యూరియా కట్టలు వచ్చాయి. వెంటనే సొసైటీ అధికారులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో స్టాక్ చూపించారు. 8.15 గంటలకే యాప్ ద్వారా 890 కట్టలు నమోదు అయ్యాయని లక్ష్మీపురం సొసైటీ సీఈవో నిమ్మగడ్డ పుల్లారావు తెలిపారు.

కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే 890 యూరియా కట్టలకు రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇది ఇలా ఉండగా లక్ష్మీపురం సొసైటీ పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో గల సొసైటీ కార్యాలయానికి యూరియా వచ్చిందని సొసైటీ పరిధిలోగల తూటికుంట్ల, లక్ష్మీపురం, గోవిందపురం ఎల్ గ్రామాలకు చెందిన రైతులు వెళ్లారు. దీంతో సొసైటీ సిబ్బంది ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా సొసైటీ కి వచ్చిన యూరియా కట్టల మొత్తం నమోదు అయ్యాయని రైతులకు తెలపడంతో ఒక్కసారిగా రైతులకు కంగుతిన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా యాప్ లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని సొసైటీ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో రైతుల ఒక్కసారిగా సొసైటీ కార్యాలయం ముందే ఆందోళనకు దిగి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాప్ ద్వారా నమోదు చేయటం అనేది రైతులకు సాధ్యపడేది కాదని, సొంత గ్రామంలో సొసైటీలలో యూరియా దొరుకుతుంటే మేము వందల కిలోమీటర్లు వెళ్లి యూరియా ఎలా తెచ్చుకోవాలి అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. సుమారు గంటకు పైగానే అన్నదాతలు ఆందోళన నిర్వహించారు.

యాప్ లో నమోదు చేసుకోకుండా తాము యూరియా ఇవ్వలేమని సొసైటీ సిబ్బంది స్పష్టం చేయటంతో చేసేది ఏమీ లేక అన్నదాతలు అక్కడ నుంచి ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. మరికొంతమంది రైతులు తమకు తెలిసిన వారితో యాప్ లో నమోదు చేసుకున్నారు. ఆ విధంగా గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన పసుపులేటి నరేష్, నల్లమోతు నాగేశ్వరరావు, పసుపులేటి నాగేశ్వరరావు, నల్లమోతు లక్ష్మీనారాయణ పగడాల బక్షం, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు యాప్ ద్వారా నమోదు చేసుకున్నారు. కల్లూరు సొసైటీ కార్యాలయంలో యూరియా ఉన్నట్లు చూపించడంతో వారు మరో మార్గం లేక ఒక్కొక్కరు సుమారు పది కట్టలు నమోదు చేసుకున్నారు. కల్లూరు వెళ్లి యూరియా కట్టలు తెచ్చుకోవాల్సిందేనని లక్ష్మీపురం సొసైటీ సిబ్బంది స్పష్టం చేశారు. నమోదు చేసుకున్న 24 గంటలలో యూరియా తెచ్చుకోకపోతే నమోదు క్యాన్సిల్ అవుతుందని రైతులకు సొసైటీ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో అన్నదాతలు కల్లూరు పయనం అయ్యారు. యాప్ ద్వారా ఒక్కొక్క యూరియా కట్ట ధర 266.50 రూపాయల మాత్రమే ఉంది. గోవిందాపురం ఎల్ గ్రామం నుంచి కల్లూరు మండల కేంద్రం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ రైతులందరూ కలిసి ఓ వాహనాన్ని కిరాయికి తీసుకొని కల్లూరు వెళ్లారు. కల్లూరు నుంచి యూరియా కట్టలు తీసుకువచ్చేందుకు కిరాయి వాహనదారుడు ఒక్కొక్క కట్టకు అదనంగా రూ. 100 రూపాయలు తీసుకున్నాడని పసుపులేటి నరేష్, నల్లమోతు నాగేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి తోడుగా ఒక్కొక్క యూరియా కట్ట వాహనంలో వేసినందుకు హమాలీ కూలి పది రూపాయలు తీసుకున్నారని తెలిపారు. కల్లూరు వెళ్లిన తర్వాత గంటలకొద్దీ అక్కడ ఉండవలసి వచ్చిందని దీంతో కేవలం ఒకే ఒక టీ తాగామని వారు తెలిపారు. దీంతో ఒక్కొక్క కట్ట ధర రూ. 400 రూపాయలు పడిందని తెలిపారు. ఒక్కొక్క కట్టకు గోవిందాపురం ఎల్ నుంచి కల్లూరు వెళ్లినందుకు తమకు ఒక్కొక్క కట్టకు అదనంగా రూ. 134 ఖర్చు వచ్చిందని వారు తెలిపారు.

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ వల్ల రైతులకు నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అని అన్నదాతల ప్రశ్నిస్తున్నారు. మా సొసైటీ పరిధిలోనే మాకు యూరియా ఇస్తే ఇన్ని ఇబ్బందులు మాకు ఎదురు కావు కదా అని అన్నదాతల ప్రశ్నిస్తున్నారు. రాను పోను 100 కిలోమీటర్ల వెళ్లవలసి వచ్చిందని, దీనివలన తాము అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “సంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు” మా బతుకులు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతులకు మేలు జరిగే విధానాలు అమలు చేయాలే కానీ నష్టం కలిగించే విధానాలు మానుకోవాలని అన్నదాతలు హితవు పలుకుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -