Sunday, April 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబాంబుల మధ్యే ఫుట్‌బాల్‌

బాంబుల మధ్యే ఫుట్‌బాల్‌

- Advertisement -

గాజాలో యుద్ధభయాన్ని మర్చిపోయేందుకు చిన్నారుల ఆట
బాసటగా నిలుస్తున్న క్రీడాకారులు
శిధిల రహదారులే మైదానాలు
ఇటుక గుట్టలే గోల్‌పోస్టులు
మానవత్వాన్ని తట్టిలేపుతున్న బాలల సాకర్‌ క్రీడ

నవతెలంగాణ- సెంట్రల్‌ డెస్క్‌
యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో బుల్లెట్లు, బాంబులు పేలడం మాత్రమే కాదు. అది మనుషుల జీవితాలను, బాల్యాన్ని, కలలను నిశ్శబ్దంగా చిదిమేసే ప్రక్రియ. అలాంటి యుద్ధ వాతావరణంలో కూడా ఫుట్‌బాల్‌ ఆడుతున్న చిన్నారులు కనిపిస్తే… అది క్రీడ కంటే ఎక్కువ. బతుకు పోరాటానికి ప్రతీక. గాజా స్ట్రిప్‌లో కనిపిస్తున్న చిన్నారుల ఫుట్‌బాల్‌ దశ్యాలు ఇదే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్తున్నాయి. బాంబుల మోతలు, కూలుతున్న భవనాల భయాన్ని ఆ క్షణానికి మర్చిపోయేలా ‘సాకర్‌’ ధైర్యాన్నిస్తోంది. గాజాలో పిల్లలకి మైదానాలు లేవు. శిథిలాలు మాత్రమే ఉన్నాయి. పాఠశాలలు కూలిపోయాయి. ఇండ్లు నేలమట్టమయ్యాయి. అయినా ఆ శిథిలాల మధ్య ఒక పాత బంతి దొరికితే చాలు…అదే ఆ చిన్నారుల ప్రపంచంగా మారిపోతుంది. ఆ ఆట ఆడుతున్నప్పుడు కొద్ది క్షణాలైనా యుద్ధాన్ని మర్చిపోతారు. బంతి వెంబడి పరుగులు తీయడం వాళ్లకు స్వేచ్ఛను గుర్తు చేస్తుంది.

ఇక్కడ ఫుట్‌బాల్‌ క్రీడ కాదు… ఆశ. భయం నుంచి బయటపడే మార్గం. మానసిక ఒత్తిడికి ఉపశమనం. ‘మేమింకా బతికే ఉన్నాం’ అనే నిరూపణ. పిల్లలు గోల్స్‌ కొడుతున్నప్పుడు ఆ ఆనంద కేకల్లో ఒక వేదన దాగి ఉంటుంది. ‘ఈ రోజు అయినా ప్రశాంతంగా గడిచింది’ అనే తప్తి కనిపిస్తుంది. సాధారణంగా ఫుట్‌బాల్‌కు స్టేడియాలు, ప్రేక్షకులు, నియమాలు ఉంటాయి. కానీ గాజాలో శిధిలమైన రోడ్లే మైదానాలు, కూలిన ఇండ్ల ఇటుకల గుట్టలే గోల్‌పోస్టులు. ప్రేక్షకులు సహచర బాధితులే. ఆ క్షణంలో ఫుట్‌బాల్‌ను క్రీడగాకంటే ప్రపంచానికి బాల్యం అందించే మానవ సహన సందేశాన్ని అందిస్తున్నట్టే ఉంటుంది. గాజాలో ఫుట్‌బాల్‌ ఆడుతున్న ప్రతి చిన్నారి ప్రపంచానికి ఒక ప్రశ్న వేస్తోంది. ‘మా బాల్యాన్ని రక్షించడానికి మీకు సమయం లేదా?’ అని. యుద్ధంలో గెలుపోటములు ఎవరివైనా కోల్పోయేది మాత్రం మానవత్వాన్నే అనడానికి ఇక్కడి ఆ చిన్నారుల దృశ్యాలే సజీవ సాక్ష్యాలు.

గాజాలో బంతిని తన్నుతున్న ప్రతి చిన్నారి… ఒక సైనికుడికంటే పెద్ద యోధుడు. ఎందుకంటే అతను ఆయుధాలతో కాదు… ఆశతో పోరాడుతున్నాడు. ఫుట్‌బాల్‌ అక్కడ ఒక ఆట కాదు… బతుకు శబ్దం.యుద్ధం దెబ్బకు మధ్యప్రాచ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒకప్పుడు గల్ఫ్‌ విస్తరించి ఉన్న ఎడారి దేశాల్లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లంటే అక్కడి క్రీడాభిమానులకు పండుగే. నాడు పచ్చని క్రీడామైదానాల్లో ఆటగాళ్లు ఆడుతుంటే, పిల్లలు పెద్దలు ప్రేక్షకులుగా వాళ్లను చూస్తూ కేరింతలు కోట్టేవారు. అలాంటిది రెండేండ్ల నుంచి గాజాపై దాష్టీకం కొనసాగుతూనే ఉంది. అయినా అక్కడి క్రీడాకారులు, పిల్లల నుంచి ఫుట్‌బాల్‌ ఆటపై ఉన్న మమకారం మాత్రం వేరుకాలేదు. ఇప్పటి వరకు గాజాలో ఇజ్రాయిల్‌ దళాలు 72 వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.

దాదాపు రెండు లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటికీ ఆహారం, నీరు అందక పాలస్తీనియన్లు అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలీదు. ఎప్పుడు ఎవరిపై ఏ బాంబులు పడతాయోనన్న భయం వారిని నిత్యం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి భీతావహ పరిస్థితుల్లోనూ క్రీడాకారుల ఆ శిధిలాల మధ్యే ఫుట్‌బాల్‌ టీమ్‌లుగా పోటీకి దిగుతున్నారు. గాజా స్ట్రిప్‌లో శిథిలమైన భవనాలు, రాళ్ల గుట్టలతో నిండిన ఒక పాడుబడిన మైదానంలో జబాలియా యూత్‌, ఆల్‌-సదాకా టీంలు ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను ఆడాయి. అలాగే బైత్‌ హనౌన్‌, అల్‌-షుజైయా మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ కూడా డ్రాగానే ముగిసింది. ప్రేక్షకులు ఏమాత్రం నిరాశ చెందలేదు. గాజా నగరంలోని తల్‌ అల్‌-హవా జిల్లా శిథిలాల మధ్య ఉన్న పాలస్తీనా పిచ్‌ పక్కనే ఉన్న చైన్‌-లింక్‌ కంచెను ఊపుతూ, కేరింతలు కొట్టారు. కొందరు పగిలిన కాంక్రీట్‌ గోడ ఎక్కి, శిథిలాల్లోని రంధ్రాల గుండా తొంగి చూస్తూ క్రీడాభిమానులు ఫుట్‌బాల్‌ టీంలను ప్రోత్సహిస్తున్నారు. తమ వద్ద ఉన్న డ్రమ్స్‌ కొడుతూ, నినాదాలతో క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్నారు.

ఆగని ఇజ్రాయిల్‌ దాష్టీకం
ఇజ్రాయిల్‌ దళాల దాష్టీకంతో గాజాలో దాదాపు జనావాసాలు లేకుండా పోయాయి. బుల్డోజర్లతో చదును చేసిన గాజాలోని ఒక ప్రాంతానికి చెందిన జబాలియా యూత్‌ ఆటగాళ్లలో ఒకడైన 21 ఏండ్ల యూసఫ్‌ జెండియా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ‘గందరగోళంగా ఉంది. సంతోషం, విచారం, ఆనందం కలగలిసిన అనుభూతి మిగిల్చింది’ అని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ‘ప్రజలు ఉదయాన్నే నీటి కోసం, ఆహారం కోసం, రొట్టె కోసం వెతుకుతారు. జీవితం కొంచెం కష్టంగా ఉంది. కానీ రోజులో ఇంకా కొద్ది సమయం మిగిలే ఉంది. ఆ సమయంలో మీరు వచ్చి సాకర్‌ ఆడి, మీలోని ఆనందాన్ని కొంతైనా వ్యక్తపర్చవచ్చు అని సూచిస్తున్నాడు. గాజాలో 20 లక్షల మందికి పైగా ప్రజలు సముద్రతీరం వెంబడి ఉన్న శిథిలాల నడుమ బతుకుతున్నారు.

యుద్ధ సమయంలో ఇజ్రాయిల్‌ దళాలు నేలమట్టం చేసి, నిర్బంధ కేంద్రంగా ఉపయోగించిన గాజా నగరంలోని 9 వేల సీట్లతో కూడిన యర్ముక్‌ స్టేడియం శిధిలమైపోయింది. ఇది ఒకప్పుడు పిచ్‌గా గోధుమ రంగు మట్టితో కిక్కిరిసిపోయి ఉండేది. ఇపుడు లక్కడ నిరాశ్రయులైన కుటుంబాలు తెల్లటి గుడారాల్లో నివసిస్తున్నాయి. ఈ వారం టోర్నమెంట్‌ కోసం, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ పిచ్‌ పక్కన కూలిపోయిన సగం గోడ శిథిలాలను తొలగించి, కంచెను ఏర్పాటు చేసి, పాత కృత్రిమ టర్ఫ్‌ నుంచి చెత్తను ఊడ్చివేసింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నా బయటకు రావడం ద్వారా జట్లు ఒక సందేశాన్ని అందిస్తున్నాయని బీట్‌ హనౌన్‌ ఆటగాడు అమ్జాద్‌ అబు అవ్దా (31) అన్నారు. ‘విధ్వంసం, జాతి నిర్మూలన యుద్ధపరంగా ఏం జరిగినా, మేం ఆటను, జీవితాన్ని కొనసాగిస్తాం అని అక్కడి క్రీడాకారులు, చిన్నారులు చెప్తుండటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -