సంసార బంధంలో సమస్యలు సాధారణమే. అలాగని ఒక్కటిగా నడవాల్సిన చోట ఎవరికి వారు తామే గొప్ప అన్నట్టు వ్యవహరిస్తే ఆ బంధం ప్రమాదంలో పడుతుంది. ఇక కొత్తగా పెండ్లయిన దంపతుల్లో కొందరు భాగస్వామి కోసం నేనెందుకు మారాలన్న స్వార్థ పూరిత ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, చేతి నిండా సంపాదించడం వంటివి కారణాలు కావొచ్చు. అయితే ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ ఈ స్వార్థం పనికి రాదు. ఇది అర్థం చేసుకోలేక చాలా మంది జీవితంలో కొన్ని చేదు అనుభవాలు చవిచూడాల్సి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇద్దరూ కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. అవేంటో తెలుసుకుందాం…
గొడవ జరిగినప్పుడు సమస్య ఏదో దాని గురించి మాత్రం మాట్లాడితే సరిపోతుంది. అలాకాకుండా అనవసరంగా అరవడం, ఎప్పటి విషయాలో తెచ్చి నిందించడం మొదలుపెడితే అది పక్కదారి పడుతుంది. దీంతో అది మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంది. అందుకే, వాదన మొదలైతే ఇద్దరిలో ఒక్కరైనా కోపాన్ని నిగ్రహించుకోగలగాలి. అలాకాకుండా రెట్టించుకుంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది. అది మానసికంగా మిగతావారిపై ఒత్తిడిని పెంచుతుంది. ఏదైనా భేదాభిప్రాయం వస్తే కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి, అక్కడి నుంచి బాల్కనీ లేదా తోటలో పది నిమిషాలపాటు నడవడం నేర్చుకోవాలి. మనసు కుదుటపడిన తర్వాతే లోపలికి అడుగుపెట్టాలి. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే అసలు సమస్యకు కారణమేంటో తెలుస్తుంది.
సర్దుకుపోవాలి
ఒక ఇంట్లోనే కలిసున్నా అన్నీ మనకు నచ్చినట్లే జరగాలనుకోవడం పొరపాటు. ఎవరు పెరిగిన వాతావరణాన్ని బట్టి వారి అలవాట్లు ఉంటాయి. వాటిని ఇద్దరూ గౌరవించాలి, సర్దుకుపోవాలి. అలాకాకుండా మీరు చెప్పినట్టు చేయడం లేదని నీకు మీ ఇంట్లోవాళ్లు ఇంతే నేర్పారా? ఒక్కపనీ రాదా? అంటూ చిన్న చిన్న పనులకు కూడా అరవడం, కోప్పడటం, నలుగురిలోనూ నిందించడం కూడదు. బదులుగా ‘ఆ పనిని ఇలా చేస్తే బాగుంటుంది, నాకు నచ్చుతుంది’ అని చెప్పి చూడండి. అర్థం చేసుకుంటారు.
అన్నింటికీ ‘నేనే’ అంటున్నారా?
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దంపతుల్లో ఎవరో ఒకరు ఇదంతా నీవల్లే ఇలా జరిగిందంటూ ఇతరులపై నెపం వేస్తారు. మరికొందరైతే నేను మాత్రమే ఇంటిని సరైన రీతిలో నడిపిస్తున్నా అని చెబుతారు. ఇలా అన్నింటికీ నేను అని అంటుంటే ఆ అనుబంధం బలంగా ఉండదు. ఇద్దరూ తలో బాధ్యతనూ పంచుకుంటూ ఇంటిని నడిపించాలి. ఇద్దరూ కలిస్తేనే కుటుంబం అనే విషయాన్ని గ్రహించి ఒకరికొకరు తోడుగా నిలిస్తే ఆ సంసారం సంతోషంగా సాగుతుంది.
భరోసా ఇచ్చుకోవాలి
సాధారణంగా చాలా మందికి ఆర్థిక విషయాల్లో గొడవలు వస్తుంటాయి. అప్పటి వరకు తమ సంపాదనతో స్వేచ్ఛగా గడిపిన వారు పెండ్లి తర్వాత కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. మరికొంతమందికి భవిష్యత్తు కోసం చేయాల్సిన పొదుపు-మదుపుల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఇంకొంత మంది తక్కువ సంపాదనతో ఖర్చులన్నీ నెట్టుకురావల్సిన పరిస్థితులు తలెత్తచ్చు. ఇలా కారణమేదైనా ఆర్థిక విషయాల్లో ఇద్దరికీ పొసగదు. పలు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటప్పుడు ఇద్దరూ గొడవపడడం మాని భవిష్యత్తు కోసం ఒకరికొకరు భరోసా ఇచ్చిపుచ్చుకోవాలి. ఇద్దరూ తమ లక్ష్యాలు, ఆలోచనలు చర్చించుకొని చక్కటి ప్రణాళిక వేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సంసారమూ సాఫీగా సాగుతుంది.
ఇద్దరికీ నచ్చేలా…
పెడ్లంటే రెండు కుటుంబాల కలయిక. కాబట్టి దంపతులు తీసుకునే ఏ నిర్ణయమైనా వారి కుటుంబాలను సైతం ప్రభావితం చేయచ్చు. ఇది వారి దాంపత్య జీవితం పైనా ప్రభావం చూపచ్చు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఇద్దరికీ నచ్చినట్టుగా, పెద్దవాళ్లను నొప్పించకుండా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీరూ సంతోషంగా ఉండచ్చు. అనుబంధాన్నీ దృఢం చేసుకోవచ్చు.
వ్యక్తిగత సమయం అవసరం
వైవాహిక బంధం శాశ్వతం కావాలంటే దంపతులిద్దరూ సర్దుకుపోవడం ఎంతో అవసరం. అలాగని ప్రతి విషయంలోనూ సర్దుకుపోయినా ఒకరంటే మరొకరికి లోకువై క్రమంగా గొడవలకు దారితీయొచ్చు. అలాంటి పరిస్థితి ఎదురువకుండా చూసుకోవాలి. అలాగే ఎవరికి వారు కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవాలి. మీ స్నేహితుల్ని కలవడం, మీకు నచ్చిన పనులు చేయడం, అభిరుచులకు పదును పెట్టడం… వంటివి చేస్తే ఈ సంతృప్తి దాంపత్య బంధంపైనా సానుకూల ప్రభావం చూపుతుంది.



