కడుపులో శూన్యం భర్తీకి
శూన్యంలోనూ గింగిరాలు తిరగాలి
పేగుల్లో అగ్గి ఆర్పడానికి
కణకణ జ్వాలల్లో కరిగిపోవాలి
ఊపిరితో ఉండడానికి
ఊహకందని ప్రదేశాల్లో పనిచేయాలి
ఆత్మహత్యా సదృశ్యంలాంటి
దృశ్యాల్లో దూరాలి..
ఆశలన్నీ వదిలి
బతకడం కోసం చచ్చిపోవాలి
చావలేకనైనా బతకాలి
గాలి నీరు నింగి నేల నిప్పుల్లో
ప్రమాదాల్ని పరిచయం చేసుకొని
మృత్యువుతో మంతనాలు జరపాలి
అవసరానికి ఆఖరి మెట్టు దిగిపోయి
ఆకలి మంటల్ని ఆర్పడానికి
చెమట వర్షం కురిపిస్తూ
అహోరాత్రులూ ఆహుతైపోవాలి..
దారిద్య్రం వీలునామాలోకెక్కిన పాపానికి
స్వేదసంద్రం నట్టనడిలో దూకాలి
తెగిన చుక్కానితో ఒడ్డు చేరడానికి
ప్రాణాలే పణంగా పెట్టాలి
కూటి కోసం కాటికే పయనమవ్వాలి..
(సిగాచి పరిశ్రమ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళిగా)
– భీమవరపు పురుషోత్తమ్