Saturday, February 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఓ ఎర్రని ఉదయం కోసం…

ఓ ఎర్రని ఉదయం కోసం…

- Advertisement -

ఫిబ్రవరి 21, 1848.
లండన్‌లోని ఒక మామూలు ముద్రణాలయం నుంచి వెలువడిందో పుస్తకం..
అది చిన్న పుస్తకం – కానీ పెద్ద ప్రకంపనం..
అది చేసిన శబ్దం ఖండాల్ని దాటి చరిత్రను కుదిపేసింది.
దాని పేరే ”కమ్యానిస్టు ప్రణాళిక (The Communist Manifesto)”.
ఆ రోజునే మనం ”రెడ్‌ బుక్‌ డే”గా గుర్తు చేసుకుంటాం.
చరిత్రలో అనేక గ్రంథాలు వెలువడ్డాయి.
కొన్ని ఆలోచింపజేశాయి. మరికొన్ని ఆరాధింపజేశాయి.
కానీ, కమ్యూనిస్టు ప్రణాళిక మాత్రం ప్రపంచమంతటా ప్రశ్నల కొడవళ్లై మొలిచింది.
ఆస్తి ఎవరి చేతుల్లో ఉంది? శ్రమ ఎవరు చేస్తున్నారు? లాభం ఎవరు పొందుతున్నారు?
ఈ మూడు ప్రశ్నలతోనే ఒక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి చూపగలిగింది. 1848 నుండి 2026 వరకు ప్రపంచం చాలా మారింది. రాజ్యాలు కూలాయి. సామ్రాజ్యాలు చరిత్రపుటల్లో కలిశాయి. సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చిం దని చెప్పుకుంటున్నారు. కానీ, అసమానత అంతరించి పోయిందా? సమానత్వం సాకారమయిందా? ఈ ప్రశ్నలన్నీ మళ్లీ మన ముందుకు వస్తే.. ఆ పుస్తకం ఇప్పటికీ ఎందుకు ప్రాసంగికమో అర్థమవుతుంది.
కారల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌లు రచించిన ఈ చిన్న గ్రంథం, విశ్వవ్యాపితంగా మహా సంభాషణలకు నాంది పలికింది. ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లు తప్ప” అంటూ శ్రామికవర్గానికి ఇచ్చిన ఈ పిలుపు పెట్టుబడిదారీ వర్గాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. అసమానతల మధ్య సమానత్వం కోసం, దోపిడీ దురన్యాయాల మధ్య న్యాయం కోసం పుట్టిన పిలుపు అది. ”సమాజ చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే” అన్న వాక్యం కేవలం ఓ సిద్ధాంత ప్రకటన కాదు, శతాబ్దాల అణచివేతలపై చారిత్రక తీర్పు. రాజ్యాల గోడలపై గీసిన ఎర్రని గీత. తరతరాల దోపిడీ పీడనలకు స్పష్టమైన రాజకీయ సవాలు. ఈ చిన్న పుస్తకం ద్వారా ప్రపంచాన్ని మార్చాలనే మహోన్నత ఆశయానికి నాంది పలికారు మార్క్స్‌, ఎంగెల్స్‌లు. అందుకే ఈ రోజును ప్రపంచమంతా ”రెడ్‌బుక్‌ డే”గా జరుపుకుంటోంది. అయితే ఇది కేవలం ఒక చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. అది సంధించిన ప్రశ్నను ముందుకు తీసుకుపోవడం. రెడ్‌బుక్‌ డే అంటే ఉద్వేగాలను మహిమాన్వితం చేయడం కాదు, తలవంచని ఆలోచనలను తలకెత్తుకోవడం. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతిపాదించిన సామ్యవాద భావజాలాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం.
సామ్యవాదం గురించి మాట్లాడేటప్పుడు కొందరి కళ్లలో అనుమానం కనిపిస్తుంది. కొందరి పెదవులపై వ్యంగ్యం, ఇంకొందరి మాటల్లో ”అది పాతకథ” అన్న నిర్లక్ష్యం వ్యక్తమవుతుంది! ఎందుకంటే, చాలామందికి అదొక అర్థంకాని సిద్ధాంతమనే భావన! కానీ, గుర్తించాల్సిన సత్యమేమిటంటే ఒక ప్రశ్న ఇంకా నిలిచే ఉంది. ఈ ప్రపంచం దోపిడీని జయించిందా? అయితే అసమానతలు ఎందుకు తగ్గలేదు? ఆకాశాన్ని తాకే భవనాల పక్కనే ఆకలితో కూర్చున్న పిల్లవాడు ఎందుకు ఉంటాడు? కొద్దిమందికి లక్షల కోట్ల సంపద పేరుకుపోతే, కోట్ల మందికి ఉపాధి ఎందుకు అస్థిరమవుతోంది? ఈ ప్రశ్నలు అడిగే ధైర్యమే సామ్యవాదం. సామ్యవాదం ఒక భావావేశ సిద్ధాంతం కాదు. అది మనిషి శ్రమకు గౌరవం ఇవ్వాలనే మానవీయ పిలుపు. ”నీ కష్టం నీదే” అని చెప్పే నైతిక ధైర్యం.
1848లో వెలువడిన ఈ పుస్తకం ఇప్పటికీ అడుగుతోంది.. ప్రపంచం మారిందా? సాంకేతికత పెరిగినా, సంపద పెరిగినా అసమానతలు ఎందుకు తగ్గడం లేదు..? ప్రశ్నించమంటోంది. పరిశీలించమంటోంది. సమాజాన్ని చూడటానికి ఈ పుస్తకం ఒక కొత్త కిటికీని తెరిచింది. సమాజాన్ని భావోద్వేగాలతో కాకుండా, శాస్త్రీయంగా విశ్లేషించింది. దోపిడీకి కారణం కొందరు వ్యక్తుల లోపం కాదు, అది ఈ వ్యవస్థ లక్షణం అని చూపింది. చరిత్రను వర్గాల పోరాటంగా నిరూపించింది. ఆర్థిక నిర్మాణం రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, సంపద వనరులు ఎవరి చేతుల్లో ఉంటే అధికారమూ వారికే ఉంటుందని చెప్పింది. ఈ విశ్లేషణ ఒక విప్లవాత్మక ఆలోచన. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
19వ శతాబ్దంలో యూరప్‌ పారిశ్రామిక విప్లవం వేగంగా విస్తరిస్తున్న కాలమది. కర్మాగారాలు పెరిగాయి. యంత్రాలు పని వేగం పెంచాయి. కానీ, కార్మికుల జీవితాన్ని మాత్రం అగాథంలోకి నెట్టాయి. సుదీర్ఘమైన పనిగంటలు, తక్కువ వేతనం, భద్రతలేని జీవితాలు.. ఈ వైరుధ్యం ఏం చెబుతోంది? సమాజం మారినా, అది సరికొత్త రూపంలో తిరిగి రెండు వర్గాలుగా విభజితమవుతోంది. యజమానులు-కార్మికులు అనే ఈ విభజనను స్పష్టంగా చూపింది కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ చూపు ప్రపంచ రాజకీయాల చరిత్రనే ప్రభావితం చేసింది. కార్మిక ఉద్యమాలకు సైద్ధాంతిక బలాన్నిచ్చింది. సామ్యవాద శక్తులకు ఆలోచనల పునాదిగా నిలిచింది. వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు కూడా దిశానిర్దేశం చేసింది. అన్నిటికీ మించి లెనిన్‌ సారథ్యంలో అక్టోబర్‌ మహావిప్లవానికి పురుడుపోసింది. తూరుపు యూరపునంతా సోషలిజంతో అరుణారుణం చేసింది. ఇలా 20వ శతాబ్దం అంతా ఈ సిద్ధాంతం చుట్టూ అనేక రాజకీయ ప్రయోగాలు జరిగాయి. కార్మిక హక్కులు, ఎనిమిది గంటల పని, కనీస వేతనాల భావన, సామాజిక భద్రత.. ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు. ప్రభుత్వాల దయ అంతకంటే కాదు. పోరాటాల ఫలితాలు. ఈ ప్రణాళిక వెలుగులో కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రపంచంలో అనేక విజయాలు సాధించాయి. అయితే వైఫల్యాలూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో సోషలిజం విఫలమయింది. కానీ, సిద్ధాంతం విఫలమైందా? ఇది చర్చించాల్సిన ప్రశ్న. ఎందుకంటే మార్క్స్‌ చెప్పింది ఒక మూస సిద్ధాంతం కాదు. అది నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట విశ్లేషణా పద్ధతి. సమాజాన్ని శాస్త్రీయంగా నిర్వచించే భావజాలం. ఇందులో విజయాలతో పాటు వైఫల్యాలూ ఉన్నప్పటికీ, ఆ వెఫల్యాలకు కారణం ఆచరణా లోపాలు తప్ప సిద్ధాంత లోపం కాదని చరిత్ర నిరూపిస్తోంది.
ఆచరణలో వచ్చిన లోపాలను చూపించి, సిద్ధాంతాన్ని సమాధి చేయలేం. సామ్యవాదం ఒక రాజకీయ ప్రణాళిక మాత్రమే కాదు, అది మానవ గౌరవాన్ని కేంద్రంగా పెట్టిన సామాజిక ధృక్పథం. అది ”నాకు మాత్రమే కాదు, మన అందరికీ” అని చెప్పే నైతిక నిర్ణయం. మన కాలంలో ఒక పెద్ద మాయ ఉంది. మార్కెట్‌ అన్నింటినీ పరిష్కరిస్తుందని. కానీ, మార్కెట్‌ లాభాన్ని చూస్తుంది, మనిషి కన్నీళ్లను కాదు. మార్కెట్‌ పోటీని పెంచుతుంది, సమానత్వాన్ని కాదు. ఇక్కడే సామ్యవాదం అవసరం అవుతుంది. సామ్యవాదం అంటే కేవలం ఎర్రజెండా కాదు. అది ఆకలితో ఉన్నవాడి గిన్నెలో అన్నం నింపాలనే బాధ్యత. అది శ్రమను దోపిడీ నుంచి విముక్తి చేయాలనే సంకల్పం. అది సమాజాన్ని కొద్దిమందికి చెందినదిగా కాకుండా, అందరికీ చెందినదిగా మార్చాలనే సిద్ధాంతం.
మార్క్స్‌, ఎంగెల్స్‌ మనకు ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇవ్వలేదు. ఆ వెలుగులో ఈ ప్రపంచాన్ని గమనించే చూపునిచ్చారు. దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఒక ఆలోచనా పద్ధతినిచ్చారు. అదే సమయంలో ప్రపంచాన్ని మార్చాలనే కర్తవ్యాన్ని కూడా ఇచ్చారు. ఇప్పటి ప్రపంచం 1848 కంటే భిన్నమే కావొచ్చు. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూస్తే, సాంకేతికత పెరిగింది. ఫైనాన్స్‌ పెట్టుబడి విస్తరించింది. కంపెనీలు, వాణిజ్యం దేశాల సరిహద్దులను దాటుతున్నాయి. సంపద పెరుగుతోంది. ఆ సంపద సమానంగా పంచబడుతోందా?ఈ ప్రశ్న మిగిలే ఉంది..నేడు అసమానత ఒక నిర్మాణాత్మక సమస్యగా మారింది. ప్రపంచవ్యాపితంగా అసమానతలు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సంపద కేంద్రీకరణ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. సాంకేతిక విప్లవం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, గ్లోబల్‌ మార్కెట్ల పెరుగుదల, అధిక ఉత్పత్తి సామర్థ్యం.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొద్దిమంది చేతుల్లోనే అధిక సంపద కేంద్రీకృతమవుతోంది. ఫలితంగా కార్పొరేట్‌ శక్తులు ప్రభుత్వాలకంటే బలంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యం మార్కెట్‌కు బానిసవుతోంది. శ్రమ అసంఘటితమవుతోంది. రైతు అప్పుతో బతుకుతున్నాడు. యువకుడు నిరుద్యోగంతో పోరాడుతున్నాడు. ఉద్యోగాలు, శ్రమకు తగ్గ వేతనాలు, భద్రతా అవకాశాలు ఇవేవీ సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు.
ఈ నేపథ్యంలో మార్క్స్‌ చెప్పిన వర్గ విశ్లేషణ మళ్లీ ప్రాసంగికమవుతోంది. ఉత్పత్తి సాధనాల యాజమాన్యం ఎవరిది? శ్రమ విలువను ఎవరు నిర్ణయిస్తున్నారు? మార్క్స్‌ అడిగిన ఈప్రశ్నలు నేటికీ వినిపిస్తున్నాయి. అందుకే రెడ్‌ బుక్‌ డే అంటే కేవలం ఒక రాజకీయ జ్ఞాపకం, చారిత్రక స్మరణ మాత్రమే కాదు. అది మానవాళి శ్రేయస్సుకై కమ్యూనిస్టు ప్రణాళిక రూపంలో ఒక శాస్త్రీయ భావజాలం ఆవిర్భవించిన రోజు. మార్క్స్‌ దృష్టిలో కమ్యూనిజం అంటే కేవలం ఆస్తి పునర్విభజన కాదు. అది మనిషి మనిషిని దోచుకోని సమాజం. మనిషి తన శ్రమకు గర్వపడే సమాజం. భయం లేకుండా, అవమానం లేకుండా, ఆకలి లేకుండా జీవించే ప్రపంచం. ఈ దృక్పథమే మార్క్సిజాన్ని మాన వీయతకు కేంద్రంగా నిలిపింది. ఈరోజు మనం రెడ్‌బుక్‌ డేను గుర్తుచేసుకోవడం అంటే ఆ ఆలోచనలను చదవడం. మన సమాజాన్ని ఆ దర్పణంలో చూసుకోవడం. మన పాఠశాలల్లో అసమానతలపై చర్చ జరుగుతోందా? మన కర్మాగారాల్లో కార్మిక శ్రమకు గౌరవం దొరుకు తోందా? మన రాజకీయాల్లో ప్రజలకు ప్రాధాన్యం లభిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం. అదే రెడ్‌బుక్‌ డే నిజమైన కర్తవ్యం. 1848లో వెలిగిన ఆ ఆలోచన జ్వాల ఎన్నో దాడులు ఎదుర్కొంది. విమర్శలు, నిషేధాలు, అపప్రథలు అన్నీఇన్నీ కావు. అయినా అది ఆరిపోలేదు. ఎందుకంటే అసమానత ఇంకా ఉంది. అన్యాయం ఇంకా ఉంది. శ్రమదోపిడీ ఇంకా ఉంది. అందుకే రెడ్‌ బుక్‌ డే ప్రతి సంవత్సరం మనకు ఒక సవాలు విసురుతుంది:
”నువ్వు ఏ పక్షాన ఉన్నావు?”
పీడితుల పక్షమా?
లేక పీడకుల పక్షమా?
ఈ రెడ్‌బుక్‌ డే మన ఆత్మపరిశీలనకు, మన పునర్నిబద్ధతకు ఒక కొత్త ఆరంభం కావాలి.

రమేశ్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -