అణు బాంబులను సైనిక ఆస్తి, బీమా పాలసీలుగా చూస్తున్న దేశాలు
న్యూఢిల్లీ : ఇరాన్‌లో జరుగుతున్న పోరు, గల్ఫ్ దేశాలను కాపాడుకోవడంలో అమెరికా వైఫల్యం, తమ అణ్వస్త్రాల అమ్ముల పొదిని బలోపేతం చేసుకోవడానికి చైనా-రష్యా చేస్తున్న ప్రయత్నాలు…ఈ పరిణామాలను గమనిస్తే అణ్వాయుధాల తయారీ కోసం ప్రపంచ దేశాలు ఆతృత ప్రదర్శిస్తున్నాయన్న సంకేతం కన్పిస్తోంది. ఆసియా, యూరప్ ప్రాంతాలలోని కనీసం ఆరు దేశాలు అణ్వాయుధాలను సముపార్జించుకోవాలని లేదా అణు రక్షణ కవచం పొందాలని భావిస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధాలకు స్వస్తి చెప్పగా తాజాగా కొన్ని దేశాలు వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం. అణ్వస్త్ర దేశాలుగా అవతరించాలని కొన్ని దేశాలు కోరుకుంటుంటే మరికొన్ని దేశాలు వాటికి వ్యతిరేక దిశగా కదులుతున్నాయి. ఉదాహరణకు అణ్వాయుధాలను సొంతం చేసుకోవడంలో ఇజ్రాయిల్‌కు సాయపడిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత ఆరు అణు బాంబులను త్యజించింది. అణు కార్యక్రమాన్ని రద్దు చేసింది. అణ్వాయుధ నిల్వలలో ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఉక్రెయిన్ ఆ తర్వాత వాటిని పూర్తిగా వీడింది.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ వంటి దేశాలు తమ సొంత ఆయుధాలను ధ్వంసం చేయడమో లేదా వాటిని వాపసు చేయడమో జరిగింది. ఉక్రెయిన్, బెలారస్, కజకిస్థాన్ వంటి దేశాలు భద్రతా పరమైన హామీలు, అంతర్జాతీయ చట్టబద్ధత, ఆర్థిక మద్దతు పొంది సోవియట్ కాలం నాటి వార్‌హెడ్లను అప్పగించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సౌదీ అరేబియా, టర్కీ, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, పోలండ్ దేశాలు అణు బాంబులను సైనిక ఆస్తిగా, బీమా పాలసీగా చూస్తున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో బలహీనపడుతున్న అమెరికా భద్రత, అణ్వాయుధాలను పెంచుకోవాలని చైనా-రష్యా యోచించడం వంటి పరిణామాలు దీనికి కారణం. బలవంతమైన శత్రు దేశాలను అడ్డుకోవాలంటే అణ్వాయుధాలు తప్పనిసరి అన్న నమ్మకాన్ని ఇరాన్ యుద్ధం పెంచుతోంది. ఉత్తరకొరియా తన శత్రు దేశాలను ఎదుర్కొంటున్న తీరును అణ్వాయుధ రహిత దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే మధ్యప్రాచ్యంలో దాని శత్రువులైన సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ తమ వైఖరిపై పునరాలోచన చేసుకొని ఉండేవి.



