Tuesday, December 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'సమగ్ర' సేవకు…సర్కారు 'శిక్ష'

‘సమగ్ర’ సేవకు…సర్కారు ‘శిక్ష’

- Advertisement -

విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చాలా కీలకం. వారు లేని విద్యాశాఖ నిజంగా అసమగ్రమే. కేంద్ర ప్రభుత్వం బాలికల అక్షరాస్యత పెంపొందించడానికి ప్రవేశపెట్టిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాలలో పరిపాలన, బోధన, ఆరోగ్యం, వంట అన్ని రకాల విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. మండల విద్యా కేంద్రాలలో అన్ని రకాల సమాచార సేకరణ, దానిని క్రోడీకరించి తిరిగి ప్రధాన కార్యాలయాలకు చేరవేత- ఇవి వారి ముఖ్యమైన విధులు. కేజీబీవీలతో పాటుగా అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కూడా వీరి మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. అయినా వీరికి ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఉండవు. పద్దెనిమిదేండ్లుగా పనిచేస్తున్న వీరి జీవితాలలో కానీ, జీతాలలో కానీ ఎదుగు బొదుగు లేదు. ఏప్రిల్‌ నెల చివరి పని దినం రాగానే వీరిని తొలగిస్తారు. మళ్లీ జూన్‌ మాసంలోనే వీరికి పని. ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు అందరూ వీరిపై హామీల వర్షం కురిపించిన వారే. కానీ అవన్నీ నీటి మూటలైనాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉన్నది. సమస్యలు వీరిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉన్నాయి, వెన్నంటే ఉన్నాయి.

రాష్ట్రంలోని 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఇంకా అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో స్పెషల్‌ ఆఫీసర్లుగా, పిజిసి ఆర్టీలుగా, సీఆర్పీలుగా, పిఈటిలు, ఏఎన్‌ఎం, అకౌంటెంట్‌, క్రాఫ్ట్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా, కాపలా దారులుగా, స్వీపర్‌, పారిశుద్ధ్య ఇంకా వంట మను షులుగా పనిచేస్తున్నారు. పాఠశాలల్లో పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు స్కూల్‌ కాంప్లెక్స్‌ స్థాయిలో సీఆర్పీలుగా మండల స్థాయిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సమాచార సమన్వయకర్తలుగా ఇక జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టం అనలిస్ట్‌, సాంకేతిక నిపుణులు లాంటి అనేక ముఖ్యమైన విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పాఠ శాల స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యాలయం వరకు మీరు నిర్వ ర్తించే విధుల ఆధారంగానే బోధన బోధనేతరకార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19600 మందిలో 11400 మంది అంటే కేజీబీవీలలో పనిచేస్తుండగా మిగిలినవారు అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో తమ విధులకు హాజరవుతారు. పుస్తకాల సరఫరా, మధ్యాహ్న భోజనానికి బియ్యం, హాజరు లాంటి ముఖ్యమైన విధులు వీరే చేస్తుంటారు. వీరేమి ఆషామాషీగా నియమింపబడలేదు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహించిన రాత పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికై రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ విధానంలోనే నియమించబడ్డారు. అయినా వీరిపై ప్రభుత్వాలకు దయ, జాలి, కరుణ, సానుభూతి లేవు. వీరిని గూర్చి పట్టించుకున్న నాథుడు లేడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ సమస్యలకు విముక్తి దొరుకుతుందని భావించి నాటి తెలంగాణ ఉద్యమంలోనూ వీరు చురుగ్గానే పాల్గొన్నారు. ‘ప్రభుత్వాలు వీరితో ఆడుకుంటు న్నాయని, తాను ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే వారిని క్రమబద్ధీకరించుతామని” తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం ప్రతినిధులకు అప్పటి ఉద్యమనేత కేసీఆర్‌ హామీనిచ్చారు. తర్వాత ముఖ్యమంత్రిగా పదేండ్లు పనిచేసినా ఈ ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. 2023లో ఈ ఉద్యోగులు చేస్తున్న ధర్నా శిబిరాన్ని సందర్శించిన నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ”కేసీఆర్‌కు విద్య పట్ల శ్రద్ధ లేదని, ప్రయివేటీకరణ అంటే ఆయనకు మోజు” అని విమర్శిస్తూ ”ఈ ఉద్యోగుల సమస్యలు చాలా చిన్నవి. తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే సంఘ ప్రతినిధులను పిలిచి టీ తాగినంత సమయంలోనే వారిని క్రమబద్ధీకరించి ఉత్తర్వులు ఇస్తామని” హామీనిచ్చారు. కానీ అధికారం హస్తగతం చేసుకొని రెండేండ్లయినా ఆ వంద రోజులు రాలేదు, టీ తాగించలేదు, జీవో ఇవ్వలేదు.

2024లో ఏడాది పాలన పూర్తి అయిన సమయంలోనే డిసెంబర్‌ 7 నుండి జనవరి 5 వరకు సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు తమ కోర్కెల సాధనకై సమ్మె చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరై రెండు మూడు నెలల్లో చర్చలు జరిపి కమిటీని నియమించి టైం స్కేల్‌ ఇస్తామని ధర్నాకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ప్రకటించారు. ఆ తర్వాత మరో ఏడాది గడిచినా పరిస్థితిలో మార్పు లేదు. ఇదిగాక, కనీసం సమ్మె కాలానికి జీతం కూడా ఇవ్వలేదు. అసలే అంతంత జీతంతో జీవనం గడుపుతున్న సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులను సమ్మె మరింత కుంగదీసింది. ఆర్థికేతర విషయాలు కూడా పరిశీలిస్తామన్న అమాత్యులు దేనిని పరిష్కరించ లేదు. మహిళలకు ఐదు లీవులు మాత్రం ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వీరికి బదిలీలు లేవు. ఇతర పాఠశాలలకు డ్యూటీపై వెళ్తే కనీసం టీఏ, డీఏ కూడా ఇవ్వరు. ఇప్పుడేమో ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నడుపుతున్న సంస్థలని క్రమబద్ధీకరణ అంత తేలిక కాదని సెలవిస్తున్నారు. మరి హామీలు ఇచ్చేనాడు ఆ సోయి లేదా అనేదే ఈ ఉద్యోగుల ప్రశ్న. అంటే వీరిని ‘బోడ మల్లయ్య’ లుగా వాడుకున్నారన్నమాట.

2008లో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్న నాలుగువందల మంది సీఆర్టీలను నాటి ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. అదేవిధంగా గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ సర్వీస్‌లో నియమింపబడ్డ జూనియర్‌ లెక్చరర్ల పోస్టులను క్రమబద్ధీకరించింది. 2024 జనవరి-ఫిబ్రవరిలో సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లోనూ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్‌ చేసింది. మరి సర్వ శిక్ష అభియాన్‌లోని ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు? వీరికి ఎందుకింత శిక్ష? వీరికి న్యాయం చేస్తామన్న వారంతా పదవిలోకిరాగానే వీరి సమస్యలను, వీరిని మరిచిపోవడం దారుణం. వీరందరినీ విద్యా శాఖలో విలీనం చేయాలని ఏప్రిల్‌లో టెర్మినేషన్‌ విధానం రద్దు చేయాలని, సమ్మె కాలానికి పూర్తి జీతం ఇవ్వాలని, సాధారణ సెలవులు, మెడికల్‌ లీవులు ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా ఇవ్వాలని, అంతర్‌ జిల్లా బదిలీలు జరగాలనేవి వీరి ప్రధాన డిమాండ్లు. వీరికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, వీరికి న్యాయం చేసేది కూడా తమ ప్రభుత్వ మేనని చెప్పిన వారు నేడు ఏదో ఒక కుంటి సాకుతో తప్పించుకుంటున్నారు. ముఖం చాటేస్తున్నారు. కోదండరాం కూడా తాను వారి సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుతానని చెప్పి సంవత్సరకాలం దాటింది. రెగ్యులరైజ్‌ అయ్యేదాకా కనీసం టైం స్కేల్‌ విధానమైనా అమలు చేయాలని సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఆశిస్తున్నారు.

శ్రీ శ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -