– చారిత్రాత్మకమన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
– సూపర్ సిక్స్‌తో సంక్షేమం.. సంపద సృష్టి లక్ష్యమని వెల్లడి
– ఆకట్టుకున్న శకటాలు
అమరావతి : సూపర్ సిక్స్ అమలుతో సంక్షేమం, సంపదను సృష్టించడంతో పాటు, అసమానతల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ అన్నారు. సమైక్య రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఈ వేడుకల్లో సిఎం చంద్రబాబునాయుడు దంపతులు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ దంపతులు, ఐటి మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు హైకోర్టు జడ్జిలు, మంత్రులు పాల్గొన్నారు. తొలిసారి అమరావతిలో గణతంత్ర వేడుకలు జరుగుతుండటంతో స్థానిక రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిచిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి చేసిన ప్రసంగంలో తొలిసారి అమరావతిలో జరుగుతున్న వేడుకలను చారిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ‘తొలిసారి అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న వారితో ఈ శుభక్షణాలను పంచుకోవడం గర్వకారణం. గతంలో రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఆర్థిక విశ్వాసం దెబ్బతింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి’ అని అన్నారు. విద్య, ఆరోగ్యం, వృద్ధ్దల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోందన్నారు. ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని అందులో భాగంగా మెగా డిఎస్‌సి నిర్వహించం, పోలీస్ నియామకాలు చేపట్టడంతో పాటు, స్కిల్ పాస్‌పోర్టు, నైపుణ్యం ప్లాట్ ఫామ్ ద్వారా యువతను సిద్ధం చేస్తున్నామన్నారు. రూ.10 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా 7.5లక్షల ఉద్యోగాలు కొత్త పరిశ్రమలు, థీమాటిక్ నగరాలు అభివృద్ధిలో ఉన్నాయన్నారు. కొత్త ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా 2026 జూన్ నుంచి కుటుంబ కార్డులు జారీ చేస్తామని గవర్నర్ తెలిపారు. లక్షలాదిమందికి జీవనాధారమైన రైతులు, మత్స్యకారులు, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది, భవిష్యత్తును నిర్మిస్తున్న మహిళలు, ఉపాధిని సృష్టిస్తున్న పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్ర ప్రగతికి నిజమైన శిల్పులని గవర్నర్ అభివర్ణించారు.
తొలిసారి అమరావతిలో… ఘనంగా గణతంత్ర వేడుకలు
- Advertisement -
- Advertisement -



