Monday, April 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో తొలిసారిగా..

అమెరికాలో తొలిసారిగా..

- Advertisement -

సియాటెల్‌లో స్వామి వివేకానందుడి లైఫ్‌ సైజ్‌ విగ్రహం
సీటెల్‌ :
అమెరికాలో తొలిసారిగా స్వామి వివేకానందుడి లైఫ్‌-సైజ్‌ (మనిషి పరిమాణంలోని) కాంస్య విగ్రహాన్ని సియాటెల్‌లో ఆవిష్కరించారు. పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన వెస్ట్‌లేక్‌ స్వేర్‌ వద్ద ఈ విగ్రహాన్ని నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అమెరికాలో ఒక నగరపాలక సంస్థ ఇలాంటి వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. సియాటెల్‌లోని భారత రాయబారి ప్రకాశ్‌ గుప్తా, నగర మేయర్‌ కేట్‌ విల్సన్‌ సంయుక్తంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్‌ విల్సన్‌ మాట్లాడుతూ ఈ స్మారక విగ్రహం సియాటెల్‌ నగర సమ్మిళిత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, భారత్‌కు ఈ నగరానికి మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తుందని తెలిపారు. నగరంలోని భారత రాయబార కార్యాలయం ‘చికాగో 1893 నుంచి సియాటెల్‌ 2026 వరకు! ఈ విగ్రహం సియాటెల్‌ నగరానికి నూతన భారతీయ చిహ్నం’ అని ఒక ప్రకటనలో తెలిపింది. గొప్పదైన సియాటెల్‌ బహుఇళ సాంస్కృతిక స్వభావం, సమ్మిళిత స్ఫూర్తికి గుర్తింపుగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌) ఈ విహ్రహాన్ని బహుమతిగా ఇచ్చిందని కూడా ఈ ప్రకటనలో తెలిపింది. ఐసిసిఆర్‌ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెజాన్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భారత శిల్పి నరేశ్‌ కుమార్‌ కుమావత్‌ రూపొందించారు. సియాటెల్‌ నగరాన్ని ప్రతీరోజూ 4 లక్షలకు పైగా సందర్శకులు సందర్శిస్తారని ఒక అంచనా. వారందరికీ వివేకానందుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి గ్రేటర్‌ సియాటెల్‌ పరిధిలోని నగరాల మేయర్లు, వివిధ కమ్యూనిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌ నుంచి వెళ్లిన కళాబృందాలు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -