Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంఎరుకల ఆత్మగౌరవం కోసమే

ఎరుకల ఆత్మగౌరవం కోసమే

- Advertisement -

– నాంచారమ్మ జాతరకు వచ్చా
– తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ- ములుగు

ఎరుకల ఆత్మగౌరవం కోసమే హైదరాబాద్‌ నుంచి ఇంత దూరం నాంచారమ్మ జాతరకు వచ్చానని, నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని, మరింత రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మలుగు జిల్లాలోని రామానుజాపూర్‌ గ్రామపంచాయతీ పరిధి పంట పొలాల మధ్య ఉన్న ఎరుకల నాంచారమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నాంచారమ్మ ఉత్సవ కమిటీ చైర్మెన్‌ లోకిని రాజు ఆధ్వర్యంలో ఎరుకల సంఘం నాయకులు బీఆర్‌ఎస్‌ నాయకులు కల్వకుంట్ల కవితకు సాదరంగా స్వాగతం పలికారు. నాంచారమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం కవిత మాట్లాడారు. ఎరుకల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడి కార్యక్రమం జరుగుతుందన్నారు. సంస్కృతిని రక్షించుకోవాలని, ఉత్సవాలకు ప్రభుత్వం కూడా చేయూతనందించాలని కోరారు. ములుగు నుంచి మంత్రి సీతక్క ఉన్నారని, ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ఇదివరకు చందులాల్‌, సత్యవతి రాథోడ్‌ పనిచేసినప్పుడు అందరూ ఈ ఉత్సవాలకు చేయూత అందించారని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కమ్యూనిటీస్‌ డెవలప్‌మెంట్‌ ఆగకుండా ప్రభుత్వాలు పనిచేయాలని తెలిపారు. నాంచారమ్మ వేషధారణతో ఉన్న వారితో సోది (ఎరుక) చెప్పించుకున్నారు. అనంతరం అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాటి రవికుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోనేటి నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్‌ ఆనంద్‌, బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్‌ బాబు, మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, జాగృతి నాయకులు అంతటి రాము, ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కేతిరి బిక్షపతి, నాయకులు పల్లకొండ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -