Tuesday, May 20, 2025
Homeజాతీయంబలవంతపు మతమార్పిడులను రాజ్యాంగం సమర్థించదు

బలవంతపు మతమార్పిడులను రాజ్యాంగం సమర్థించదు

- Advertisement -

– అలహాబాద్‌ హైకోర్ట్‌ రూలింగ్‌
ప్రయాగరాజ్‌ : భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చని, దాని గురించి ప్రచారం చేయవచ్చునని, అయితే అది బలవంతపు లేదా మోసపూరిత మతమార్పిడులను సమర్థించదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధానికి సంబంధించిన ఉత్తరప్రదేశ్‌ చట్టం కింద నలుగురు వ్యక్తులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చిన సందర్భంగా న్యాయమూర్తి వినోద్‌ దివాకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నిందితులకు డబ్బు, ఉచిత వైద్య చికిత్స ఆశ చూపి క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తు న్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మేరకు వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసును రద్దు చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. నిందితులపై మోపిన ఆరోపణలు తీవ్రమైనవని, పోలీసు విచారణకు అవి సరిపోతాయని తెలిపింది. ”ఆర్టికల్‌ 25 ప్రకారం భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించింది. ఏ మతంపైన అయినా విశ్వాసాన్ని కలిగి ఉండేందుకు, దానిని ఆచరించేందుకు, ప్రచారం చేసేందుకు ఈ అధికరణ వీలు కల్పిస్తోంది. ఆర్టికల్‌ 25లోని ‘స్వేచ్ఛగా’ అనే పదం మత విశ్వాసం, వ్యక్తీకరణల స్వచ్ఛంద స్వభావాన్ని నొక్కి చెబుతోంది. అయితే బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడులను రాజ్యాంగం అనుమతించడం లేదు. మత ప్రచారం పేరుతో బలవంతపు లేదా మోసపూరిత పద్ధతులకు అది రక్షణ కల్పించదు” అని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. సామాజిక నిర్మాణానికి అంతరాయం కలిగించకుండా లేదా వ్యక్తిగత, సామూహిక శ్రేయస్సుకు హాని కలిగించకుండా మత స్వేచ్ఛను వినియోగించుకునే విషయంలో పరిమితులు అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘ఒక మతం మరో మతం కంటే ఉన్నతమైనదనే భావన దాని నైతిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఇలాంటి భావన లౌకికవాద ఆలోచనలకు విరుద్ధం. భారతీయ లౌకికవాదం అన్ని మతాలకు సమాన గౌరవాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ఏ మత ఆధారంగానూ గుర్తింపు పొందకూడదు. అలాగే ఏ మతానికీ అనుకూలంగా వ్యవహరించకూడదు. అన్ని మతాలు, విశ్వాసాల నుంచి సమాన దూరాన్ని పాటించాలి’ అని హితవు పలికింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడుల చట్టాన్ని న్యాయస్థానం సమర్థించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -