Tuesday, July 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబలవంతగా యుద్ధంలోకి...ఇజ్రాయిల్‌ సైనికుల బలవన్మరణం

బలవంతగా యుద్ధంలోకి…ఇజ్రాయిల్‌ సైనికుల బలవన్మరణం

- Advertisement -

”నేను ఎన్నో మృతదేహాల వాసనను భరించాను. ఇక భరించలేను” ఇది గాజా స్ట్రిప్‌, లెబనాన్‌ యుద్ధంలో సైనిక సేవల్లో పాల్గొన్న డానియర్‌ ఎడ్రీ అనే సైనికుడు తన సూసైడ్‌ నోట్‌లో రాసిన వ్యాఖ్యలివి. ఒక ఏడాది పాటు ఆపరేషనల్‌ డ్రైవర్‌గా పనిచేసిన అతను.. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇటీవల బిరియా ఫారెస్ట్‌లో తనను తాను గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. గాజాలో యుద్ధ అనుభవాల తర్వాత ఎలిరాన్‌ మిజ్రాహీ అనే సైనికుడు పోస్ట్‌-ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్డీ) అనే మానసిక వ్యాధితో బాధపడుతూ.. మళ్లీ యుద్ధానికి పిలిచే ముందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గోలానీ బ్రిగేడ్‌ కు చెందిన మరో సైనికుడు స్దేతైమన్‌ సైనిక స్థావరంలో తన సహచరుడి రైఫిల్‌తో కాల్చుకొని సూసైడ్‌ చేసుకున్నాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 2023 అక్టోబర్‌లో హమాస్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎంతోమంది ఇజ్రాయిలీ సైనికులు మానసిక కుంగుబాటుతో ప్రాణాలు తీసుకున్నట్టు అనేక నివేదికల ద్వారా స్పష్టమవుతున్నది.

బలవంతంగా యుద్ధంలోకి
యుద్ధకాంక్షతో గాజాలో మారణహోమాన్ని సృష్టించడమే కాకుండా.. లెబనాన్‌ తోపాటు పలు దేశాలపై తరచూ దాడులకు పాల్పడుతూ సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇజ్రాయిల్‌, సొంత సైనికుల ప్రాణాల గురించి కూడా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతున్నది. గాజాలో 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత సుమారు 390 మంది సైనికులు మరణించినట్టు స్వయంగా ఐడీఎఫ్‌ వెల్లడించింది. అయితే ఇవి దీనికి రెట్టింపు ఉండవచ్చని తెలుస్తున్నది. సైనికుల కొరత కారణంగా ఇజ్రాయిల్‌ రిజర్విస్టుల పేరుతో లక్షలాది మందిని బల వంతంగా యుద్ధభూమి లోకి పంపిస్తున్నది. గాజాలో యుద్ధాన్ని విస్తరించడానికి ఇజ్రాయెల్‌ సుమారు మూడు లక్షల మంది రిజర్విస్టులను పిలిచింది. వీరిలో చాలా మందికి యుద్ధంలోకి వెళ్లడానికి ఇష్టం లేకపోయినా.. బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా యుద్ధంలోకి తిరిగి పంపించినట్లు హారెట్జ్‌ అనే మీడియా సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ‘మా సైనికులు యుద్ధం చేయడానికి నిబద్ధత చూపడం లేదు. అందుకే మేము మానసికంగా అస్థిరంగా ఉన్న వారిని కూడా నియమిచుంకోవాల్సి వస్తున్నది’ అని ఒక సైనిక అధికారి తమకు చెప్పినట్లు హారెట్జ్‌ తన నివేదికలో పేర్కొన్నది.

మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు
సాధారణ పౌర జీవితంలో ఉన్న వారిని రిజర్విస్టులుగా.. గాజా, లెబనాన్‌లో యుద్ధం కోసం ఇజ్రాయిల్‌ బలవంతంగా పంపించింది. యుద్ధ ఒత్తిడి, ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో ఈ రిజర్విస్టులు తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. పదేపదే హింసాత్మకదృశ్యాలు, పౌర మరణాలు చూడడంతోపాటు మృతదేహాల రవాణా వంటి భయానక అనుభవాలను ఎదుర్కోవడంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో సైనికుల్లో పోస్ట్‌-ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీడీఎస్‌) బాధితుల సంఖ్య పెరిగినట్టు అనేక నివేదికలు చెబుతున్నాయి. బలవంతంగా యుద్ధంలోకి నెట్టడం, మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో ఇజ్రాయెల్‌ సైనికుల ఆత్మహత్యల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. ఇజ్రాయెలీ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ఆత్మహత్యల గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. హారెట్జ్‌, అల్‌ మయాదీన్‌ వంటి మీడియా సంస్థలు పలు అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. గాజాలో యుద్ధం ప్రారంభ మైన 2023 అక్టోబర్‌ నుండి 43 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ సంస్థలు నివేదించాయి. ఈ సంఖ్య 2011 తర్వాత అత్యధికమని పేర్కొన్నాయి. కాగా, ఈ ఆత్మహత్యల్లో ఎక్కువ భాగం రిజర్విస్టులదని, వీరు గాజా, లెబనాన్‌లోని యుద్ధ రంగాల్లో తీవ్రమైన హింసను చూశారని పేర్కొన్నాయి.

పట్టించుకోని ఇజ్రాయిల్‌
యుద్ధంలో ఇజ్రాయిల్‌ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా.. మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. ఆ దేశ పాలకులు పట్టించుకోవడం లేదు. సైనికులకు మానసిక ఆరోగ్యం విషయంలో సహాయం కోసం 800 మంది మానసిక ఆరోగ్య అధికారులను నియమించినప్పటికీ.. చాలామంది సైని కులు తగిన సమయంలో సహాయం పొందలేకపోతు న్నారు. ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకా రమే.. సుమారు పదివేల మంది మంది సైనికులు శారీరక లేదా మానసిక గాయాలతో బాధపడుతున్నారు. వీరిలో 35శాతం మంది తీవ్ర మానసిక ఆరోగ్య సమస్య లను ఎదుర్కొంటున్నారు. ఒక నివేదిక ప్రకారం సుమారు తొమ్మిది వేల మంది సైనికులకు మానసికంగా అశక్తులు గా ఇజ్రాయిల్‌ వర్గీకరించింది. అయితే ఈ వాస్తవాలన్నిం టినీ బహిర్గతం చేయడానికి ఇజ్రాయిల్‌ భయపడు తున్నది. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న సోల్జర్స్‌కు సైనిక అంత్యక్రియలు చేయడానికి కూడా నిరాకరిస్తున్నది.
– మహమ్మద్‌ ఆరిఫ్‌, 7013147990

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -