Thursday, December 25, 2025
E-PAPER
Homeజాతీయంఆరోగ్య రంగంపై 'విదేశీ' పట్టు

ఆరోగ్య రంగంపై ‘విదేశీ’ పట్టు

- Advertisement -

వంద శాతం ఎఫ్‌డీఐతో అనర్థాలు
ప్రయివేటు ఆస్పత్రులు ఇతర దేశాల యాజమాన్యాల చేతికి..
లాభార్జనే పరమావధి.. వైద్యులపై ఒత్తిళ్లు
డాక్టర్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం
విదేశీ సర్వర్లలో భారతీయుల హెల్త్‌ డేటా
చికిత్స, మందులకు అయ్యే ఖర్చులు పెరుగుదల
వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన
మోడీ సర్కారు విధానాలపై తీవ్ర ఆగ్రహం

పార్లమెంటులో వందేమాతరం, పౌరసత్వం, సరిహద్దులు, రక్షణ అంటూ దేశభక్తి ప్రసంగాలకే మోడీ సర్కారు పరిమితమవుతున్నది. ప్రజల సమస్యలను మాత్రం గాలికొదిలేస్తున్నది. పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు వంటి రాష్ట్రాలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో లబ్ది పొందేందుకు పార్లమెంటును వేదికగా వినియోగించుకొంటున్న మోడీ ప్రభుత్వం.. దేశానికి తీరని నష్టం చేస్తున్నది. మోడీ సర్కారు చర్యలతో భారత ఆరోగ్య వ్యవస్థ విదేశీపెట్టుబడి శక్తుల చేతుల్లోకి జారిపోతున్నది. వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంతో ఆస్పత్రులను సేవా కేంద్రాల నుంచి కార్పొరేట్‌ లాభ యంత్రాలుగా మార్చుతుంది. ఇలాంటి తరుణంలో పార్లమెంటులో భారత దేశ ఆరోగ్య వ్యవస్థ మాత్రం ఎలాంటి చర్చకూ నోచుకోలేదు. దీంతో కేంద్రం తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

న్యూఢిల్లీ : భారత్‌లో ఆరోగ్య వ్యవస్థ ఒక నిశబ్ద సంక్షోభంలోకి ప్రవేశించిందని పలువురు వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, విధాన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆ సంక్షోభానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న కీలక విధాన నిర్ణయాలే మూలమని అంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎలాంటి పరిమితులూ లేకుండా అనుమ తించడం.. దేశీయ వైద్య వ్యవస్థను అంతర్జాతీయ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేలా చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విధానాన్ని ‘పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి’ పేరుతో సమర్థించుకుంటున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలు మారడమే కాకుండా చికిత్స విధానం, వైద్య నిర్ణయాలు, రోగి-వైద్య సంబంధం కూడా కార్పొరేట్‌ ఒత్తిళ్లకు లోనవుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ప్రముఖ ‘విదేశీ’ ఆస్పత్రులు
గత దశాబ్దంలో భారత్‌లోని పలు ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రులు ఒక్కొక్కటిగా విదేశీ పెట్టుబడి సంస్థల ఆధీనంలోకి వెళ్లాయి. మణిపాల్‌ హాస్పిటల్స్‌, ఆస్టర్‌ డీఎం, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, కేర్‌ హాస్పిటల్స్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వంటి పేర్లు ఒకప్పుడు దేశీయ వైద్య రంగానికి ప్రతీకలుగా నిలిచాయి. ఇప్పుడవి సింగపూర్‌, అమెరికా, కెనడా, మలేషియా, వంటి దేశాల్లోని ప్రయివేటు ఈక్విటీ సంస్థలు, పెన్షన్‌ ఫండ్స్‌, పెట్టుబడి నిధుల ఆర్థిక ఆస్తులుగా మారి పోయాయి. అయితే ఇది సాధారణ పెట్టుబడుల ప్రవాహం కాదనీ, ఇది భారతదేశ ఆరోగ్య వ్యవస్థపై యాజమాన్య నియంత్రణను విదేశీ కార్పొరేట్లకు అప్పగించిన ప్రక్రియగా వైద్యరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

సంప్రదింపులు జరపని కేంద్రం
2014 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు.. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నినాదంతో అనేక రంగాలలో విదేశీ పెట్టుబడులకు దారులు తెరిచింది. రక్షణ, ఇన్సూరెన్స్‌, రిటైల్‌తోపాటు ఆరోగ్య రంగం కూడా ఇందులో భాగమైంది. అయితే ఆరోగ్య రంగం సాధారణ పరిశ్రమ వంటిది కాదనీ, ఇది ప్రజల జీవన హక్కుతో నేరుగా ముడిపడి ఉన్నదన్న నిజాన్ని ప్రభుత్వం పక్కనబెట్టిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. పార్లమెంటులో సరైన చర్చ, రాష్ట్రాలతో సమగ్ర సంప్రదింపులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం… దీర్ఘకాలంలో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య విధాన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చికిత్స ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి?
భారత్‌లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులు గత కొన్ని ఏండ్లలో విపరీతంగా పెరిగాయి. సాధారణ శస్త్ర చికిత్సలు కూడా రూ.లక్షల్లో ఖర్చవుతున్నాయి. ఈ పెరుగుదలకు కారణం వైద్య సాంకేతికత మాత్రమే కాదనీ, లాభాల ఒత్తిడే ప్రధాన కారణమని పలువురు వైద్యులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులకు త్రైమాసిక లాభాలు చూపించాల్సిన అవసరం ఉండటంతో.. ఆస్పత్రులు ఖరీదైన డయాగ్న‌స్టిక్‌ పరీక్షలు, అవసరం లేని ప్రోసీజర్లను ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే దీని ప్రభావం నేరుగా రోగుల మీద పడుతోంది. ఫలితంగా సాధారణ, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.

పేదల వైద్యం ఎక్కడీ
ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలను మోడీ ప్రభుత్వం గొప్ప విజయంగా ప్రచారం చేసుకుంటున్నది. అయితే ప్రయివేటు ఆస్పత్రులు ఈ పథకాల కింద రోగులను పెద్దగా స్వీకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. లాభం తక్కువగా ఉండే కేసులను తిరస్కరిం చడం, పరోక్షంగా ప్రభుత్వ ఆస్పత్రులపై భారం మోపడం జరుగుతోందని ఆరోగ్య కార్యకర్తలు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రాకుండా పోతుండటం మోడీ ప్రభుత్వ విధాన వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫార్మా పరిశోధనలకు భారత ఆస్పత్రుల డేటా?
భారత ఆస్పత్రుల్లో సేకరించిన డేటాను ఆధారంగా చేసుకుని విదేశీ ఔషధ కంపెనీలు కొత్త మందులు అభివృద్ధి చేస్తున్నాయన్న అంశం మరో వివాదంగా మారింది. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన మందులు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ లాభాలు తెస్తున్నప్పటికీ.. భారతీయులకు మాత్రం అధిక ధరలతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఈ ప్రక్రియలో దేశీయ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందన్న విమర్శలు బలపడుతున్నాయి.

జాతీయ భద్రత కోణం
కొంతమంది నిపుణులు ఆరోగ్య డేటా లీకేజీని జాతీయ భద్రత కోణంలో చూడాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు. భారీస్థాయిలో జన్యు సమాచారం విదేశీ సంస్థల చేతుల్లో ఉండటం భవిష్యత్తులో ప్రమాదాలకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై మోడీ సర్కారు ఇప్పటి వరకూ ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు.

విపక్షాల ఆరోపణలు
విపక్ష పార్టీలు ఈ అంశాన్ని మోడీ ప్రభుత్వ ‘కార్పొరేట్‌ అనుకూల పాలన’కు మరొక ఉదాహరణగా అభివర్ణిస్తున్నాయి. ఆరోగ్యం వంటి కీలక రంగాన్ని నియంత్రణ లేకుండా విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించటం సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకోవడమేనని ఆరోపిస్తున్నాయి. పార్లమెంటులో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలనీ, విధానాలను పున:సమీక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ముందు దారి ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్య రంగంలో విదేశీ పెట్టుబడులకు స్పష్టమైన పరిమితులు విధించటం, రోగుల డేటాను దేశంలోనే నిల్వ చేయడం, కార్పొరేట్‌ ఆస్పత్రులపై కఠినమైన నియంత్రణలు విధించటం వంటివి అవసరం. లేకపోతే భారత ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా విదేశీ కార్పొరేట్‌ శక్తులకు ఒక లాభాల ఆటగా మారిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అభివృద్ధి పేరుతో మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో ప్రజారోగ్యం ప్రమాదంలోకి నెట్టబడిందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వైద్య వృత్తిపై కార్పొరేట్‌ ఒత్తిడి
మోడీ ప్రభుత్వం ప్రోత్సహించిన కార్పొరేటీకరణ, వైద్య వృత్తి స్వతంత్రతను కూడా దెబ్బ తీస్తున్నదని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనేక ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యుల పనితీరును రెవెన్యూ టార్గెట్లతో కొలుస్తున్నారు. ఎంత ఆదాయం తెచ్చారు అన్నదే ప్రమాణంగా మారుతోంది. దీని ఫలితంగా వైద్యులు నైతిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. తాము అవసరానికి మించిన పరీక్షలు సూచించాల్సి వస్తున్నదని వైద్యులు వాపోతున్నారు. ఇది వైద్య వృత్తి మూల సూత్రాలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హెల్త్‌ డేటా.. కొత్త వివాదం
ప్రయివేటు ఆస్పత్రుల్లో సేకరిస్తున్న రోగుల వైద్య సమాచార భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రక్త పరీక్షలు, స్కాన్లు, జన్యు సమాచారం వంటి సున్నితమైన డేటా విదేశీ సర్వర్లలో నిల్వ అవుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ డేటాను కృత్రిమ మేధస్సు(ఏఐ) ఆధారిత పరిశోధనలు, ఇన్సూరెన్స్‌ విశ్లేషణల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోగ్య విధాన నిపుణులు చెప్తున్నారు. డేటా రక్షణ చట్టాలపై ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఆరోగ్య డేటాను జాతీయ భద్రత అంశంగా పరిగణించకపోవడం మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -