ముంబయి : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో ఒక్క వారంలోనే భారీ పతనం చోటు చేసుకుంది. నవంబర్7తో ముగిసిన వారంలో ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు తగ్గి687.73 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించింది.ఇది ఇంతక్రితం వారంలోనూ 5.6 బిలియన్ డాలర్లు పతనమై 689.73 బిలియన్లకు పరిమితమయ్యాయి. ఫారెక్స్ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు నవంబర్7తో ముగిసిన వారంలో 2.45 బిలియన్ డాలర్లు తగ్గి 562.13 బిలియన్లకు తగ్గాయని ఆర్బీఐ తెలిపింది. ఈ ఆస్తులలో యూరో, యెన్, పౌండ్ వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే విలువలో హెచ్చు తగ్గులు చెందడం ఈ తగ్గుదలకు కారణం. బంగారం నిల్వలు 1.95 బిలియన్లు తగ్గి 101.53 బిలియన్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో పసిడి నిల్వలు 100 బిలియన్లకు చేరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 51 మిలియన్లు తగ్గి 18.59 బిలియన్ డాలర్లకు తగ్గాయని వెల్లడించింది.



