– అటవీ వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామాంజనేయులు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / బొమ్మలరామారం
జిల్లావ్యాప్తంగా అటవీ వ్యవసాయం విస్తరించాలని అటవీ వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామాంజనేయులు అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలంలోని యావపూర్ గ్రామంలో గిరిజన ఉప ప్రణాళిక ఆర్థిక సహాయంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, అటవీ వ్యవసాయ విభాగం, ఏరువాక కేంద్రం భువనగిరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన రైతులకు అటవీ మొక్కల పంపిణీతో పాటు యజమాని పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ వ్యవసాయంలో రైతులు చొరవ చూపి.. శ్రీగంధం, మామిడి, సీతాఫలం, వెదురు, అల్లనేరేడు, మహాగొని, నీలగిరి, కుంకుడు, మలభారు వేప తదితర వృక్షాలను పెంపకం చేపట్టి, అధిక లాభాలను పొందాలన్నారు. అటవీ వ్యవసాయమంటే చెట్ల మధ్య వ్యవసాయమని, చెట్లను పెంచడంతో పాటు వాటి మధ్య ఖాలీ స్థలములో పంటలు వేసుకొని, వాటితో పాటు పశువులను పెంచుకోవచ్చన్నారు. రైతులకు షెడ్యూల్డ్ తెగల ఉపప్రణాళిక ఆర్థిక సహాయంతో సీతాఫలం, వెదురు, మహాగొని మొక్కలు , స్ప్రేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లను రైతులకు అందజేశారు. అటవీ వ్యవసాయం శాస్త్రవేత్తలు రమేశ్ , విజయలక్ష్మి , జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త , సమన్వయకర్త డాక్టర్ డి శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్, యాదగిరిగుట్ట వ్యవసాయ సహాయ సంచాలకులు శాంతినిర్మల , మండల వ్యవసాయాధికారి దుర్గేశ్వరి, బొమ్మలరామారం మండల పరిషత్ అధికారి రాజ త్రివిక్రమ్, షెడ్యూల్డ్ కులాల రైతులు మాడావత్ రాజు నాయక్, రాములు, పాంగోతు రాము, కమల మొదలగు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.