– కార్పొరేట్ల కోసం అడవుల నుంచి ఆదివాసుల తరలింపు : ఏఏఆర్‌ఎం సమావేశంలో బృందాకరత్
– గిరిజనుల హక్కులు హరిస్తున్న మోడీ ప్రభుత్వం : బి.వెంకట్ ొ జనగణనపై రాష్ట్రపతి, గవర్నర్లకు వినతులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం విధానాల రూపకల్పన చేస్తూ అమలుకు యత్నిస్తోందని సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్ విమర్శించారు. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్‌ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగాయి. జనగణన పత్రంలో ఆదివాసులను అదర్స్ కాలమ్‌లో నమోదుకు సిద్ధం చేయటాన్ని ఏఏఆర్‌ఎం సమావేశం తీవ్రంగా వ్యతిరేకిం చింది. అదర్స్ కాలమ్ స్థానంలో ఎస్టీ అని పెట్టాలనీ, రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లకు వినతులు సమర్పించాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బృందా కరత్ మాట్లాడుతూ కార్పొరేట్ల కోసం అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. టైగర్ జోన్‌లుగా ప్రకటించి, అక్కడి నుంచి ఆదివాసులను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రెజిల్‌లో పర్యావరణంపై జరిగిన సమ్మిట్‌లో ప్రధాని మోడీ మొక్కలు పెంచి, అడవులను విస్తరిస్తామని ప్రకటించారని, కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా అడవులను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. అలాగే భూసేకరణ చట్టం-2013 ప్రకారం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించటం లేదన్నారు. అడవుల్లో బీజేపీ, సంఘపరివార్ కార్యకలాపాలను పెరిగాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.
ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగం షెడ్యూల్స్ 5, 6తో ఆదివాసులకు రాజ్యాంగ పరంగా హక్కులు, రక్షణ కల్పించిందని అన్నారు. మోడీ ప్రభుత్వం వాటిని భక్షించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని విమర్శించారు. గ్రామ సభలు ఆమోదించిన లక్షల దరఖాస్తులకు పట్టాలివ్వకుండా ప్రభుత్వమే ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం అంతిమ అధికారాలను ఇచ్చిందని, మోడీ సర్కారు వీటిని లెక్క చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో అటవీ ప్రాంతాల్లోని అపారమైన వనరులను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు, విదేశీ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మిడియం బాబూరావు, కిల్లో సురేంద్ర, సచిన్, లోతా రామారావు, ధర్మనాయక్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం
- Advertisement -
- Advertisement -