Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeసోపతివిస్మృత బాల సాహితీవేత్త 'చెరకు శశిరేఖ'

విస్మృత బాల సాహితీవేత్త ‘చెరకు శశిరేఖ’

- Advertisement -

సాహిత్య చరిత్రలో అనేక మంది అనేకానేక కారణాలతో రికార్డు కాలేదు. మరికొందరు ఆ దిశగా తమ ఆసక్తిని చూపలేదు. ఇతర విభాగాల్లో లాగానే తెలంగాణ బాల సాహిత్యకారుల్లో నమోదుకానివారు వందలాది మంది ఉన్నారు. ‘నవ తెలంగాణ’ నిర్వహిస్తున్న ఈ శీర్షిక అటువంటి నూటా యాభైకి పైగా బాల సాహితీవేత్తలను రికార్డు చేసింది.
ఇప్పుడు మనం చర్చించుకుంటున్న వారు కూడా అటువంటి బాల సాహితీవేత్తయే. నాకు తెలిసి శ్రీమతి చెరకు శశిరేఖ అన్న పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నా వంటి ఒకరు లేదా ఇద్దరు మాత్రం తలవూపవచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు… తను మాత్రం చరిత్రలో నమోదు కాలేదు. శ్రీమతి చెరకు శశిరేఖ హైదరాబాద్‌లోని బాలగూడలో పుట్టారు. బాల్యం, విద్యాభ్యాసం హనుమకొండలో సాగాయి. వివాహంతో నివాసం కరీంనగర్‌కు మారింది. చివరి రోజులు హైదరాబాద్‌లో గడిపారు. వివిధ ఉద్యోగాలు చేసినప్పటికీ ఎక్కువ కాలం హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ విద్యార్థినుల ఆవాస గృహానికి వార్డెన్‌గా పనిచేశారు.
పాట శశిరేఖమ్మకు ఇష్టమైన ప్రక్రియ. వందలాది బతుకమ్మ పాటలను తాను స్వయంగా రాసి పాడేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరి పాటలు, గేయాలు పలు పత్రికల్లో వచ్చాయి. తెలంగాణ భాష, గ్రామీణయాస వీరి గీతాల్లో కనిపించేవి. నేను అనేక సందర్భాల్లో వీరి పాటలు విన్నాను. అయితే తన పాటలను, గేయాలను సేకరించి లేదా నిక్షిప్తంచేసి ఉంచాలన్న సోయి లేకపోవడంతో వీరితోనే వీరి పాటలు కాలగర్భంలో కలిసిపోయాయి.
వందలాదిగా కవితలు, గేయాలు, కొన్ని కథలను రాశారు శశిరేఖ. అనేక పారాయణాలు, సత్సంగాలలో స్వయంగా తన గేయాలను కవితలను చదివి వినిపించేవారు. ఆర్థిక ఇబ్బందులతో పుస్తకాలుగా వాటిని తేలేకపోయారు వీరు. యాదృచ్ఛికంగా తెలుగు విశ్వవిద్యాలయం వారి పుస్తక ముద్రణా ఆర్థిక సహాయం ప్రకటన చూసి బాలల కోసం రాసుకున్న వివిధ గేయాలు, కవితలను ఒకచోట చేర్చి పంపగా అవి సహాయానికి ఎంపికయ్యాయి. అలా ‘రామచిలుక’ పేరుతో వీరు పిల్లల కోసం రాసిన రచనలు అచ్చులో వచ్చాయి.
పిల్లలకోసం నిరంతరం తపనతో ఆలోచించే వీరు తన గేయాల్లో ఆది దేవుడు గణపతి మొదలుకుని అమ్మా-నాన్న, గురువు, దైవం, పక్షులు, తాజ్‌మహల్‌ వంటి అనేక అంశాలను రచనలుగా చేశారు. ‘జైజై గణేశా! జైజైలు గణేశా!/ దండాలు దండాలయ్య గణేశా/ మా తొలి వందనాలు నీకేనయ్యా’ అంటూ జయం పలికిన శశిరేఖ మరోచోట ‘బుజ్జి బుజ్జి ఓ గణపయ్య/ కోటి దండాలు నీకయ్య’ అంటారు. అమ్మను ‘అపురూప అమృత వర్షిణి’గా అద్భుతంగా వర్ణించిన శశిరేఖ, నాన్న గురించి ‘నన్ను చూస్తే నీ కోపం కరిగే వెన్న! చేయిపట్టుకుని నడిపించే మా నాన్న’ అంటారు. ఈ ‘రామచిలుక’లో నూటారెండు గేయాలు, కవితలు ఉన్నాయి. అన్నింటిలోనూ పిల్లలకు చెప్పాలన్న ఆర్తి, ప్రేమ అక్షరమక్షరాన కనిపిస్తాయి. ఇంకోచోట తాను పూబాలగా మారిన కవయిత్రి ‘పువ్వులం మేం పువ్వులము/ అందాలొలుకు సుమ బాలలము/ శుభోదయమే మా నవోదయము’గా చెబుతారు. స్నేహాన్ని గురించి చక్కగా చెబుతారీమె. ‘స్నేహమనే భావన కదిలితే/ మనసంతా హారు హారు’ అట..! ఇంకా అది ‘తీయదనాల మూట’ నట.
‘చిన్నకృష్ణా చిలిపి కృష్ణా ఎక్కుడున్నావూ/ బాలకృష్ణా మోహనకృష్ణా ఏంచేస్తున్నావు’ అని కృష్ణున్ని యశోదమ్మగా లాలనచేస్తూనే ‘నీ అల్లరి పనులు నేను భరించలేను దొంగకృష్ణా/ నీతో ఆటలాడను, మాటలాడను చిలిపికృష్ణా’ అంటుందీమె. కోడిపుంజు వేకువకూతను ‘కోడిపుంజు కూసింది కొక్కోరోకో/ ఇది పల్లె మేలుకొలుపు గడియారం/ అనాదిగా అలారం లేనిదీ గడియారం’ అంటుంది. ఇంకోచోట ‘స్వచ్ఛత’ గురించి చెబితే, మరోచోట ‘తంగేడుపువ్వు’ గురించి వర్ణిస్తుంది. తెలంగాణ రాజ్యచిహ్నాలపై కూడా చక్కని గేయం రాసారీమె. ‘చిన్నారి చిట్టి పాపల్లారా!/ బుజ్జిబుజ్జి పాపల్లారా!’ అంటూ ‘నేను చందమామను’ గేయంలో పిల్లలను, వాళ్ళ ఆటపాటలను వెన్నెలపడి మెరిసే దివ్వెలుగా చెబుతారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శశిరేఖ ఇక్కడి తహజీబ్‌ తెలిసినవారు. దానిని తన బాలల గేయాల్లో ‘హిందూ ముస్లిం భాయీ భాయీ/ మనమంతా కలిసుంటేనే హాయి హాయి/ కుల మత భేదములెందుకోయీ/ ఆలోచించి చూడరా తెలుస్తుంది భాయి’ అని చెబుతారు. ‘మూడురంగుల మన జండా/ ముచ్చటైనది మన జండా’ అంటూ మన జాతీయ పతాకం గురించి రాసినా, ‘అన్నా! ఓ రైతన్నా! మా/ ప్రాణదాతవు నీవన్నా!’ అని రైతును జ్ఞాపకం చేసినా ఒక భక్తి, గౌరవం అందులో మనకు కనిపిస్తాయి. శ్రీమతి చెరకు శశిరేఖమ్మ తన ‘రామచిలుక’ పుస్తకాన్ని బాలల గేయాల సంపుటిగా పేర్కొన్నప్పటికీ ఇందులో గేయాలకన్నా కవితలే ఎక్కువగా కనిపిస్తాయి. తన తొలి పుస్తకాన్ని అచ్చులో చూసుకున్న శ్రీమతి శశిరేఖమ్మ సంవత్సరం క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. నివాళి!

డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad