Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ-చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (84) అనారోగ్యకారణాలతో సోమవారం మృతిచెందారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్‌ అండ్‌ సర్వీసెస్‌ సిండికేట్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొండా లక్ష్మారెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ ఎన్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యక్షునిగా కూడా లక్ష్మారెడ్డి పనిచేశారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్‌లో సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు కొండా లక్ష్మారెడ్డి. తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) ప్రతినిధి, గ్రీవెన్స్‌ సెల్‌ చైర్మెన్‌తో సహా వివిధ పదవులను నిర్వహించారు. కొండా లక్ష్మారెడ్డి 1983-85 మధ్యకాలంలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. అనంతరం 1999, 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

కొండా లక్ష్మారెడ్డి మృతిపై సీఎం సంతాపం
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఎన్‌ఎస్‌ఎస్‌ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన సేవలందించారని కొనియాడారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా లక్ష్మారెడ్డి మృతిపై సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -