ఫిబ్రవరి ఒకటిన నందినగర్ ఇంట్లో విచారణకు హాజరుకండి
ఇంటి గోడకు నోటీసు అంటించిన సిట్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు సిట్ రెండోసారి నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్‌లో మీ నినివాసంలో విచారిస్తామనీ, అందుబాటులో ఉండాలని స్పష్టంగా పేర్కొంది. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ నివాసానికి నోటీసు ఇవ్వడానికి సిట్ అధికారులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడ సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉన్నారు. దాంతో సిట్ అధికారులు తాము తీసుకొచ్చిన నోటీసును అక్కడ గోడకు అంటించారు. అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి సిట్ అధికారులు నిరాకరించారు. తాము 160 సెక్షన్ ప్రకారం నోటీసు ఇస్తున్నామనీ, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని అందులో సిట్ పేర్కొంది.
మీరు కోరినట్టు ఎర్రబెల్లిలో ఉంటున్న వ్యవసాయ క్షేత్రానికి రావడం సాధ్యపడదనీ, విచారణ కోసం తాము వినియోగిస్తున్న సున్నితమైన రికార్డింగ్ పరికరాలు, సాంకేతికతను అక్కడకు తీసుకురావడం సాధ్యపడదని స్పష్టం చేసింది. అధికారిక రికార్డుల ప్రకారం మీ నివాస స్థలం చిరునామాగా నందినగర్‌లోని ఇంటి పేరే ఉందని పేర్కొంది. నందినగర్‌లోని నివాసంలోనే కేసీఆర్‌ను విచారించాలని సిట్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఇచ్చిన నోటీసుకు కేసీఆర్ స్పందిస్తూ…తనను ఎర్రబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోనే విచారించాలనీ, భవిష్యత్తులో ఇచ్చే ఏ నోటీసులనైనా ఆ చిరునామాకే పంపించాలని సిట్‌కు రాసిన లేఖలో కోరిన విషయం విదితమే. 65 ఏండ్లు పైబడిన వారిని వారు ఉంటున్న ప్రదేశానికే వచ్చి విచారించాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా కేసీఆర్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
తాజాగా కేసీఆర్‌కు నోటీసులిచ్చే ముందు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమైంది. నోటీసు అంశంపై సుధీర్ఘంగా చర్చించింది. కేసీఆర్ లేవనెత్తిన కొన్ని అంశాలను న్యాయ నిపుణులతో చర్చించి నందినగర్‌లోని నివాసంలోనే విచారణ సాగించాలని తుది నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉంటే సిట్ ఇచ్చిన నోటీసుపై కేసీఆర్ తరుఫు న్యాయవాదులు స్పందిస్తూ..తక్షణం 160 ప్రకారం కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడం చెల్లదనీ, ముఖ్యంగా 65 ఏండ్లు పైబడిన వారు ఎక్కడ ఉంటే అక్కడకే వెళ్లి విచారించాలనే సుప్రీం ఆదేశాలున్నాయని వాదించారు. మరోవైపు, తాజా పరిణామాలపై ఎర్రబెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో బీఆర్‌ఎస్ అగ్రనాయకులు హరీశ్‌రావు, జగదీశర్వర్‌రెడ్డితో పాటు మరికొందరు న్యాయనిపుణులతో కేసీఆర్ సమావేశమైనట్టు తెలిసింది. నందినగర్‌లో విచారణకు హాజరు కావాలంటూ సిట్ తన నోటీసులో ఆదేశించడంపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై నిపుణులతో ఆయన సమాలోచనలు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం.



