Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
దేశంలో ఉన్నత స్థాయిలో పోలీస్‌ అధికారిగా సేవలందించిన విశ్రాంత ఐపీఎస్‌, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌.జే. దొర (83) కిడ్నీ సంబంధిత వ్యాధితో శుక్రవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు.ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన హెచ్‌.జే. దొర 1943లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేసి 1965 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిగా ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో సేవలు ప్రారంభించారు. ఆయన అనేక జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో నక్సలైట్‌ వ్యతిరేక చర్యలు, పోలీస్‌ సంస్కరణలు చేపట్టి కఠిన పరిపాలనతో మంచి పేరు సంపాదించారు. ఒక దశలో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ అనే నక్సలైట్‌ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న ప్రముఖ అధికారుల్లో ఆయన ఒకరని సహచరులు గుర్తుచేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా, అనంతరం సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా కూడా సేవలందిం చారు. అలాగే కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌లో విజిలెన్స్‌ కమిషనర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మెన్‌ అండ్‌ ఎండీగా, ఇండియన్‌ ఒలింపిక్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా కీలక పదవులు నిర్వహించారు. 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత జట్టుకు చెఫ్‌-డి-మిషన్‌గా కూడా వ్యవహరించారు. సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ ఫర్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌, పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌, పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంట్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆయన అందుకున్నారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు, పోలీస్‌ ఉన్నతాధికారులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -