పాల్గొన్న మహారాష్ట్ర ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ – జుక్కల్
మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో గల పవిత్ర నానీజ్ ధామ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జగద్గురు నరేంద్ర మహారాజ్ జన్మదిన మహోత్సవాల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుండి భక్తులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు విశాల సంఖ్యలో హాజరై భక్తి స్ఫూర్తితో మహారాజ్ ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో నానీజ్ ఉత్తరాధికారి కానీఫ్నాథ్ మహారాజ్ (దాదా శ్రీ మహారాజ్), మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి ఉదయ్ సమంత్, ఎమ్మెల్యేలు శేఖర్ నీకం, కిరణ్ సమంత్, మాజీ ఎమ్మెల్యే బల్ మనే తదితరులు పాల్గొని మహారాజ్ జన్మదినోత్సవానికి ప్రత్యేకతను చేకూర్చారు.
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు మహారాజ్ ఆశీస్సులు పొందుతూ, ఆయన పాదసేవలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నరేంద్ర మహారాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మహారాజ్ చేతులమీదుగా సన్మానితులయ్యారు. వేదిక అంతట భక్తి, శ్రద్ధ, ఆనందం నిండిపోగా భక్తులు “జగద్గురు నరేంద్ర చార్య జీ మహారాజ్ కి జై” అంటూ నినదించారు. ఈ సందర్భంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, భజనాలు, హరినామ సంకీర్తనలతో మొత్తం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. నానీజ్ ధామ్‌లో జరిగిన ఈ జన్మదిన మహోత్సవం భక్తి, ఐక్యత, సేవా భావాలకు ప్రతీకగా నిలిచింది.