Tuesday, November 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష

మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష

- Advertisement -

మాజీ హోం మంత్రికి కూడా
ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు

ఢాకా : గతేడాది జులై-ఆగస్టుల మధ్య బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును అత్యంత పాశవికంగా అణచివేసిన కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్‌మన్‌ కమల్‌లకు అంతర్జాతీయ నేరా ల ట్రిబ్యునల్‌-1(ఐసీటీ-1) సోమవారం మరణశిక్ష విధించింది. అదే సమయంలో అప్రూవర్‌గా మారిన మాజీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ చౌదరి అబ్దుల్లా అల్‌ మమున్‌కు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సాక్షిగా మారిన ఆయన తన ప్రమేయాన్ని అంగీకరిస్తూనే మాజీ ప్రధాని, హోం మంత్రిలకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌ ఎదుట సాక్ష్యమిచ్చారు.

నెలల తరబడి సుదీర్ఘ విచారణ సాగిన అనంతరం, జస్టిస్‌ మహ్మద్‌ గులామ్‌ ముర్తుజా మజుందార్‌ నేతృత్వంలోని త్రిసభ్య ట్రిబ్యునల్‌ సోమవారం 453 పేజీలతో కూడిన తీర్పును చదివింది. ఆ సమయంలో హసీనా, ఖాన్‌లు అక్కడ లేరు. తీర్పును ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ సమయంలో ట్రిబ్యునల్‌ వెలుపల వివిధ రాజకీయ పార్టీలకు, సామాజిక సంస్థలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. షేక్‌ హసీనాను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్ధులు కూడా గుమిగూడారు. తీర్పు నేపథ్యంలో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.

హసీనాను అప్పగించండి
పదవీ చ్యుతురాలైన ప్రధాని షేక్‌ హసీనాను మాజీ హోం మంత్రి అసదుజ్‌మన్‌ కమల్‌లను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్‌ సోమవారం కోరింది. ఖైదీల అప్పగింత ఒప్పందం కింద వెంటనే ఇందుకు సంబంధించి చర్చలు తీసుకోవాలని కోరింది. గతేడాది ఢాకాలో హింసాత్మక నిరసనల నేపథ్యంలో హసీనా భారత్‌ వచ్చి తలదాచుకున్నారు.

భారత్‌ పరిగణనలోకి తీసుకుంది
మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గమనంలోకి తీసుకున్నట్లు భారత్‌ తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరతలతో సహా ప్రజల అత్యుత్తమ ప్రయోజనాలకు భారత ప్రభుత్వం కట్టుబడి వుందని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకోసం సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని తెలిపింది.

రాజకీయ కుట్రే : హసీనా
ఇదంతా రాజకీయ కుట్రతో, పక్షపాత ధోరణితో చేసినదేనని హసీనా వ్యాఖ్యానించారు. ”ఎన్నికే కాని, ప్రజాస్వామ్య తీర్పు లేని ప్రభుత్వం మోసపూరితంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పులివి” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై వచ్చిన ఈ తీర్పును ముందుగానే ఊహించానని అన్నారు. తన దేశానికి వెలుపల జరిగే తాజా విచారణకు హాజరు కావడానికి సిద్ధంగా వున్నానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -