రాహుల్, ఖర్గేతో సహా పలువురు నివాళులు
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నేడు 34వ వర్థంతి. ఈ సందర్భంగా రాజీవ్ తనయుడు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతోపాటు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గేలు ఢిల్లీలోని వీర్ భూమి రాజీవ్ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. వీరితోపాటు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా స్మారక ప్రదేశంలో రాజీవ్‌కి ఘనంగా నివాళులర్పించారు. కాగా, రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను భారతదేశానికి గొప్ప కుమారుడు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలని ప్రస్తావిస్తూ ఖర్గే ఎక్స్ పోస్టు చేశారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోనే 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్‌ను బలోపేతం చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే టెలికాం, ఐటి విప్లవానికి నాయకత్వం వహించారు. కంప్యూటరీకరణను అమలు చేశారు. సమ్మిళిత అభ్యాసంపై దృష్టి సారించిన కొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. భారతదేశానికి గొప్ప కుమారుడైన రాజీవ్‌గాంధీ లక్షలాది మంది భారతీయులలో ఆశను ప్రేరేపించారు. 21వ శతాబ్దపు సవాళ్లు, అవకాశాలకు భారతదేశాన్ని సిద్ధం చేయడంలో ఆయన దార్శనికత, సాహసోపేతమైన నిర్ణయాలు కీలకపాత్ర పోషించాయి అని ఖర్గే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా రాహుల్ తన తండ్రి రాజీవ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోకు జతగా ‘నాన్న మీ జ్ఞాపకాలు నన్ను ప్రతి అడుగులోనూ నడిపిస్తాయి. మీ నెరవేరని కలలను నిజం చేయడమే నా సంకల్పం. నేను వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాను’ అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ 40 ఏండ్ల వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 1984 నుంచి 1989 డిసెంబర్ 2 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్థంతి
- Advertisement -
- Advertisement -