Friday, February 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు

- Advertisement -

అనియంత్రిత అధికారాన్ని చెలాయించినందుకే..
దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి

సియోల్‌: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు జీవిత ఖైదు పడింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దేశంలో మార్షల్‌ లా విధించిన కేసులో తీర్పు వెలువడింది. చట్టవిరుద్ధంగా పార్లమెంటును తన గుప్పెట్లోకి తీసుకునేందుకు, నేతలను అరెస్టు చేసేందుకు, అనియంత్రిత అధికారాన్ని చెలాయించేందుకు సైన్యం, పోలీసు బలగాలను సమీకరించినం దుకుగానూ తిరుగుబాటు కింద ఆయన్ను దోషిగా నిర్ధారించినట్టు న్యాయమూర్తి జీ కుయ్-యోన్‌ తెలిపారు.ప్రతిపక్షాలు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ 2024 డిసెంబరులో అధికారంలో ఉన్న అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశంలో ‘మార్షల్‌ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గంటల వ్యవధిలోనే ప్రకటనను విరమించుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అభిశంసనకు గురై పదవిని కోల్పోయారు.’మార్షల్‌ లా’ విషయంలో ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయని ఆరోపిస్తూ.. ఆయనకు మరణశిక్ష విధించాలని ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ వాదించారు. చివరకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ‘మార్షల్‌ లా’ అమలులో భాగమైన అనేక మంది మాజీ సైనిక, పోలీసు అధికారులకూ కోర్టు శిక్ష విధించింది. రక్షణశాఖ మాజీ మంత్రి కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌కు 30 ఏండ్ల జైలు శిక్ష పడింది.అనేక కేసులు ఎదుర్కొంటున్న యూన్‌ సుక్‌ యోల్‌ గతేడాది జులై నుంచి జైల్లో ఉన్నారు. ఓ కేసులో గత నెలలో ఆయనకు ఐదేండ్ల శిక్ష పడింది. మరోవైపు.. జీవిత ఖైదు పడిన మొదటి దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు ఆయనే కావడం గమనార్హం. ఈ తీర్పుపై ఆయన అప్పీల్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -