నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘేకు శ్రీలంక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు వెలుపల ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత మధ్య కొలంబొ నేషనల్ హాస్పిటల్ నుండి రణిల్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. కొలంబొ ఫోర్ట్ మెజిస్ట్రేట్ నిలుపులి లంకపుర జూమ్ మీటింగ్ ద్వారా విచారణ చేపట్టారు.
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం కేసులో ఈ నెల 22న (శుక్రవారం) పోలీసుల నేర దర్యాప్తు విభాగం (సిఐడి) రణిల్ విక్రమ్ సింఘేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొలంబొ ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు ఆగస్ట్ 26 వరకు రిమాండ్ విధించింది. అదే రోజు అర్థరాత్రి మెయిన్ మ్యాగజైన్ రిమాండ్ జైలుకు తరలించారు. డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నేషనల్ హాస్పిటల్ ఐసియుకు తరలించారు.
2023లో తన భార్య మైత్రీ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరవడం కోసం యుకె పర్యటన నిమిత్తం రూ.48 లక్షలకు పైగా (ఎల్‌కెఆర్ 16.6 మిలియన్) ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడని విక్రమ్ సింఘేపై ఆరోపణలు ఉన్నాయి. అయితే శ్రీలంక అధ్యక్షుడిగా తనకు ఆహ్వానం ఉన్నందున ఇది అధికారిక పర్యటన అని విక్రమ్ సింఘే ఆరోపణలను తిరస్కరించారు.