కన్నుకు కన్ను : అరాగ్చీ … కన్నుకు తల : రుబియో
నౌకపై దాడి చేసిన ప్రతిసారీ బ్రిడ్జినో,
విద్యుత్ ప్లాంటునో ధ్వంసం చేస్తాం : ట్రంప్
అదే జరిగితే 9/11 తరహా దాడులు తప్పవు : ఇరాన్
ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై హౌతీల దాడులు
నవతెలంగాణ – జనరల్ డెస్క్
పశ్చిమాసియా పోరులో ఇరాన్ దూకుడు పెంచింది. అమెరికాపై మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. హార్ముజ్‌లో నౌకను ఇరాన్ లక్ష్యం చేసుకున్న ప్రతిసారీ తాము ఓ బ్రిడ్జి పైనో లేదా విద్యుత్ ప్లాంటు పైనో బాంబు దాడి చేసి ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. ‘9/11 తరహా దాడులు’ చేస్తానని హెచ్చరించింది. ఘర్షణలు కొనసాగితే అమెరికాలో జాతీయ సంతాప దినాలు పాటించాల్సి ఉంటుందని చురకలు వేసింది. ఒకవేళ తాము చమురును విక్రయించలేకపోతే వేరెవ్వరూ అమ్మబోరని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ స్పష్టం చేశారు. ‘కంటికి కన్నే మా సమాధానం’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. అటు అమెరికా కూడా మాటల యుద్ధాన్ని కొనసాగించింది. మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ ‘ఇరాన్ మమ్మల్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బతిమాలుకుంటోంది. మూల్యం చెల్లించాలని వారు భావిస్తే ప్రతి రాత్రీ ఆ మూల్యం మరింతగా పెరుగుతూ… పెరుగుతూ… పెరుగుతూ ఉంటుంది. వారి విధానం కన్నుకు కన్ను అయితే మా అధ్యక్షుడి విధానం కన్నుకు తల’ అని అన్నారు. ఒప్పందంపై ఇరాన్‌కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.‘యుద్ధం కొనసాగితే అమెరికా విచారపడేలా చర్యలు చేపడతాం. వాటి కారణంగా అక్కడ జాతీయ సంతాప దినాలు పాటించాల్సి వస్తుంది’ అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాలో సంతాప దినాలు పాటించిన విషయం తెలిసిందే. తమ దేశంలో బ్రిడ్జిలపై కానీ, విద్యుత్ ప్లాంటులపై కానీ దాడి చేస్తే ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ హెచ్చరించింది.
అలాంటి దాడులే జరిగితే మధ్యప్రాచ్యంలో మౌలిక సదుపాయాలు, బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇరాన్‌తో ఒప్పందం, సమన్వయం చేసుకునే నౌకలు మాత్రమే హార్ముజ్‌ను సురక్షితంగా దాటతాయని తెలిపింది. లేకుంటే వ్యూహాత్మక జలమార్గంపై పూర్తి సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తామని, జలసంధిలో దీర్ఘకాల భద్రత కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతామని చెప్పింది. కాగా ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్ ధీటుగా స్పందించారు. ‘ఈ యుద్ధం సమీకరణ చాలా స్పష్టంగా ఉంది. మేము చమురును అమ్మలేని ప్రాంతంలో వేరెవ్వరూ దానిని విక్రయించలేరు. మా భద్రతపై హామీ లభించని పక్షంలో ఏ మౌలిక సదుపాయం సురక్షితంగా ఉండదు’ అని చెప్పారు. అమెరికా దళాలు లేకుంటేనే జలసంధి భద్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.దాడులు ప్రారంభించిన హౌతీలుసౌదీ ఓడలను దిగ్బంధిస్తామని హెచ్చరికలు జారీ చేసిన హౌతీలు అన్నంత పని చేశారు. ఎర్ర సముద్రంలో గురువారం ఉదయం రెండు సౌదీ చమురు నౌకలపై దాడి చేశారు. సౌదీ పతాకంతో ఉన్న ఎన్‌సెలియా నౌకలో మంటలు వ్యాపించాయని నాసా ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూపాయి. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తుండగా ఎన్‌సెలియాపై దాడి జరిగిందని, ఫలితంగా అందులో మంటలు వ్యాపించాయని సౌదీ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. అందులోని సిబ్బంది అందరూ సురక్షితంగానే ఉన్నారని చెప్పింది. కాగా సౌదీ అరేబియాపై నౌకాదళ చర్యలు కొనసాగుతాయని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ చెప్పారు. ఎర్ర సముద్రంలో చమురు ట్యాంకర్లపై హౌతీలు దాడులు చేస్తున్న నేపథ్యంలో బ్యారల్ చమురు ధర 98 డాలర్లకు చేరింది.
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ సేనల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సేనలు బుధవారం వరుసగా 12వ రోజు రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలు, మౌలిక సదు పాయాలపై దాడులు చేశాయి. షలమ్‌ఛెహ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద అమెరికా జరిపిన దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు జోర్డాన్‌పై ఇరాన్ నాలుగు క్షిపణులను ప్రయోగించగా వాటిలో ముడింటిని అడ్డుకున్నామని సైన్యం తెలిపింది. జోర్డాన్‌లోని కింగ్ ఫైసల్ వైమానిక స్థావరంలో ఉన్న ఓ భవనంలో మంటలు వ్యాపించాయి. బహ్‌రైన్‌లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు.



