Friday, July 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిన్యాయానికి సమయం లేదా?

న్యాయానికి సమయం లేదా?

- Advertisement -

న్యాయం నడవాల్సిన దారి నిశ్శబ్దమైతే…
నిజం నిలవాల్సిన చోట అబద్ధం రాజ్యమేలితే…
ధర్మం మాట్లాడాల్సిన గొంతు మౌనమైతే…
గాయాలను చూడాల్సిన కండ్లే పక్కకు తిరిగితే…
సాక్ష్యాలను చూడటానికే సమయం లేదంటే…
ప్రశ్నించిన యువతనే నిందితులుగా నిలబెడితే…
ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని… ఏ మనసు నమ్మగలదు?
రాజ్యాంగం సురక్షితమని ఏ గొంతు అనగలదు? ​

నిజంగా దేశం ఎటువైపు పోతోందనే ఆందోళన సమాజాన్ని వెంటాడుతోంది… ఢిల్లీలో విద్యార్థులపై పడిన లాఠీల కంటే, ప్రధాని మౌనం కంటే, విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి తప్పించుకోవడం కంటే… దేశ సర్వోన్నత న్యాయ మూర్తి నుంచి విన్న వ్యాఖ్యే ప్రజలను ఎక్కువగా కలచివేస్తోంది. ‘‘లాఠీచార్జ్ వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు. మా టైం వేస్టు చేయకండి, మీ టైం వేస్టు చేసుకోకండి’’ అని పిటిషనర్‌‌తో వాదించిన తీరు కోట్లాది మంది యువత మనసుల్లో ఒక ప్రశ్నను మిగిల్చింది. ప్రజాస్వామ్యంలో చివరి ఆశ్రయం న్యాయస్థానం. అక్కడి నుంచే నిరాశ ఎదురైతే, న్యాయం కోసం ఇంకెవరి తలుపు తట్టాలి? ఇది విద్యార్థుల వేదనను చిన్నచూపు చూటడమే అవుతుంది. నేడు దేశ రాజధాని హస్తిన అట్టుడుకుతోంది. కాక్రోచ్‌ ‌జనతా పార్టీ ఇచ్చిన పిలుపు, సోనమ్‌ ‌వాంగ్‌ ‌చుక్‌ ‌దీక్ష దేశంలో నెలకొన్ని రాజకీయ నిశ్శబ్ధాన్ని బద్దలు చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీలక తీతంగా యువతకు మద్దతునిస్తోంది. అన్ని రాష్ర్టాలను ఈ నిరసన జ్వాల చుట్టుముడుతోంది. విద్యార్థులను ఇలాంటి పరిస్థితికి దిగజార్చిన కేంద్రాన్ని బోనులో నిలబెట్టాల్సిన న్యాయస్థానం అవహేళన చేసి మాట్లాడటం తీవ్ర విచారకరం. యువత వీధుల్లోకి ఎందుకెక్కింది? కళా శాలల్లో ఉండాల్సిన విద్యార్థిలోకం రోడ్లపైకి ఎందుకొచ్చింది? అన్న ప్రశ్న నేడు ప్రతి ఒక్కరిలో మెదులుతోంది.

కానీ, స్పందించాల్సిన సర్కార్‌ ‌ససేమిరా అంటోంది. పైగా నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసు యంత్రాం గం విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించింది. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లతో అమానుషంగా ప్రవర్తించింది. విద్యార్థులపై జరిగిన ఈ దౌర్జన్యం అధికార అహంకారానికి, అసహనానికి నిదర్శనంగా నిలిచింది. దెబ్బలు తగిలిన వారిని చూసి దేశమే కన్నీరు పెట్టుకుంటే, సాక్ష్యాలు చూడటానికే సమయం లేదని న్యాయమూర్తి అనడం గుండెను ఎంతగా గాయపరుస్తుంది? అదే సమయంలో ఢిల్లీ హైకోర్టు మాత్రం ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలను భద్రపరచాలని ఆదేశించడం ఓ ఉపశమనం. ఒకవైపు నిర్లిప్తత కనిపిస్తే, మరోవైపు నిజాన్ని వెలికితీయాలనే ప్రయత్నం న్యాయ వ్యవస్థలోనే భిన్నమైన స్పందనలను చూపుతోంది. అసలు ఈ ‘కాక్రోచ్‌’ పార్టీకి ఆజ్యం పోసిందే సీజేఐ మాటలేనన్నది తెలిసిందే. మూడు నెలల క్రితం సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ​“ఉపాధి దొరకక, వృత్తిలో స్థానం లేక కొందరు యువకులు బొద్దింకల్లా తిరుగుతున్నారు. వారు సోషల్ మీడియా, ఆర్‌టీఐ యాక్టివి స్టులుగా మారి వ్యవస్థపై దాడులు చేస్తూ ‘పారాసైట్స్’ (పరాన్నజీవులు)గా మారుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

ఈ మాటలు నిరుద్యోగ యువత, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశాయి. ఆ అవమానాలు, అవహేళనల మధ్య పురుడు పోసుకున్నదే కాక్రోచ్‌ ‌జనతా పార్టీ. ఇక్కడ అసలు సమస్య పేపర్ లీక్ ఒక్కటే కాదు. నిరుద్యోగం పెరుగుతోంది. ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి సిద్ధమ వుతున్న యువతకు పరీక్షలే నమ్మదగినవి కాకపోతే వారి భవిష్యత్తు ఎక్కడ? పేపర్ లీకేజీ అంటే ప్రశ్నపత్రం మాత్రమే బయటకు రావడం కాదు, అది రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలనే దోచుకోవడం, నిజాయితీగా చదివిన విద్యార్థికి ద్రోహం. దాన్ని గుర్తించాల్సిన న్యాయమూర్తి విద్యార్థి యువతపై నిర్లక్ష్యంగా మాట్లాడితే భవిష్యత్తు తరానికి ఏం సందేశం వెళ్తుంది? స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన న్యాయస్థానం పాలకుల కనుసన్నల్లో నడిస్తే అది ‘కంచె చేను మేసిన’ చందమే అవుతుంది.
రాజ్యాంగాన్ని కాపాడటమే కాదు, దాని మౌలిక సూత్రాలను ప్రజా ప్రయోజనాల కోసం అమలు చేసేందుకు కూడా న్యాయస్థానం కట్టుబడి ఉండాలి. న్యాయం జరిగిందనే భావన ప్రజల్లో కలగడం కూడా న్యాయవ్యవస్థ బాధ్యతలో భాగమే. అందుకే న్యాయస్థానాల నుంచి వచ్చే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రజల వేదనను తేలికగా తీసుకున్నట్టు అనిపించే వ్యాఖ్యలు సహజంగానే తీవ్ర చర్చకు దారితీస్తాయి. న్యాయంపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినకుండా ప్రతి రాజ్యాంగ సంస్థ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. న్యాయం మౌనంగా ఉంటే అన్యాయం మాట్లాడుతుంది. కానీ చరిత్ర మాత్రం చివరికి న్యాయం పక్షాన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -