భూమిని దున్నేది కౌలురైతు.. పంట పండించేది కౌలురైతు.. కానీ ఆ పంటపై ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రం కౌలురైతుకు హక్కు లేదు! పెట్టుబడి కోసం బ్యాంకు రుణం దొరకదు.. సబ్సిడీ ఎరువులు అందవు.. పంట బీమా, నష్టపరిహారం పొందలేడు.. చివరకు పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడమూ కష్టమే. కౌలురైతుల రక్షణ కోసం చట్టాలు ఉన్నా, వాటిలోని ఆచరణ సాధ్యం కాని నిబంధనలు లక్షలాది మంది కౌలురైతులకు ప్రయోజనాలను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా భూయజమాని రాతపూర్వక కౌలు ఒప్పందం ఇవ్వాలనే నిబంధనే కౌలురైతుల గుర్తింపుకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో కాగితాలపై హక్కులు ఉన్నా.. కండ్ల ముందు ప్రయోజనాలు కనిపించని దుస్థితి తెలంగాణ కౌలురైతులది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? కౌలురైతుల రక్షణ కోసం వచ్చిన చట్టాలు కాలక్రమంలో ఎలా మారాయి? వాటి అమలులో ఎక్కడ లోపం ఉంది? “దక్కన్ అగ్రికల్చరీస్ రిలీఫ్ యాక్ట్-1879”ను దక్కన్ రైతులను వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చారు. ఈ చట్టం ఉద్దేశం కౌలుదారుల రక్షణ కాదు. వారి నుంచి శిస్తు వసూలు చేయడానికి ఎత్తుగడగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో ‘దున్నే వానికే భూమి’ నినాదంతో కమ్యూనిస్టులు రైతాంగ సాయుధ పోరాటం చేశారు.
గ్రామాల నుంచి వేల ఎకరాల భూములు కలిగిన జాగీర్దారులు, భూస్వాములు పట్టణాల బాట పట్టడంతో, కమ్యూ నిస్టుల డిమాండ్ల పరిష్కారంలో భాగంగా అప్పటి ప్రభుత్వం కౌలుదారుల రక్షణ కోసం “హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ యాక్ట్-1950”ను తీసుకువచ్చింది.ఈ చట్టం కౌలుదారులకు భూమిపై శాశ్వత హక్కులు కల్పించింది. కౌలు రైతులను భూముల నుంచి తొలగించకుండా రక్షణ కల్పించింది. అరవై రెట్లు భూమి శిస్తు చెల్లిస్తే భూమి సంబంధిత రైతుకు దాఖలు చేయబడింది. ఈ విధంగా తెలంగాణలో పదిలక్షల ఎకరాల భూములు కౌలురైతుల పేర పట్టాలయ్యాయి. ఏపీ టియల్ఏ-1955, 1961 కౌలుదారీ చట్టాలు వచ్చినప్పటికీ, పాత హైదరాబాద్ చట్ట పరిధిలోనే మరికొన్ని కౌలుదారు రక్షణలు ఈ చట్టాల్లో ఇవ్వబడ్డాయి. పండిన పంటలో మూడో వంతుకు మించి కౌలు వసూలు చేయరాదు. ఒకవేళ భూయజమాని సొంతంగా సాగు చేసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అనే నిబంధనలు అదనంగా చేర్చారు.
భూసంస్కరణల నుంచి కౌలుదారీ రక్షణ వరకు
తర్వాత “ఏపీ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్-1961” మరియు “ల్యాండ్ రిఫార్మ్-1973” ప్రకారం ప్రతి కుటుంబానికి 27 ఎకరాల మాగాణి, 54 ఎకరాల మెట్ట భూమికి మించి ఉండడానికి వీల్లేదు. కనుక అదనపు భూమిపై హక్కు కౌలుదారులకు కల్పించడం జరిగింది. ఈ విధంగా కౌలుదారులకు ఐదు లక్షల ఎకరాల భూమి దక్కింది.“ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్-1977” ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూమిని అమ్మడం, కౌలుకు ఇవ్వడంపై నిషేధం విధించింది. తెలంగాణలో ఇప్పటికీ 20 లక్షల ఎకరాల భూములు ఈ యాక్ట్ కింద ఉన్నాయి. చదివేస్తే ఉన్న మతి పోయి నట్లు మన పాలకులు “తెలంగాణ ప్రత్యేక కౌల్దారీ చట్టం-2011” తెచ్చారు. ఈ చట్టం ప్రకారం కౌలురైతు అంటే భూయజమాని కాదు. లైసెన్స్ పొందిన సాగుదారుడు మాత్రమే! ఈ చట్టం ప్రకారం ఎంఆర్ఓ కౌలురైతులకు “లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ (ఎల్ఈసీ)” ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకు రుణాలు, పంట సబ్సిడీ, పంట బీమా వంటి హక్కులు లభిస్తాయి.అయితే ఇక్కడ ఒక సాంకేతిక సమస్య అడ్డంగా వచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలురైతు లోన్ ఎలిజిబుల్ సర్టిఫికెట్ పొందాలంటే సంబంధిత భూయజమాని “కౌలు అగ్రిమెంట్ పత్రం”ను రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే భూపట్టాదారులు ఎవరూ రాతపూర్వకమైన అగ్రిమెంట్ ఇవ్వడానికి ఇష్టపడకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని 92.6 శాతం కౌలురైతులకు చట్టం వర్తింపజేయబడలేదు.
ఎల్ఈసీ లేక కౌలురైతుకు ప్రయోజనాలు దూరం
ఫలితంగా చట్టం ద్వారా కౌలురైతులు పొందాల్సిన కనీస ప్రయోజనాలు కూడా వారికి అందడం లేదు. మూడు శాతం వడ్డీరేటుపై బ్యాంకు పంట రుణాలు పొందడం, సబ్సిడీపై యూరియా, ఎరువులు పొందడం, పండిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడం, పంట బీమా వంటి సౌకర్యాలు కౌలురైతుకు సాధ్యం కావడం లేదు. ఆచరణ సాధ్యం కాని నిబం ధనలు విధించడం ద్వారా కౌలురైతులు పొందాల్సిన ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే చట్టాన్ని కొన్ని మార్పులతో ప్రవేశపెట్టినప్పటికీ, తెలంగాణ మాదిరిగానే వైఫల్యం చెందింది. ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ 2015-16 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 11 లక్షల మంది కౌలురైతులు ఉండగా, కేవలం 34 వేల మంది కౌలురైతులకు మాత్రమే ‘లోన్ ఎలిజిబుల్ సర్టిఫికెట్’ ఇచ్చింది. 2019లో ఎన్ఎస్ఎస్ఓ చేసిన కేంద్ర సర్వే ప్రకారం తెలంగాణలో 17.5 శాతం కౌలురైతులు ఉన్నట్లు నిర్ధారించారు.
2026లో రైతు స్వరాజ్య వేదిక, మరికొన్ని కౌలురైతు సంఘాలు చేసిన శాంపిల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షలకుపైగా కౌలురైతులు ఉంటారని నిర్ధారించారు. అందులో 19 శాతం అంటే 4.18 లక్షల మంది కౌలురైతులు అసలు సెంటు భూమి కూడా లేని నిరుపేదలుగా తేల్చారు. ఎల్ఈసీ ధ్రువపత్రం పొందలేకపోవడం వల్ల ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు 85 శాతం కౌలురైతులకు పంటనష్టం జరిగినా, కేవలం 0.7 శాతం కౌలురైతులకు మాత్రమే నష్టపరిహారం అందింది. అసలైన భూయజమానులు రాతపూర్వకమైన కౌలు ఒప్పంద పత్రాలు ఇవ్వడానికి భయపడడం, ఖరీఫ్, రబీ పంటలకు వేర్వేరు కౌలుదారులతో కేవలం మౌఖిక ఒప్పందం జరగడం వంటి సమస్యలు సాంకేతికంగా కౌలుదారుల గుర్తింపునకు అడ్డంకులుగా మారాయి.
గుర్తింపు, హక్కుల కోసం డిమాండ్
ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే రైతు భరోసా రూ.15 వేలలో కౌలురైతుకు రూ.7,500, పట్టాదారుకు రూ.7,500 పంపిణీ చేస్తామని ఆరు గ్యారెంటీలలో వాగ్దానం చేసినప్పటికీ, ఇప్పటివరకు కౌలురైతులను గుర్తించే ప్రక్రియ చేపట్టలేదు. గత ప్రభుత్వం రైతుబంధు మాదిరిగానే పట్టాదారులైన రైతులకు రైతు భరోసా వర్తింపజేస్తున్నారు. కౌలురైతుల గుర్తింపులో సంక్లిష్టత, సాంకేతిక అడ్డంకులు తొలగించాలని, గ్రామసభలు లేదా రైతువేదికల ద్వారా ప్రతియేటా కౌలురైతులను ధ్రువీ కరించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కౌలురైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కౌలురైతు సంఘాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల అనుబంధ రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. చట్టబద్ధంగా కౌలు రైతులకు దక్కాల్సిన సబ్సిడీ ఎరువులు, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంటలకు కనీస గిట్టుబాటు ధర తదితర ప్రయోజ నాలు పొందడానికి కౌలురైతుల గుర్తింపు, చట్టబద్ధ హక్కులు తప్పనిసరి అవుతున్నం దున, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.ఒకప్పుడు భూహక్కు లతో మొదలైన కౌల్దారీ చట్టాలు, తర్వాత కౌల్దారీ రక్షణ దిశగా, ఆ తర్వాత కొన్ని స్వల్ప ప్రయోజనాలు పొందే దిశగా పరిణామం చెందాయి. ప్రస్తుతం కౌలు చట్టాలు ఉన్నప్పటికీ, కౌలురైతులకు కనీసంగా ఉపయోగపడని నిబంధనలతో వాటిని సంక్లిష్టం చేశారని కౌలురైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కండ్లు తెరిచి కౌలురైతుల రక్షణ, ప్రయోజనం దిశగా తక్షణం ఆలోచన చేయాలని కోరుతున్నారు. అలా చేయడం వల్ల రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే కౌలురైతులకు కూడా తగిన సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది.
ఎన్.తిర్మల్, 9441864514



