Monday, September 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిడాలర్‌ని ఆయుధంగా...

డాలర్‌ని ఆయుధంగా…

- Advertisement -

రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ ‌బ్రెట్టన్‌‌వుడ్‌ ‌వ్యవస్థ (ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌) అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికన్‌ ‌డాలర్‌ను వ్యవస్థీకరిం చింది. ఇందుకుగాను అమెరికా తన వంతుగా బంగారాన్ని ఔన్సుకి 35 డాలర్ల రేటుకి విదేశీ ప్రభుత్వాల నుంచి గాని, ఆ యా దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి గాని ఒక స్థిరమైన రేటుకి కొనడానికి ఒప్పుకుంది. డాలర్ల రూపంలో బంగారం ధర స్థిరీకరించబడింది కనుక అన్ని దేశాలూ ఇకపైన బంగారాన్ని కొనడానికి హడావుడి పడనవసరం ఉండదన్న అభిప్రాయాన్ని కలిగిం చారు. అంతేగాక సరుకుల ధరలు డాలర్లలో చూసుకున్నప్పుడు స్థిరంగా కొనసాగుతాయన్న నమ్మకాన్ని కలిగించారు. ఈ నమ్మకం అంతర్జాతీయంగా కొనసాగు తున్నంత కాలమూ ప్రపంచ దేశాలన్నీ డాలర్ల రూపంలో నిల్వలను, ఆస్తులను పోగేసుకోడానికి సిద్ధపడతాయి కనుక అమెరికా తన ఇష్టం వచ్చినంత ఖర్చు చేసుకోవచ్చు. అయితే, వియత్నాం యుద్ధం తీవ్ర స్థాయికి చేరినప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరింది. దాంతో డాలర్‌ ‌విలువ దెబ్బ తింది. దానితోబాటు డాలర్‌ ‌మీద అంతర్జాతీయంగా కలిగించిన నమ్మకమూ దెబ్బ తింది. ఫలితంగా బ్రెట్టన్‌‌వుడ్‌ ‌వ్యవస్థ కుప్పకూలింది.
కొంత కాలం గడిచాక మళ్లీ డాలర్‌ ‌తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. అయితే, ఇప్పుడు బంగారం ధర డాలర్లలో ఒక స్థిరమైన రేటు వద్ద కొనసాగే పరిస్థితి లేదు. అయినా, అప్రకటిత అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా డాలర్‌ ‌కొనసాగు తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం దాదాపుగా డాలర్ల రూపంలోనే సాగుతోంది. ముఖ్యంగా చమురు విషయంలో డాలర్‌ ప్రాతిపదిక కొనసాగుతోంది. అందుచేత సంపదను డాలర్ల రూపంలో నిల్వ చేసుకోవడం కూడా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయిలో సరుకుల విలువలు డాలర్ల లెక్కలో స్థిరంగా ఉంటాయన్న అంచనాల మీద ఈ పరిస్థితి కొనసాగుతోంది. సహజంగానే ఈ వాతావరణం అమెరికాకు ఒక ప్రత్యేక సానుకూలతను కల్పించింది. ఇప్పుడు అమెరికా తక్కిన ప్రపంచం నుంచి ఎంతైనా డాలర్ల రూపంలో రుణాలు తీసుకోవచ్చు, ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. అమెరికా అనుభవిస్తున్న ప్రత్యేక సానుకూలతను సహించడానికి తక్కిన ప్రపంచ దేశాలు ఎంతకాలం సిద్ధంగా ఉంటాయో అంతకాలమూ అమెరికా ఆ సానుకూలత వలన ప్రయోజనాలు పొందుతూనే వుండవచ్చు.

కాలక్రమేణా, డాలర్‌ ‌పోషిస్తున్న పాత్ర స్వభావం మారిపోతోంది. డాలర్ల రూపంలో తమ సంపదను నిల్వ చేసుకుంటున్న తక్కిన దేశాల మీద అమెరికా పెత్తనాన్ని చెలాయించడం ప్రారంభించింది. దాంతో ఒక రిజర్వు కరెన్సీగా వ్యవహరించే పాత్ర నుంచి వివిధ దేశాల మెడలు వంచగలిగే ప్రమాదకరమైన పాత్ర లోకి డాలర్‌ ‌మారిపోయింది.
ఇరాన్‌లో 1979లో ఏర్పడ్డ దౌత్య సంక్షోభం సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్‌ ఇరాన్‌ ఆస్తులను 12 బిలియన్ల డాలర్ల మేరకు స్థంభింపజేశాడు (ఇరాన్‌లో నియంతృత్వం చెలాయిస్తున్న షా ప్రభుత్వాన్ని ఇస్లామిక్‌ ‌విప్లవ కారులు కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు షా కు అమెరికా ఆశ్రయం ఇచ్చింది. దానికి ప్రతిగా ఇరానియన్‌ ‌విద్యార్థులు అమెరికన్‌ ‌దౌత్యాధికారులను నిర్బంధిం చారు. దానినే ఇరానియన్‌ ‌హోస్టేజ్‌ ‌క్రైసిస్‌ అంటారు). ఆ తర్వాత అదే పద్ధతిని పలుమార్లు వివిధ దేశాల విషయంలో పాటించడం జరుగు తోంది. ప్రపంచ దేశాలలో అత్యధిక భాగం తమ సంపదలను డాలర్ల రూపంలో దాచుకున్నంత మాత్రాన ఆ దేశాల ఆస్తులను తన ఇష్టం వచ్చినట్టు స్తంభింపజేసే హక్కు నైతికంగా కాని, చట్టపరంగా కాని అమెరికాకు లేదు. అమెరికన్‌ ‌రిజర్వు బ్యాంక్‌ ‌మాత్రమే విడుదల చేసే డాలర్లన్నింటికీ బాధ్యత కలిగివుంటుంది. అంతమాత్రాన అమెరికన్‌ ‌ప్రభుత్వానికి ఆయా దేశాల డాలర్ల నిల్వలను స్తంభింపజేసే అధికారం ఎలా సంక్రమిస్తుంది? అయితే, అంతర్జాతీయంగా కొనసాగే డాలర్ల రూపంలోని లావాదేవీలన్నీ అమెరికన్‌ ‌బ్యాంక్‌లతో ముడిపడి వుంటాయి గనుక వాటిని స్థంభింపజేసే అధికారాన్ని అమెరికన్‌ ‌ప్రభుత్వం తనకు తానే కల్పించుకుంది. తద్వారా తన మాట వినని దేశాల మెడలు వంచడానికి పూనుకుంటోంది.

క్లుప్తంగా చెప్పాలంటే డాలర్‌ ఇప్పుడు అమెరికన్‌ ‌సామ్రాజ్యవాదం చేతుల్లో ఒక ఆయుధం. ఏ దేశంతోనైనా అమెరికాకు వివాదం తలెత్తితే అప్పుడు ఆ దేశం మీద ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తుంది. అందుకు ఐక్యరాజ్య సమితి ఆమోదం ఏమీ ఉండదు. డాలర్ల ఖాతాలను నియంత్రించే సంబంధిత బ్యాంకింగ్‌ ‌వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆ దేశపు డాలర్ల ఖాతాను స్థంభింపజేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఇబ్బందిని అనుభవించిన దేశం రష్యా. అమెరికా, ఇ.యు దేశాలు కలిసి రష్యా ఖాతాలో ఉన్న 300 బిలియన్ల అమెరికన్‌ ‌డాలర్లను స్తంభింపజేశాయి. అందుకు ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని సాకుగా చూపుతున్నాయి. తానే ఇజ్రాయిల్‌తో కుమ్మక్కై ఇరాన్‌ ‌మీద దాడికి పూనుకున్న అమెరికా ఇరాన్‌ ‌ఖాతాలలోని 150 నుంచి 200 బిలియన్ల డాలర్లను స్థంభింప జేసింది. విడ్డూరమేమిటంటే, ఈ మొత్తంలో ఎక్కువ భాగం ఇండియా, చైనా దేశాలలోని బ్యాంకులలో ఉన్నది.
ఒక రిజర్వు కరెన్సీగా నిర్వహించే పాత్ర నుండి ఒక ఆయుధంగా ఉపయోగపడే పాత్రకి డాలర్‌ ‌మారిపోవడం అనేది ప్రపంచ దేశాలకి ముప్పుగా పరిణమించింది. అందుచేత డాలర్‌-‌రహిత వాణిజ్యానికి మారవలసిన తక్షణ అవసరం ఇప్పుడు ముందుకొచ్చింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్‌ ‌దేశాల శిఖరాగ్ర సమావేశంలో రష్యా, చైనా, ఇరాన్‌ ‌తమ తమ ప్రాధాన్యతల రీత్యా వివిధ అంశాలను నొక్కి చెప్పినా, అన్నీ కలిసి అమెరికా ఏకపక్ష ఆంక్షల వ్యవస్థను ప్రతిఘ టించవలసిన తక్షణ కర్తవ్యానికి అన్నింటికన్నా అధిక ప్రాధాన్యతనిచ్చాయి. అందుకోసం ప్రత్యామ్నాయ వాణిజ్య, ద్రవ్య వ్యవస్థ రూపొందా ల్సిన అవసరం గురించి నొక్కిచెప్పాయి. బ్రిక్స్‌ ‌సభ్య దేశాలు తమలో తాము జరుపుకునే వాణిజ్య లావాదేవీలలో ఆ యా దేశాల నగదును ఉపయోగించాలని భావించాయి. ఆ తరహా వాణిజ్య లావాదేవీలను గణనీయంగా విస్తరించాలని గుర్తించాయి.

ఇక్కడ ముందుకొచ్చిన విషయం మూడవ ప్రపంచ దేశాలకు ప్రయోజనకరంగా ఉండే ఒక న్యాయబద్ధమైన వాణిజ్య వ్యవస్థ ఏర్పడాలన్నది మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువగా అక్కడ అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షల విధానానికి, డాలర్ల రూపంలో నిల్వ చేసుకున్న ఆ యా దేశాల ఆస్తుల స్తంభనకు వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైంది. బ్రిక్స్‌ ‌దేశాల నడుమ స్థానిక నగదు ద్వారా జరిగే వాణిజ్యం విస్తరించాలన్న అంశంతో ఇండియా స్థూలంగా ఏకీభావాన్ని వ్యక్తం చేసినప్పటికీ, డాలర్ల రూపంలోని ఆస్తుల స్థంభన విషయంలో మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఇక్కడ ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఐరాస అనుమతి లేకుండా ఏకపక్షంగా ఆంక్షలను విధించరాదనే వైఖరిని ఆమోదించినప్పటికీ, డాలర్ల రూపంలో ఉన్న ఆ యా దేశాల ఆస్తులను అమెరికా ఏకపక్షంగా స్థంభింపజేయడాన్ని బహిరంగంగా ఖండించడానికి ముందుకు రావడం లేదు. మన విదేశాంగ మంత్రి అయితే డాలర్‌-‌రహిత వాణిజ్యానికి మారాలన్న ప్రతిపాదనను బహిరంగంగానే వ్యతిరేకించాడు!
బ్రిక్స్‌ ‌దేశాలు తమలో తాము జరుపుకునే వ్యాపారంలో స్థానిక కరెన్సీలను ఉపయోగించడంలో ఉన్న ఇబ్బందులను మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ వాణిజ్యంలో స్పెక్యులేషన్‌కు తావు లేకుండా చేయాలంటే విలువ స్థిరంగా కొనసాగుతున్న కరెన్సీలను ప్రమాణంగా ఎంచుకుని తమ తమ కరెన్సీల మారకాన్ని సాగించాల్సి వుంటుంది. అప్పుడు ఆ యా దేశాల విదేశీ వాణిజ్య చెల్లింపుల ఖాతాల్లో మిగులు లేదా తగులు ఖాతాలను నిర్వహించే పద్ధతులు ప్రస్తుతం అంతర్జాతీయంగా అమలౌతున్న పద్ధతులకన్నా కొంత భిన్నంగా ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం విదేశీ చెల్లింపు ఖాతాలో లోటు ఉన్న దేశాలు తప్పనిసరిగా ‘‘పొదుపు’’ చర్యలను పాటించాల్సి వస్తున్నది. దానివలన ఆ పేద దేశాల దేశీయ డిమాండ్‌ ‌కుంచించుకుపోయి ఆర్థిక వ్యవస్థ మరింత మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈ విధానానికి బదులు విదేశీ చెల్లింపు ఖాతాలో మిగులు ఉన్న దేశాలు తమ దిగుమతులను మరింత పెంచుకుంటే, తమ దేశీయ డిమాండ్‌ ‌మరింత పెరిగితే అప్పుడు వాటి మిగులు కొంత తగ్గుతుంది. పేద దేశాలకు ఊరట కలుగుతుంది. ఇప్పుడు బ్రిక్స్‌ ‌దేశాల నడుమ విస్తరించవలసిన వాణిజ్యం లో అనుసరించవలసిన నిబంధనలు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉనికిలో ఉన్న నిబం ధనలకన్నా భిన్నంగా ఉంటేనే ఆ విస్తరణ వలన అన్ని దేశాలకూ ప్రయోజనం లభిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్న నిబంధనల మేరకే బ్రిక్స్‌ ‌దేశాలు తమ నడుమ వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల ద్వారా విస్తరించినా, ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదురౌతున్న చిక్కుల వంటివే అప్పుడు కూడా కొనసాగుతాయే తప్ప ఉపశమనం కలగదు.

ఈ సందర్భంగా గతంలో సోవియట్‌ ‌యూనియన్‌ ఉనికిలో ఉన్న కాలంలో ఇండియా ఆ దేశంతో సాగించిన ద్వైపాక్షిక వాణిజ్య ఏర్పాట్లను మరోసారి పరిశీలించడం అవసరం. అప్పట్లో ఆ వాణిజ్యం ప్రధానంగా రెండు దేశాలలోని ప్రభుత్వ రంగ సంస్థల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా నడిచింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తే అప్పుడు కరెన్సీ స్పెక్యులేషన్‌‌కు అవకాశం లేకుండా కట్టడి చేయవచ్చు. దానితోబాటు అప్పటి ఒప్పందాలలో ఒక ఏడాదిలో తేలిన వాణిజ్య లోటు లేదా మిగులు ను ఆ పై ఏడాదిలోకి కొనసాగించే పద్ధతి ఉండేది. తమ తమ లోటును కాలక్రమేణా కొనుగోళ్ళు, అమ్మకాల ద్వారా మాత్రమే భర్తీ చేసుకునే వీలు ఉండేది. లోటు ఉన్న దేశం ‘‘పొదుపు’’ చర్యలను పాటించ వలసిన అగత్యం తలెత్తలేదు. ఈ అనుభవాల రీత్యా ఇప్పుడు బ్రిక్స్‌ ‌దేశాల నడుమ విస్తరించవలసిన వాణిజ్యం అప్పటి ఇండో-సోవియట్‌ ‌ద్వైపాక్షిక వాణిజ్యంలో అనుసరించిన ఉభయతారకమైన విధానాన్ని అనుసరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్రిక్స్‌ ‌దేశాల శిఖరాగ్ర సమావేశం స్థానిక కరెన్సీల ద్వారా తమ మధ్య జరగవలసిన వాణిజ్యం గురించి ఎక్కువగా చర్చించింది. కాని అటువంటి వాణిజ్యంలో ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి అంతగా చర్చించలేదు. అంటే రాబోయే రోజుల్లో బ్రిక్స్‌ ‌దేశాల నడుమ జరిగే వాణిజ్యం అంతర్జాతీయంగా గణనీయమైన ప్రభావాన్ని కలిగించగల గాలంటే అందుకు ఇంకా చాలా సమయం పట్టవచ్చు. వాస్తవానికి బ్రిక్స్‌ ‌సభ్య దేశాలలో కొన్ని సామ్రాజ్యవాద-అనుకూల వైఖరిని పాటించేవి కూడా ఉన్నాయి. అందుచేత డాలర్‌ ఆధిపత్యానికి చెక్‌ ‌పెట్టగల ఒక ప్రత్యామ్నాయ వ్యాపారం బ్రిక్స్‌ ‌దేశాల నడుమ పెంపొందుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -