Saturday, September 19, 2026
E-PAPER

మేధ బాధ

- Advertisement -

చిన్నతనంలో ఎక్కాలు బట్టీ పట్టలేక నానా ఇబ్బందులు పడ్డాం. బెత్తపు దెబ్బలు తిన్నాం. ఇప్పుడు వేలు కదిపిన కాలంలో అన్నీ మన ముందుంటాయి, దానికోసం అంత కాలాన్ని వెచ్చించాల్సిన పనిలేదు. టైపు మిషన్ ముందు, వేళ్లను ఆడిస్తూ ఎన్నో నెలలు సాధన చేశాం. ఇప్పుడదీ అవసరం లేదు. మనం మాట్లాడుతుంటేనే టైపై పోతుంది. ఇంకా విచిత్రమేమంటే, మనం రాయాల నుకున్న అంశం చెబితేచాలు కంప్యూటరే రాసి పెడుతుంది. మన మెదడుకు ఆ పనే అవసరం లేకుండా పోయింది. నువ్వొక ప్రాజెక్టు డిజైన్ చేయాలా? అయితే ఏం కావాలో చెప్పు అంతే! క్షణంలో నీ ముం దుంచుతుంది ఏ.ఐ. మానవ మెదడు చేసే పనులను అత్యంత వేగంగా చేస్తున్నది ఈ కృత్రిమ మేధస్సు. మీ మనస్సు లో మెదలుతున్న ఆలోచనను, లేదా సమస్యను ఫీడ్ చేయి, చాలు అది సమాధానాలు, పరిష్కారము, విశ్లేషణ చేసి ముందు పెడు తుంది. అంతరంగ విషయాలనూ అంత త్వరగా అంది పట్టుకుంటుంది. ఇది కేవలం వ్యక్తిగత విషయాలకే కాదు, విద్య, వైద్యం, సాంకేతికత, మార్కెట్ వ్యాపారం, పరిశోధన, కళలు, సాహిత్యం, సాంస్కృతికం అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తున్నది.

కృత్రిమ మేధ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్నది. మనుషుల అస్తిత్వానికే సవా లుగా మారుతున్నది. ఇది కంప్యూటర్ శాస్త్రంలోని ఒక విభాగం. మనిషి చేసే కొన్ని పనులు స్వతహాగా చేయటమన్నమాట. అంటే ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం, మనిషి సహాయం లేకుండానే తన పనిని కొనసాగిం చడం, విశ్లేషణ చేయడం చేస్తుంది. కొన్ని పరిష్కారాలను ఇస్తుంది. మిగతా ఏ మిషనూ చేయలేని పని ఇది. అతి ముఖ్యమైన ఆరోగ్య రంగంలోనూ తన పని మొదలెట్టింది. మానవ ప్రతిభను మించిపోయే అవకాశం ఉన్నది. మరి మనుషులు చేసే పనుల్లో ఈ ఏఐ విస్తరిస్తే, మనుషుల సంగతేమిటి? ఏంకావాలి! ఈ మధ్య ఏఐకి చెందిన ఒక నిపుణుడు ‘పదేండ్లలో ఏఐ మనుషుల్ని చంపేస్తుంది’ అని వ్యాఖ్యానించాడు. అదలా ఉంచితే, పెరిగిన సాంకేతికత మానవుల అవసరాలు తీర్చటానికి, సౌకర్యాలను పెంచటానికి పనికొస్తే అది ప్రయోజనకారియే, ఆహ్వానిం చాల్సిందే. కానీ ఆ మనిషికే ప్రత్యామ్నాయమైతే ఏమవుతాం! ఇది ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఒక సామాజిక సంక్షోభానికి తెరతీస్తున్నది.

​అయితే ఆ పేరు చెప్పి నూతన సాంకేతికతను, అభివృద్ధిని అడ్డుకోవటం కుదురుతుందా, సమర్థనీయమా! చర్చ జరగాలి. ఎప్పుడైనా ఏ సాంకేతికత యినా మానవ జీవితానికి మరింత సేవ చేసేదే. మనిషి కేంద్రంగానే నాగరికతా, విజ్ఞానము విస్తరించింది. ఇప్పుడు ఏఐ, మనిషికే ఎసరు పెడుతున్నదన్న భయం ప్రపంచమంతా వినిపిస్తున్నది. మొట్ట మొదటి సమస్య ఏమంటే, ప్రపంచం, సమాజం అంతా రెండుగా విభజించబడి ఉంది. ఒకటి ధనికులు, ఉన్నత వర్గాలు. రెండు పేదలు, వెనకబడిన శ్రామిక వర్గం. అనేక వ్యత్యాసాలు, భేదాలు కలిగిన అసమ సమాజంలో ఈ కృత్రిమ మేధ ఎవరికి మేలు చేస్తుంది! వీటినేమయినా తగ్గిస్తుందా? అన్నది ప్రశ్న. అత్యధికంగా ఉన్న పేదలకు ఏమైనా మేలు చేయగలు గుతుందా! అనే విషయాలను చర్చించాలి. ఎప్పుడయినా సాంకేతికతను మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ప్రయోజనాలుంటాయి. మనకోసం టెక్నాలజీ కానీ, టెక్నాలజీ కోసం మనం కాకూడదు. ఏ.ఐ. ఒక ముందడుగే, కానీ దాని ముఖ్య పర్యవసానాల్నీ, ఫలితాలపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా కృత్రిమ మేధ అన్నపుడు మానవ మేధ అనేది పక్షపాతముతో నిండి ఉంటుంది. దాని ప్రభావం ఏఐపైనా పడుతుంది కదా! ఇక అతి పెద్ద ప్రమాదం పర్యావరణంపై పడుతుంది. ఏఐ ప్రధానంగా డేటా సెంటర్ల ఆధారంగా పనిచేస్తుంది.

ఇది ఒక్క మోడల్‌ను తయారు చేయటానికి ఆరులక్షల పౌండ్ల కార్బన్ డై ఆక్సైడ్‌ను వెలువరిస్తుంది. ఇది ఒక కారు, దాని జీవిత కాలానికి వదిలే కాలుష్యానికి ఐదు రెట్లు ఎక్కువ. ఇక నీటి సమస్య. డేటా సెంటర్లు అత్యధిక వేడిని పెంచుతాయి. దాన్ని చల్లబరచటానికి విపరీతమైన నీటి వాడకం అవసరమౌతుంది. ఇప్పటికే మన తాగునీటి అవసరాలే తీరటం లేదు. ఇంకొకటి పర్యావరణ సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. దాని కారణంగా మనుషుల ఆరోగ్యానికి ముప్పు అధికమవుతుంది. ఇక కృత్రిమ మేధ మనిషి చరిత్రకు సంబంధించిన ఆధారాల వాటిపై ఆధారపడటం వల్ల వారిలో ఉండే భేదభావాలూ ఏఐకి ఫీడ్ అవుతాయి. ఉదాహరణకు స్త్రీలు పురుషులకన్నా బలహీనులు అన్న భావన సామాజిక చరిత్రలో ఉన్నది ఏఐకి కూడా ఫీడ్ అవుతుంది. మరొకటి అది అందించే త్వరితమైన ఫలితాలలో తప్పులు, అబద్ధాలు దొర్లవచ్చు. ఏఐకి చేరిన సమాచారము, వ్యక్తిగత వివరాలు భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఆ డేటా అంతా లీక్ అవ్వొచ్చు. ఇక ఏఐ ఇచ్చే సమాచారం, మోడల్స్, పరిష్కారాలు, పనివిధానం మొదలైన ఫలితాలకు జవాబుదారీతనం ఉండదు. ఎవరినీ బాధ్యులను చేయలేము. ముఖ్యంగా అతి ముఖ్యమైన వైద్య, రవాణా రంగంలో తాను ఇచ్చే తప్పులకు ఎవరు బాధ్యులు? ఇంకా కీలకమైనది ఉద్యోగాల తొలగింపు. ఆటోమేషన్ వల్ల ఉద్యోగులు చేసే పనులు మారతాయి. తప్పించ బడతారు. ఇదో సంక్షోభానికి దారితీయొచ్చు. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, కృత్రిమ మేధ ముప్పులపై ప్రపంచ దేశాలు ఐక్యంగా చర్చించాలని కోరారు. ఏ.ఐ. ని మళ్లీ మానవ మేధస్సుతోనే మనకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -