Saturday, September 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘లే ఆఫ్స్‌’’

‘‘లే ఆఫ్స్‌’’

- Advertisement -

రోజురోజుకూ సాంకేతికత ఎంత విస్తరిస్తోందో, ఉద్యోగ భద్రత అంత ప్రశ్నార్థకంగా మారుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ‘బ్లూవైన్‌’లో పనిచేస్తున్న ఎనభై మంది భారతీయ కస్టమర్‌ సర్వీస్‌ ఉద్యోగులను కేవలం ఐదు నిమి షాల గూగుల్‌ మీట్‌ ద్వారా తొలగించిన ఘటన ఐటీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ‘ఆపరేషనల్‌ కారణాలు’ చూపుతూ ఉద్యోగులందరినీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయించిన సంస్థ, రాత్రి షిఫ్ట్‌లో అత్యవసరంగా గూగుల్‌ మీట్‌ ఏర్పాటు చేసి లేఆఫ్‌ ప్రకటించింది. సమావేశం ముగిసిన వెంటనే ఉద్యోగుల ఈమెయిల్స్‌, అంతర్గత వ్యవస్థల యాక్సెస్‌ను నిలిపివేసింది. తమ మాట చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం కార్పొరేట్‌ వ్యవస్థ అమానవీయతకు అద్దం పడుతోంది. లేఆఫ్‌ అంటే ముందు తెలుసుకోవాలి. ఉద్యోగి తప్పు చేసినందుకు లేదా సరిగ్గా పనిచేయనందుకు తొలగించడం ఒక విషయం. కంపెనీ వ్యాపార అవసరాలు, ఖర్చుల తగ్గింపు, పునర్వ్యవస్థీకరణ, సాంకేతిక మార్పులు లేదా ఒక విభాగాన్ని కుదించడం వంటి కారణాలతో ఉద్యోగాల సంఖ్యను తగ్గించడం మరో విషయం. రెండోది సాధారణంగా లేఆఫ్‌ పరిధిలోకి వస్తుంది. అంటే ఉద్యోగి తనపని సరిగ్గానే చేస్తున్నా, కంపెనీ లాభనష్టాల లెక్కల్లో ఆ ఉద్యోగం ‘అవసరం లేనిది’గా మారితే ఉపాధి పోవచ్చు. ఇక్కడే అసలు సమస్య ఉంది.

పాతికేళ్ల యువకుడు ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ 40-45 ఏండ్లు దాటిన ఉద్యోగికి పరిస్థితి అంత సులభం కాదు. పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు, ఈఎంఐలు, తల్లిదండ్రుల బాధ్యతలు పెరిగే సమయంలో ఆదాయం ఒక్కసారిగా ఆగిపో తుంది. ఆ ఉద్యోగికి వయసు కారణంగా కొత్త అవకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగం కోల్పోవడం కుటుంబ ఆర్థిక భద్రతను కదిలించే పరిణామం. ప్రపంచ టెక్‌ రంగంలో ఈ అస్థిరత తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఒక ప్రముఖ వెబ్‌‌సైట్‌ ‌ప్రకారం.. సెప్టెంబరు 10, 2026 నాటికి 299 కంపెనీల్లో 1,28,536 టెక్‌ ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి. గతేడాది మొత్తం 278 కంపెనీల్లో 1,22, 606 ఉద్యోగాలు కోల్పోయారు. 2026లో ఇప్పటి వరకు అమెజాన్‌ 17,536, ఒరాకిల్‌ 21 వేలు, డెల్‌ 11 వేలు, మెటా 10,400, మైక్రోసాఫ్ట్‌ 4,800 ఉద్యోగాల కోతలను ఆ డేటాబేస్‌ నమోదు చేసింది. ఈ ప్రభావం భారత్‌లోని టెక్‌ రంగానికీ తప్పడం లేదు. దేశంలోని ఐటీ, బీపీఓ, స్టార్టప్‌ సంస్థలు ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ను వేగంగా స్వీకరిస్తున్నాయి. కస్టమర్‌ సపోర్ట్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, డేటా ప్రాసెసింగ్‌, కంటెంట్‌ వంటి కొన్ని పనుల్లో మానవ జోక్యం తగ్గే అవకాశం ఉంది.

ఒకప్పుడు మనిషి గంటల తరబడి చేసిన డేటా విశ్లేషణ, కస్టమర్‌ సపోర్ట్‌, కంటెంట్‌ తయారీ, కోడింగ్‌ వంటి పనుల్లో కొంత భాగాన్ని ఏఐ తక్కువ సమయంలో చేయగలుగుతోంది. దీంతో అదే పనిని తక్కువ మంది ఉద్యోగులతో నిర్వహించే అవకాశం కంపెనీలకు వస్తోంది. సాంకేతిక పురోగతి, కార్పొరేట్‌ లాభాల లెక్కలు కలిసినప్పుడు దాని భారాన్ని ఎక్కువగా మోసేది మాత్రం ఉద్యోగే. ఉత్పాదకత పెరిగితే దాని ప్రయోజనం వేతనాల పెంపు, పని భారం తగ్గింపు, నైపుణ్య శిక్షణ రూపంలో ఉద్యోగికి చేరాలి. కానీ, అనేక సందర్భాల్లో అది ఉద్యోగాల కోతగా, పని ఒత్తిడి పెరుగుదలగా మారుతోంది. ఏఐని పూర్తిగా ప్రతికూలంగా చూడటం కూడా సరైంది కాదు. కొత్త సాంకేతికత కొన్ని పాత పనులను తగ్గించినట్టే కొత్త వృత్తులను, కొత్త అవకాశాలను సృష్టించగలదు. సమస్య సాంకేతికతలో కంటే, దాని ప్రయోజ నాలను ఎవరు పొందుతున్నారు అన్నదాంట్లో ఉంది. చైనాలో ఏఐ వినియోగాన్ని పెంచుతూనే ఉద్యోగాల స్థిరత్వం, నైపుణ్య శిక్షణ, నిరుద్యోగులకు పునరుద్యోగ సహాయం, కొత్త వృత్తుల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే విధానాలను ముందుకు తెస్తోంది. సాంకేతిక మార్పుతో పాటు ఉద్యోగ మార్పును కూడా నిర్వహించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.

భారత్‌లోనూ ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణతో పాటు పునరుద్యోగం, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, తగిన నోటీసు, పరిహారం వంటి అంశాలపై బలమైన వ్యవస్థ అవసరం. నలభైఏండ్ల వయసులో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మరో కోర్సు చేయమని చెప్పడం మాత్రమే పరిష్కారం కాదు. ఇటీవల హైదరాబాద్‌లో తన కూతురికి జ్వరం వచ్చిందని చెప్పి లీవ్‌ పెట్టిన ఓ టెక్‌ ఉద్యోగిని మరుసటిరోజే యాజమాన్యం తొలగించిందని వార్తలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు ఉద్యోగి పట్ల సంస్థకు ఉన్న బాధ్యత ఎంత బలహీనంగా మారిందో చూపిస్తున్నాయి. ఏఐ వినియోగం తప్పుకాదని, దానికి పరిమితి ఉండాలన్నది నిపుణుల భావన. కానీ, ఆ పేరుతో మనిషిని ఖర్చుగా చూడటమే అందులోని అసలు సమస్య. సాంకేతికతతో కంపెనీల లాభాలు పెరిగితే, ఆ లాభాల్లో భాగస్వామైన ఉద్యోగికి భద్రత కూడా దక్కాలి. చివరకు ఏఐ ఎంత అభివృద్ధి చెందినా…అది మనిషి కేంద్రంగానే ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -