సౌదీ అరేబియాకు మద్దతుగా ఎమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లకు పట్టున్న ప్రాంతాలపై దాడులకు ఆదేశించిన ట్రంప్, మిలిటరీ అన్ని రకాల ఆయుధాలను సిద్దం చేసిన తరువాత చివరి క్షణంలో ఆపండని చెప్పాడు. మరోవైపున ఓమన్ మధ్యవర్తిత్వంలో హౌతీలతో అమెరికా ఒక అవగాహనకు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.దీన్ని బట్టి పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికాలో తలెత్తిన గందరగోళం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ మొత్తాన్ని లేపివేస్తానని ట్రంప్ మరోసారి కోతలు కోశాడు. అదే జరిగితే ఊహించని కొత్త ఆయుధాలతో పశ్చిమాసియాలోని అమెరికా, ఇతర కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బుధవారం నుంచి ఇరాన్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాపితంగా స్తంభింప చేస్తామని ట్రంప్ బెదిరించాడు. తాము సౌదీ నౌకలు, ఇతర లక్ష్యాలపై తప్ప అమెరికా ఇతర దేశాల వాటి జోలికి వెళ్లటం లేదని హౌతీలు ప్రకటించారు. ఇది వ్యూహాత్మక నిర్ణయం అన్నది స్పష్టం. వారిపై దాడుల ఆలోచన విరమించటంతో ఎర్ర సముద్ర ప్రాంతం, ఎమెన్‌లోని అనేక కీలక ప్రాంతాలను వారు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.తమ తరఫున మిలిటరీ చర్యలకు పాల్పడాలని కొద్ది రోజుల క్రితం సౌదీ చేసిన వినతిని వాషింగ్టన్ తిరస్కరించింది.
అయితే సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబిఎస్) గురువారం నాడు మరోసారి చేసిన వినతి మేరకు శుక్రవారం నాడు ట్రంప్ సమ్మతించి దాడులకు సిద్ధం కావాలని ఆదేశించాడు. విమానాల్లోకి బాంబులు, ఇతర మారణాయుధాలను సిద్ధం చేసి ఎగరటానికి సిద్ధమవుతున్న సమయంలో ఆదివారం నాడు ఆపివేశాడు. బుధవారం నాడు తన సలహాదారులతో మాట్లాడుతూ హౌతీ-సౌదీ పోరులో దూరటం తనకు ఇష్టం లేదని చెప్పిన పెద్ద మనిషి తరువాత అంగీకరించి, వెనక్కు తగ్గిన మధ్యలో ఏం జరిగిందన్నది ఆసక్తికరం. తమకు పట్టున్న ప్రాంతాల నుంచి అమెరికా, ఇతర దేశాల నౌకల మీద ఎలాంటి దాడులు చేసేది లేదని, ఒక్క సౌదీఅరేబియా మీదనే తమ గురి అని హౌతీలు చెప్పారు. ఈనెల పన్నెండున ఐర్లండ్ పర్యటనలో వారు తమ మీద దాడులు చేసేది లేదని చెప్పినట్లు ట్రంప్ స్వయంగా చెప్పాడు.అయినప్పటికీ సౌదీ నుంచి వచ్చిన వత్తిడి కారణంగా ఊగిసలాటను ప్రదర్శించాడు.గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్ర ప్రాంతంలోని ముఖ్యమైన దీవులను, ఒక రేవును హౌతీలు స్వాధీనం చేసుకొని తమ సత్తాచాటారు. దాడుల నిలిపివేత గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇచ్చిన వార్త తప్ప అధికారికంగా ధృవీకరించలేదు. అదే సమయంలో దాడులకు కూడా పూనుకోలేదు.
సౌదీతో తమకు రక్షణ ఒప్పందం ఉందని, తమ ఆనుయాయులను ఎల్లవేళలా కాపాడతామని అధికారులు చెప్పటాన్ని బట్టి తిరిగి దాడులకు ఆదేశించినా ఆశ్చర్యం లేదు. ట్రంప్ అంతరంగికులలో ఎక్కువ మంది దాడుల పట్ల ఆసక్తితో లేరని మరో అధికారి చెప్పినట్లు కూడా వార్త వచ్చింది. ఇరాన్‌తో ఏదో ఒకటి తేల్చుకోవాలనే వైఖరితో ట్రంప్ ఉన్నట్లు తనతో చెప్పాడని ఫాక్స్ న్యూస్ ట్రే ఇంగెస్ట్ అనే విశ్లేషకుడు వెల్లడించాడు. పెద్ద పరిణామాలు జరిగే అవకాశం ఎంతో దూరంలో లేదని ట్రంప్ తనతో చెప్పాడని, తమ దేశాన్ని పేల్చివేయకుండా ఉండాలంటే దానికి అనుగుణంగా ఉండాలో లేదో ఇరానియన్లు తేల్చుకోవాలని ఇంగెస్ట్ అన్నాడు. ఇలాంటి వదరుబోతు మాటలను గత ఏడు నెలల్లో ఎన్నోసార్లు చూశాం. ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు గానీ ఇప్పుడు దాడులకు దిగితే బాబ్ ఎల్ మండాబ్ జలసంధిని హౌతీలు దిగ్బంధిస్తే అమెరికా పార్లమెంట్ ఎన్నికల్లో అది మరింతగా ట్రంప్ ప్రతిష్ట దిగజార్చు తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే విమాన ఇంథన కొరతతో ఐరోపా దేశాలు ఇబ్బందులుపడుతు న్నాయి. ఎర్ర సముద్ర మార్గం మూసుకుపోతే సమస్య మరింతగా ముదురుతుంది.సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కీలక ప్రాంతాలపై హౌతీలు జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులతో విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి.
జూలై నుంచి ప్రారంభమైన దాడులతో తొలిసారిగా శుక్రవారం రాత్రి రియాద్‌లో హెచ్చరికలు జారీ చేశారు. మరుసటి రోజు దాడులు జరిగాయి. సౌదీ చమురు కంపెనీ ఆరామ్‌కో మంటలతో పాటు నగరంలో అనేక చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి.హౌతీల దాడుల తరువాత సౌదీ నుంచి చమురు ఎగుమతులు పడిపోవటంతో బ్రెంట్ రకం ముడి చమురు ధరలు సెప్టెంబరు 15న 109 డాలర్ల వరకు పెరిగాయి, తరువాత ఎగుమ తులు పెరగటంతో సోమవారం నాడు 99 డాలర్లకు తగ్గిమంగళవారం నాడు వంద డాలర్లకు 101.7 డాలర్లకు పెరిగాయి.రియాద్‌పై దాడి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘిం చటమే అని ఈజిప్టు, జోర్డాన్, కువాయిట్ వ్యాఖ్యానిం చాయి. ఎమెన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా హౌతీలపై సౌదీ పది సంవత్సరాల పాటు దాడులు చేయటాన్ని గతంలో ఈదేశాలేవీ గతంలో ఖండించలేదు. అన్ని మతవిలువలకు తిలోదకాలిచ్చి సౌదీపై దాడులు చేయటాన్ని ఖండిస్తున్నట్లు ప్రపంచ ముస్లిం లీగ్ ప్రకటించింది.సౌదీ అరేబియా తరఫున ఒకవేళ తుర్కియే, పాకిస్తాన్ తమపై దాడులకు దిగితే ఉక్కు పిడికిలితో సమాధానమిస్తామని హౌతీలు హెచ్చరించారు. తమపై ఎవరైనా దాడులకు దిగితే ఉమ్మడిగా ఎదుర్కోవాలని సౌదీ, తుర్కియే, పాక్ ఆగస్టు ఏడున మక్కా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.తమకు మద్దతు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను కూడా కోరింది.
సాంకేతిక సాయంతో పాటు వీలైతే మిలిటరీ మద్దతు కూడా ఇస్తామని తుర్కియే ప్రకటించింది. అంతకు ముందు మిలిటరీ మద్దతు ఇచ్చేందుకు పాకిస్తాన్ తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి.తరువాత వైఖరిని మార్చుకున్నది. మక్కా, మదీనాల రక్షణ మతపరమైన తమ పవిత్ర బాధ్యత అని పాకిస్తాన్ ప్రకటించింది. సౌదీ, పవిత్ర స్థలాల రక్షణకోసం ఎంతకైనా సిద్ధపడతామని ఇంటర్ సర్వీసెస్ ప్రజా సంబంధాల డైరెక్టర్ జనరల్ అహమ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించాడు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున మిలిటరీ జోక్యం చేసుకుంటే పాక్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని, భద్రతాపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయని విమర్శకులు పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా మరోసారి ఏదైనా తప్పు చేస్తే అమెరికా, మధ్య ప్రాచ్య ప్రాంతాలపై బాధాకరమైన దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. నూతన ఆయుధాలతో గతంలో లక్ష్యంగా చేసుకొన్నవాటిని గాక కొత్త వాటిపై దాడి చేస్తామని సోమవారం నాడు ఇరాన్ ప్రకటించింది. ఈ పూర్వరంగంలో ఆ ప్రాంతదేశాల్లో పదకొండు అమెరికా రాయబార కార్యాలయాలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చని తమ పౌరులు, సిబ్బందికి హెచ్చరికలు జారీచేశాయి. అమెరికా మరోసారి దాడులకు తెగబడవచ్చని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నది. గాజాలో మారణకాండకు బాధ్యుడైన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ నేర న్యాయస్థానంపై తీవ్ర ఆంక్షలు విధించాలని ట్రంప్ సిద్ధ పడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
డాలర్ల లావాదేవీలను నిషేధించి కోర్టు కార్యకలాపాలను దెబ్బతీయాలని చూస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనికుల దాడులపై కూడా దర్యాప్తు జరపాలని ఆ న్యాయస్థానం నిర్ణయించినప్పటి నుంచి అమెరికా ఆగ్రహంతో ఉంది.ఐసిసిలో పని చేసే అనేక మంది న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్ల మీద ఇప్పటికే అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే తాజా ఆంక్షల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికన్ పౌరులు, కంపెనీలు సేవలు, వస్తువులు, నిధులు ఇవ్వకూడదు.దర్యాప్తు అధికారులను నియమించకూడదు, అమెరికన్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించకూడదు.తమ మాదిరిగానే ఇతర దేశాలు కూడా ఈ కోర్టు నుంచి వెలుపలికి రావాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో పైరవీ చేస్తున్నాడు. ఇంతటి ఉద్రిక్తత ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెషికియాన్ ఐరాస సాధారణ అసెంబ్లీ సమా వేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళుతున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. సెప్టెంబరు మూడవ తేదీ నాటికి ఇరాన్‌పై జరిపిన దాడుల ఖర్చు 4,306 కోట్ల డాలర్లకు చేరినట్లు తమ ఎంపీలకు అమెరికా వెల్లడించింది.ఆగస్టు నాటికి 3,800 కోట్ల డాలర్లని, ఉద్రిక్తత తీవ్రతను బట్టి నెలకు అదనంగా 300 కోట్ల డాలర్ల వరకు అదనంగా పెరుగుతుందని పార్లమెంటు బడ్జెట్ కార్యాలయం వెల్లడించింది. నిజానికి ఇంతకంటే ఎక్కువగానే ఖర్చు అయినట్లు అనధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి, ఎన్నికల ముందు అంగీకరించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధంగా లేదు. మరోసారి దాడులకు తెగబడితే మరింత నష్టం లేకపోతే ఓటర్లలో పరువుకు భంగం అన్న భయంతో ట్రంప్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది!
ఇరాన్ ఎట్టి పరిస్థితిలోనూ అణ్వాయుధాన్ని సమకూర్చు కోకుండా చూస్తామని, చర్చలకు తలుపు తెరిచే ఉన్నాయని ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. దశాబ్దాల క్రితమే ఎన్‌పిటిపై ఇరాన్ సంతకం చేసింది. దాని ప్రకారం అణ్వాయుధాలను తయారు చేయకూడదు. తాము ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నామని, అయితే ఒప్పందం నుంచి వైదొలగాలనే ఆలోచన చేస్తున్నామని, అది అమెరికా మీద ఆధారపడి ఉంటుందని ఇరాన్ ఉన్నత భద్రతా అధికారి మొహసెన్ రెజాయ్ స్పష్టం చేశాడు. అమెరికా దాడులు, ఆంక్షల కారణంగా ఎన్‌పిటి నుంచి వైదొలగాలని కోరుతూ కొంత మంది ఇరాన్ పార్లమెంటు సభ్యులు ఒక బిల్లును ప్రతిపాదించారు. దానికి స్పీకర్ అనుమతి ఇస్తే సభలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అమెరికా గనుక దాడులు కొనసాగిస్తే పదిహేను సంవత్సరాల యువకులకు సైతం మిలిటరీ అవగాహన కలిగించాలని ఇరాన్ నిర్ణయించింది.పద్దెనిమిదేండ్లు దాటిన వారందరికీ మిలిటరీ శిక్షణ ఇస్తున్నారు. భాషా కేంద్రం ముసుగులో ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నందుకు గాను టెహరాన్‌లోని ఫ్రెంచి భాషా కేంద్రాన్ని ఇరాన్ ప్రభుత్వం మూసివేసింది.దీనికి వ్యతిరేకంగా ఇరాన్ రాయబారిని పిలిపించి తగుచర్యలు తీసుకుంటామని ఫ్రాన్సు ప్రభుత్వం ప్రకటించింది. తమ సంస్కృతి మీద దాడిగా ఈ చర్యను పరిగణిస్తామని పేర్కొన్నది. ఫ్రెంచి బోధన ముసుగులో ఇరాన్‌కు వ్యతిరేకంగా జనాలను కూడగడుతూ దేశభద్రతకు ముప్పు తెస్తున్నదని, ఇరానియన్లను దేశం వెలుపలకు దాటించేందుకు ఏర్పాటు చేస్తున్నందున అనేక సార్లు హెచ్చరించినా పట్టించుకొని కారణంగా రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆ కేంద్రాన్ని మూసివేసినట్లు ఇరాన్ తెలిపింది.
ఎం కోటేశ్వరరావు
8331013288



