Tuesday, September 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజియువతకు భరోసా ఏదీ?

యువతకు భరోసా ఏదీ?

- Advertisement -

దేశంలో యువతే అత్యంత పెద్ద వనరు. జనాభాలో యువత వాటా ఎక్కువగా ఉండటం భారతదేశానికి ఉన్న గొప్ప బలంగా చెప్పుకుంటున్నాం. ఆ యువతే ఇప్పుడు సరైన అవకాశాలు దొరక్క తీవ్ర నిరాశలో ఉంది. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగం లభించడం లేదు. సొంతంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచు కునేందుకు సిద్ధమైనా పెట్టుబడి, రుణ సదుపాయాలు కరువయ్యాయి. యువత ఉపాధి పరిస్థితిపై కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) నివేదిక ఇదే విషయాన్ని గణాంకాల రూపంలో స్పష్టం చేసింది. 2025 వార్షిక నివేదిక ప్రకారం దేశంలో 15 నుంచి 29 ఏండ్ల యువత నిరుద్యోగిత రేటు 9.9 శాతం. అంటే ప్రతి వంద మంది యువ కార్మికుల్లో దాదాపు పది మంది పని కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత నిరుద్యోగిత 8.2 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో పురుషులకు 11.8 శాతం, మహి ళలకు 18.9 శాతంగా నమోదైంది. యువశక్తిని సరైన దిశలో వినియోగించడంలో ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలయ్యారని చెప్పడానికి లెక్కలే నిదర్శనం. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొం టోంది? చదువు పూర్తయిన తర్వాత వారి ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? ఉద్యోగం కావాలా..

స్వయం ఉపాధి కావాలా? ప్రభుత్వ ఉద్యోగంపైనే ఆశలు పెట్టుకున్నారా? ప్రయి వేటు రంగంలో అవకాశాల కోసం చూస్తున్నారా? లేక విదేశీ విద్య, విదేశీ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారా? యువత ఆలోచనలను అర్థం చేసుకునేందుకు నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదని తేలింది. ఉద్యోగ భద్రత, సామాజిక గౌరవం, పదవీ విరమణ ప్రయోజనాలు, స్థిరమైన కెరీర్ వంటి అంశాలు యువతను ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయి. డిగ్రీలు పెరుగుతున్నా వాటికి తగ్గ ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదనే భావన కూడా వ్యక్తమైంది.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది పట్టభద్రులు ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు కొలువుతీరాక యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యమ య్యాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు కోతలు పెట్టింది. ఇప్పటికే మంజూరైన పోస్టులను సైతం భర్తీ చేయలేదు. పదేండ్ల యూపీఏ హయాంలో యువతకు అన్యాయం చేసిందన్న మోడీ, తాము కనుక అధికారంలోకొస్తే ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఆయన చెప్పినట్టుగా 12 ఏండ్ల పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వంలో 24 కోట్లమందికి ఉద్యోగాలు రావాలి. వాస్తవానికి అసలు ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించా మన్నది చెప్పడానికి కేంద్రం సాహిసించడం లేదు. ఉంటేనే కదా లెక్కలుండేది. ప్రయివేటు రంగంలో ఉద్యోగాలంటే విదేశీ, స్వదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడితే వస్తాయి. వాటిని తమ ఘనతగా మోడీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం దురదృష్టకరం.

అవకాశాలు కల్పిస్తే ఉద్యోగాలను సృష్టించగల శక్తి యువతలో ఉంది. స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలు, డిజిటల్ సేవలు, సృజనాత్మక రంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్, గేమింగ్, మీడియా, పర్యాటకం వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించవచ్చు. వాటికోసం అట్టహాసంగా మోడీ ప్రభుత్వం ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం ఎంతమందికి పెట్టుబడులు కల్పించిందో అందరికీ తెలిసిందే. దాని గురించి కేంద్రమే ఊసెత్తడం లేదు. స్కిల్ ఇండియా, పీఎంకెవివై, ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకు రుణాలు అందించేందుకు స్టాండ్ ఆఫ్ ఇండియా అంటూ హడావిడి చేసినా వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియదు. ఒక నోటిఫికేషన్ కోసం వేలాది మంది ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటం కూడా ఉపాధి సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. ఇంకా డిజిటల్ ఇండియా అంటూ యువతకు గాలం వేస్తూ గాలిలో మేడలు కట్టేందుకు ప్రయత్నం చేయడం విడ్డూరం.

ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా తన చేతుల్లోనే ఉన్నా వాటిపైనా ప్రధాని మనసు పెట్టిందీ లేదు. ప్రతీసారి ఓట్ల కోసం యువతకు ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇవ్వడం అలవాటుగా మారింది. ఇది కచ్చితంగా ఏరు దాటాక తెప్ప తగలేయడమే. ప్రభుత్వరంగంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెలకూ పది లక్షల మంది నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే ఉటంకిస్తున్నాయి. నిరుద్యోగిత పెరగడానికి నయా ఉదారవాద విధానాలే కారణం. దీని ఫలితమే యువత నిరాశ నిస్పృ హులకు లోనవుతున్నది. దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మరిన్ని అవకాశాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీట్ పరీక్షల్లో జరిగిన అవకవతవకలపై ఏరకంగా సమరశంఖంగా పూరించిందో ఉద్యోగ ఉపాధి అవకాశాలపైనా యువత గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -