Thursday, May 29, 2025
Homeఖమ్మంవైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ ఇకలేరు..

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ ఇకలేరు..

- Advertisement -

అన్నవాహిక ఇన్ఫెక్షన్‌తో అనారోగ్యం.
చికిత్స చేస్తుండగా గుండెపోటుతో మృతి
వైరా నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా
ఒక పర్యాయం సేవలు
సీఎం రేవంత్‌ రెడ్డి సహా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి,

ఎంపీలు రఘురాంరెడ్డి, వద్దిరాజు, పార్థసారథిరెడ్డి సంతాపం
కుమారుడు మృంగేదర్‌ లాల్‌కు
ఫోన్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ పరామర్శ
బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల నివాళులు
నేడు స్వగ్రామం రఘునాధపాలెం మండలం ఈర్లపూడిలో అంత్యక్రియలు : హాజరుకానున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌ లాల్‌ మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ నెల 23వ తేదీన కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అన్నవాహిక ఇన్ఫెక్షన్‌తో నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆస్పత్రిలోనే ఆయన మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వైరా నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా పని చేసిన మదన్‌లాల్‌.. నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారు. నియోజకవర్గంలో తన అనుచరులకు అండగా ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి ప్రయత్నించేవారు.


సీఎం రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ దిగ్భ్రాంతి
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు, పువ్వాడ అజరు కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదన్‌ లాల్‌ మృతి వైరా నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.


నేడు అంత్యక్రియలు
మదన్‌లాల్‌ స్వగ్రామం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజరు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆస్పత్రిలో మదన్‌లాల్‌ భౌతికకాయాన్ని సందర్శించారు. బుధవారం నిర్వహించే అంత్యక్రియలకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -