కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ఫోర్టిఫైడ్ (పోషకవర్థిత) బియ్యం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన అధ్యయనంలో ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ (ఎఫ్‌ఆర్‌కే), ఫోర్టిఫైడ్ రైస్ (ఎఫ్‌ఆర్) నిల్వ కాలం తక్కువగా ఉండడం, నిల్వ పరిస్థితుల ప్రభావంతో పోషకాల స్థిరత్వం తగ్గిపోవడం వంటి అంశాలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సమర్థవంతమైన పోషక సరఫరా విధానాన్ని వెతుకుతోంది.
ఫోర్టిఫైడ్ బియ్యం అంటే సాధారణ బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి సూక్ష్మ పోషకాలు కలిపిన బియ్యం. 2019లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని 2022లో విస్తరించారు. 2024 మార్చి నాటికి అన్ని సంబంధిత పథకాలలో అమలు చేశారు. అయితే ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన పరిశోధన ప్రకారం తేమ శాతం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, నిల్వ విధానం, ప్యాకేజింగ్ మెటీరియల్ వంటి అంశాలు ఫోర్టిఫైడ్ బియ్యం నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీర్ఘకాల నిల్వలో సూక్ష్మ పోషకాలు తగ్గిపోవడంతో, ఉద్దేశించిన ప్రయోజనాలు పూర్తిగా అందకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ గోదాముల్లో బియ్యం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు నిల్వ ఉంటోంది. ప్రధాన మంత్రి గరీబ్‌కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద సంవత్సరానికి సుమారు 372 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బియ్యం పంపిణీ అవుతోంది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) నుంచి రానున్న కొనుగోళ్లతో కలిపి కేంద్ర నిల్వల్లో సుమారు 674 ఎల్‌ఎంటీ బియ్యం లభ్యత ఉంటుందని అంచనా.
ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత
- Advertisement -
- Advertisement -



