నవతెలంగాణ – అడ్డ గూడూరు : ఐటీఐ, ఏ టి సి ల అభివృద్ధి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైనింగ్ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి అన్నారు. బుధవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో ఐటిఐ, ఏఐటిఐ భవన నిర్మాణ శంకుస్థాపనను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రజా ప్రభుత్వం ద్వారా 6 గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పేద వారు కడుపునిండా తినాలనే లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు.

విద్యార్థులు జ్ఞాపకశక్తి పెంచుకొని మంచిగా చదువుకోవాలని పాఠశాలల్లో, హాస్టల్స్ లో సన్న బియ్యం ద్వారా విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకునేందుకు ఎంగ్ ఇండియా స్కూల్స్ స్థాపించడం జరిగిందన్నారు. విద్యారంగంలో ఎక్కడ కూడా లోటుపాటు జరగకుండా ప్రభుత్వం అనేక విధాలుగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. తెలంగాణ రైజింగ్ లో బాగంగా పెట్టుబడుల దారుల ద్వారా నిరుద్యోగ యువతకు కంపెనీలు, ఫ్యాక్టరీలు , తదితర సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి అన్నారు. కంపెనీ లో పని చేసేందుకు అవగాహన కలిగి ఉండాలని ప్రస్తుతం ఉన్న 65 ఐటీఐ లు అభివృద్ధి చేసుకొని మరికొన్ని కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని మొత్తం 115 ఐటిఐ, ఏఐటిఐ సెంటర్లును స్థాపించుకొని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కొత్తగా ఏర్పడుతున్న వివిధ రకాల డెవలప్మెంట్ స్కిల్స్ విద్యార్థులకు అవగాహన ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో విద్యార్థులకు విద్యను మంచిగా బోధించేందుకు ట్రైనర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ట్రైనింగ్ తీసుకునే పేద విద్యార్థులకు నెలకు 2 వేల రూపాయలు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను వినియోగించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్, నూతన సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



