వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తూ …
న్యూయార్క్ : అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపింది. న్యూయార్క్ నుంచి వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళుతున్న భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ కోసం అమెరికా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కనిపించకుండా పోయిన వారు ఆశా దివాన్ (85), కిషోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84) లుగా గుర్తించారు. వీరు జులై 29న పెన్సిల్వేనియాలోని ఈరీ పట్టణంలో ఉన్న బర్గర్ కింగ్ రెస్టారెంట్ వద్ద చివరిసారిగా కనిపించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. నలుగురిలో ఇద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా వారి చివరి క్రెడిట్ కార్డ్ లావాదేవీ కూడా అక్కడే జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. వారు ప్రయాణిస్తున్న కారు 2009 మోడల్ లైమ్ గ్రీన్ టయోటా కామ్రీ. దీని నంబర్ ప్లేట్ ఈకెడబ్ల్యూ 2611. ఈ కారు న్యూయార్క్ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. బఫెలో నుంచి బయలుదేరిన ఈ కుటుంబం పిట్స్‌బర్గ్ మీదుగా వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ‘ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్’ అనే ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళుతున్నట్టు సమాచారం. బర్గర్ కింగ్ షాపు వద్ద కనిపించిన తర్వాత.. వారి కారు ఐ-79 అనే హైవేపై దక్షిణ దిశగా వెళుతున్నట్టు పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ లైసెన్స్ ప్లేట్ రీడర్ ద్వారా గుర్తించారు.
అయితే వీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి చేరుకోలేదని.. అప్పటి నుంచి వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయ్యాయని అధికారులు తెలిపారు. మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డౌగెర్టీ మాట్లాడుతూ …. తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని, వాటి ఆధారంగా చుట్టుపక్కల మార్గాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గాలింపులో భాగంగా హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. గల్లంతైన వ్యక్తుల సమాచారం, వారి వాహనం వివరాలు నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేశారు. న్యూయార్క్‌లోని బఫెలోలో కూడా తప్పిపోయిన వారి గురించి ఫిర్యాదు నమోదైంది. అధికారులు సెల్ ఫోన్ సిగల్స్ ట్రాక్ చేయడం ద్వారా వారి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయాన్ని సంప్రదించాలని కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సిబు నాయర్ కోరారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు అదృశ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES