Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంనాలుగేండ్లలో నాలుగు లక్షల ఎంటర్‌ప్రైజెస్‌లు

నాలుగేండ్లలో నాలుగు లక్షల ఎంటర్‌ప్రైజెస్‌లు

- Advertisement -

ప్రాజెక్టులకు రూ. 27,133 కోట్ల విలువైన పెట్టుబడులు
8,65,287 ఉద్యోగాల సృష్టి.. ఇది కేరళలోని ఎల్‌డీఎఫ్‌ పాలన బ్రాండ్‌

మోడీ మొదలుకుని దేశంలోని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు యువతకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ పబ్బం గడపడం చూశాం. చివరికి ఇదేంటని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను నిలదీస్తే పకోడీలు అమ్ముకోమని మోడీ అంటే.. బీజేపీ నేతలంతా వంత పాడారు. కానీ భావితరానికి శక్తి అయిన యువతరానికి కేరళ ప్రభుత్వం వెలుగు బాట చూపింది. నాలుగేండ్లలో నాలుగు లక్షల ఎంటర్‌ప్రెజైస్‌ లను నెలకొల్పింది. ఆ ప్రాజెక్టులకు రూ.27,133 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించింది. అంతేకాదు సుమారు 9 లక్షల ఉద్యోగాలను సృష్టించి.. దేశమే కాదు.. అంతర్జాతీయ సమాజాన్ని కూడా కేరళ వైపు చూసేలా ఎల్డీఎఫ్‌ సర్కారు పాలన కొనసాగిస్తోంది.

కొచ్చి: కేరళ ప్రధాన ఇయర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎంటర్‌ప్రైజెస్‌లను ప్రారంభించడానికి సహాయపడింది. గతంలో ఏటా సుమారు 10,000 ఎంటర్‌ప్రైజెస్‌లు మాత్రమే కేరళలో ప్రారంభమయ్యేవి. అక్కడి ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ప్రతి ఏటా లక్ష ఎంఎస్‌ఎంఈ యూనిట్లను సష్టించాలనే స్పష్టమైన లక్ష్యంతో ఇయర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై దృష్టి సారించింది. ఫలితంగా ఆ తర్వాత గణనీయమైన పరివర్తనను చవి చూసిందని కేరళ మంత్రి రాజీవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ 2022-23, 2023-24 , 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక లక్ష ఎంటర్‌ప్రైజెస్‌ చొప్పున నాలుగేండ్లలలో నాలుగు లక్షల ఎంటర్‌ప్రైజెస్‌లను నెలకొల్పింది. దీంతో కేరళ ఎంఎస్‌ఎంఈ వృద్ధిలో ఓ ప్రధాన మైలురాయిని దాటిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,06,178 ఎంటర్‌ప్రైజెస్‌లు స్థాపించబడ్డాయని అన్నారు.

అంతేకాక ఈ ప్రాజెక్టు రూ.27,133 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 8,65,287 ఉద్యోగాలను సృష్టించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 1,28,663 మంది మహిళలు వ్యవస్థాపక రంగంలోకి ప్రవేశించారని, ఇది ఈ చొరవ యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటిగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోని ప్రధాన ప్రజా పరిపాలన వేదికలలో ఒకటైన అమెరికన్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఈ ప్రాజెక్టుకు గుర్తింపు లభించిందని మంత్రి రాజీవ్‌ తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో ఈ చొరవను ప్రదర్శించడానికి కేరళను ఆహ్వానించారనీ, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పాల్గొనలేకపోయామని అన్నారు.ఇదిలా ఉండగా, కేరళ యొక్క ఇయర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చొరవ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిందని, ఎంఎస్‌ఎంఈ రంగంలో విజయవంతమైన నమూనాగా ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేయబడుతుందని రాజీవ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -