Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవాగులో పడి నలుగురు మృతి

వాగులో పడి నలుగురు మృతి

- Advertisement -

మృతుల్లో తల్లీకొడుకు
ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం
డాబా గ్రామంలో విషాదం


నవతెలంగాణ-వాంకిడి
ఒకే గ్రామానికి చెందిన నలుగురు వాగులో పడి మృతి చెందిన విషాదకర ఘటన ఆసిఫాబాద్‌-కుమురం భీం జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తల్లీకొడుకు మోర్లె నిర్మల(25), గణేష్‌(10), అలాగే ఆడె శశికళ(12), వడాయి మహేశ్వరి(12) శనివారం మధ్యాహ్నం యూరియా బస్తాలు శుభ్రం చేయడానికి గ్రామ సమీప వాగులోకి వెళ్లారు. అక్కడ బస్తాలు శుభ్రపరుస్తుండగా ఓ బస్తా కొట్టుకుపోవడంతో గణేష్‌ ముందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు నీటమునిగాడు. గమనించిన తల్లి నిర్మల కొడుకునే రక్షించే ప్రయత్నం చేయగా ఆమెతో పాటు అక్కడే ఉన్న ఆడె శశికళ, వడాయి మహేశ్వరి నీటమునిగారు. ఆ సమయంలో అక్కడే బట్టలు ఉతుకుతున్న అదే గ్రామానికి చెందిన మోర్లె లలిత వారిని చూసి విషయాన్ని గ్రామస్తులకు తెలిపింది. దీంతో గ్రామస్తులు హుటాహుటిన వాగు వద్దకు రాగా.. అప్పటికే వారు మృతిచెందారు. ఒకే ఘటనలో గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మహేందర్‌-నిర్మల దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు గణేష్‌ మండల కేంద్రంలోని గ్రీన్‌ హుడ్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆడె శశికళ, వాడై మహేశ్వరి గ్లోబల్‌ మీడియాలో ఐదో తరగతి చదువుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. విషయం తెలుసుకొని సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మహేందర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -