
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాజకీయ చరిత్రలో కొన్ని ఫోటోలు మాటల కంటే ఎక్కువ చెబుతాయి. అటువంటి అరుదైన చిత్రమిది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు సాధారణ వ్యక్తులు కాదు. ఒక్కొక్కరి రాజకీయ ప్రయాణం వేరు, కానీ వారందరినీ కలిపిన ది ఒక ప్రాంతం, ఒక రాజకీయ అనుబంధం, అదే దమ్మపేట మండలం.
రైతు కుటుంబం నుండి మంత్రి వరకు – తుమ్మల నాగేశ్వరరావు
గండుగులపల్లి గ్రామానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఎన్టీఆర్ ప్రభావంతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎన్నోసార్లు విజయం సాధించి, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించారు. తరువాత తెరాసలో చేరి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్, కేసీఆర్, రెవంత్ రెడ్డి – ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లలో కూడా మంత్రిగా పనిచేసిన అరుదైన నాయకుడిగా తుమ్మల నిలిచారు.
తాటి సుబ్బన్నగూడెం నుండి అసెంబ్లీ దాకా – మచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం కు చెందిన మచ్చా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు సన్నిహితుడిగా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. మొద్దులగూడెం సర్పంచ్ గా ప్రారంభించి, తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత తెరాసలో చేరి 2023 ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రజా వ్యాపారాల్లో కొనసాగుతున్నారు.
వెలేరుపాడు నాయకుడు – తాటి వెంకటేశ్వర్లు
ఏలూరు జిల్లా వెలేరుపాడు మండలం కన్నయ్య గుట్టకు చెందిన తాటి వెంకటేశ్వర్లు మొదట సీపీఐ లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
సర్పంచ్‌గా పనిచేసిన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో తెలుగుదేశం పార్టీలో చేరి, భూర్గంపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తరువాత వైఎస్ఆర్ సీపీలో చేరి అశ్వారావుపేట రెండో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కాలక్రమేణా తెరాసలో చేరి, ఆపై కాంగ్రెస్ లో చేరి తిరిగి తెరాసలోకి చేరారు. ప్రస్తుతం దమ్మపేట మండలం మందలపల్లి లో స్థిరపడ్డారు.
ప్రస్తుత అశ్వారావుపేట ఎమ్మెల్యే – జారె ఆదినారాయణ
గండుగులపల్లి గ్రామానికి చెందిన జారె ఆదినారాయణ విద్యాశాఖలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, 2014లో బీఆర్ఎస్ లో చేరారు. 2018లో పార్టీ టికెట్ రాకపోయినా, 2023లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అశ్వారావుపేట ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.
రాజకీయ విభిన్నత – ఒకే ఫ్రేమ్ లో
తుమ్మల, మచ్చా, తాటి, జారె — నాలుగు పేర్లు, నాలుగు రాజకీయ మార్గాలు, కానీ ఒకే ప్రాంతం! ఎప్పుడూ రాజకీయ వేదికపై ప్రత్యర్థులుగా నిలిచే ఈ నాయకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అరుదైన సంఘటనగా నిలిచింది. ఈ చిత్రమే “రాజకీయ అనుబంధం కంటే మానవీయ సంబంధం గొప్పది” అనే మాటకు సాక్ష్యంగా నిలుస్తోంది.

                                    

