న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, దేశీయంగా పెరిగిన పన్నుల భారంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. కేవలం జనవరి నెలలోనే విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.35,962 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 2025లో రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ఇది కొత్త ఏడాది ప్రారంభంలోనూ కొనసాగడం మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ, దేశీయ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అమెరికా డాలర్ బలపడటం, బాండ్ రాబడులు పెరగడం, రూపాయి విలువ 91-92 రికార్డ్ స్థాయికి పడిపోవడం మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా, యూరప్ మధ్య గ్రీన్‌లాండ్ వివాదం కారణంగా తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండేలా చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.



