Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోసం చేయడం ఈటలకు కొత్తేమీ కాదు

మోసం చేయడం ఈటలకు కొత్తేమీ కాదు

- Advertisement -

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదు
ఈటలతో మోసపోయిన కార్యకర్తలు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి రండి.. : హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి
నవ తెలంగాణ-హుజురాబాద్‌

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు మోసం చేయడం కొత్తేమీ కాదని, పార్టీని, ప్రజలను మోసం చేసి దొడ్డిదారిన సీఎం కావాలనుకున్నారని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్‌తోపాటు హుజురాబాద్‌ ప్రజలను, కార్యకర్తలను మోసం చేశారన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఈటలకు లేదని, కేసీఆర్‌ భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలనుకున్న నీ ఆశలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తిప్పి కొట్టారని అన్నారు. పేద ప్రజల నుంచి వందలాది ఎకరాలు కబ్జా చేసినందుకే మంత్రి పదవి నుంచి కేసీఆర్‌ భర్తరఫ్‌ చేశారని ఆరోపించారు. రాజేందర్‌ పార్టీలో చేరకముందే మా నాన్న సాయినాథ్‌రెడ్డి, కెప్టెన్‌ లక్ష్మి కాంతారావు హుజురాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు. హుజురాబాద్‌ గడ్డ ఎప్పటికీ కేసీఆర్‌ అడ్డాగానే ఉంటుందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలోనూ సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజరుతో తాను కలిసి వెళ్తే.. బీజేపీలో కలుస్తారంటూ ప్రచారం చేయడం తగదన్నారు. ఇటీవల ఈటల రాజేందర్‌ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లడంలో ఆంతర్యమేంటన్నారు. బండి సంజరు ట్రాప్‌లో పడింది నేను కాదని.. ఈటలనేనన్నారు. ఈటలను నమ్ముకుని బీజేపీలో చేరిన హుజురాబాద్‌ నాయకులు, కార్యకర్తలు తిరిగి బీఆర్‌ఎస్‌కి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్‌, మండల అధ్యక్షులు సంఘం ఐలయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సత్యనారాయణ రావు, మాజీ మున్సిపల్‌ జమ్మికుంట చైర్మెన్‌ తక్కలపల్లి రాజేశ్వరరావు, సీనియర్‌ నాయకులు గందె శ్రీనివాస్‌, సురేందర్‌ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -