Sunday, May 18, 2025
Homeజాతీయంఏపీలో ఆగస్టు15 నుంచి మహిళలకుఉచిత బస్సు ప్రయాణం

ఏపీలో ఆగస్టు15 నుంచి మహిళలకుఉచిత బస్సు ప్రయాణం

- Advertisement -

పాఠశాలల ప్రారంభానికి ముందే ‘తల్లికి వందనం’
– డ్వాక్రా మహిళలకు చెత్త నుండి సంపద బాధ్యతలు
– ‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’లో ముఖ్యమంత్రి చంద్రబాబు

కర్నూలు : రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. శనివారం ఆయన కర్నూలులో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి వచ్చి చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సి-క్యాంప్‌ రైతు బజారుకు చేరుకున్నారు. రైతు బజారును పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతు బజారులో దోసకాయలను కొనుగోలు చేశారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుతామని ప్రజలందరితో తొలుత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల మూడో శనివారం ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్వాక్రా మహిళలకు చెత్త నుండి సంపద సృష్టి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. తద్వారా మహిళలకు ఆదాయం సమకూరుస్తామన్నారు. గత ప్రభుత్వం పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త వదిలిపెట్టిందని, అక్టోబర్‌ రెండు నాటికి చెత్త లేకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సంవత్సరం లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామన్నారు. తడి చెత్తను కంపోస్టుగా మార్చాలని, డ్వాక్రా మహిళల ద్వారా అది ఉద్యమంగా మారుతుందని, ప్రపంచానికే ఆదర్శం అవుతుందని తెలిపారు. పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తామని, దీనితో అనేక వస్తువులు తయారు చేయవద్దని తెలిపారు.
లేపాక్షి-ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు
రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని, హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి నుండి ఓర్వకల్లు వరకు పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్స్‌, ఆటో మొబైల్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ పరిశ్రమలు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రం గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా తయారవుతుందని, రాయలసీమ కేంద్రంగా పని చేస్తుందని అన్నారు. పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు తెస్తే రాయలసీమ గేమ్‌చేంజర్‌గా తయారవుతుందని, ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో రైతు బజారు
ప్రతి నియోజకవర్గంలో రైతు బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లనూ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామని, దీనికి ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు. 15,995 గ్రామాలను ఒడిఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, రైతులకు అన్నదాత సుఖీభవ, డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇస్తామని తెలిపారు. 2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని, పేదలకు చేయూతనిస్తే బంగారు కుటుంబాలు అవుతాయని అన్నారు. వారికి మార్గదర్శిగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. అంతకుముందు సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ స్థాపకులు సుధారాణి, ఆర్థా గ్లోబల్‌ సిఇఒ కరణ్‌ షా, ఐసిఎన్‌ఇసి డైరెక్టర్‌ సౌమ్య చతుర్వేదుల, గ్రీన్‌కో ప్రతినిధి శ్రీనివాసరావుతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మిద్దె తోటల పెంపకంపై శ్రద్ధ పెట్టాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు బిసి జనార్దన్‌ రెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్‌, పి నారాయణ, టిజి భరత్‌, ఎంపిలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌, కలెక్టర్లు పి.రంజిత్‌ బాషా, రాజకుమారి గణియా, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -