జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులకు మత్స్య శాఖ ద్వారా ఉచిత చేపల పంపిణిని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని కలెక్టర్ వి సి ఛాంబర్ లో వీడియో కాన్ఫి రెన్స్ ద్వారా పంచాయతీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, మత్స్య శాఖ అధికారులు అలాగే సొసైటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. 80-100 మి.మి. ల పొడవు ఉన్న పెద్ద చేప పిల్లలను పులిచింతల, యాతవాకిళ్ల రిజర్వాయర్లకు 37.99 లక్షల పెద్ద చేప పిల్లలు,186 శాశ్వత చెరువులకు 2.02 కోట్ల పెద్ద చేప పిల్లలు,35-40 మి.మి. ల పొడవు ఉన్న 97.67 లక్షల చిన్న చేప పిల్లల్లను 431 సీజనల్ కుంటల కు మొత్తం 4.40 కోట్ల రూపాయలతో కట్ల(బొచ్చ), రోహు(మోష్), మృగాల (గడ్డిచెప ) జాతులకు చెందిన 3.3816 కోట్ల చెప పిల్లలను ఉచితంగా పంపిణి చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు.
సూర్యాపేట జిల్లాలో దాదాపుగా చెరువులు, రిజర్వాయర్లు నిండి ఉన్నాయని తెలిపారు. చేప పిల్లలు వేసేటప్పుడు చెరువులు మూడో వంతు నీరుతో నిండి ఉండాలని తక్కువగా ఉంటే చేప పిల్లలు విడుదల చేయరాదని, నీరు కాలుష్యం కాకుండా చూడాలని ఎక్కడ అయితే చేప పిల్లలు పంపిణీ చేస్తారో ఒకరోజు ముందుగానే ఆయా చెరువు సొసైటీ కమిటీకి సమాచారం ఇవ్వాలని తర్వాత రోజు ఉదయమే చేప పిల్లలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రిజర్వాయర్లు పరిధిలో జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా ఇరిగేషన్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్యశాఖ పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడు,10 మంది లైసెన్స్ ఉన్న సభ్యులు లతో కమిటీ ఏర్పాటు చేయాలని, శాశ్వత చెరువులు సొసైటీ పరిధిలో జిల్లా మత్స్యశాఖ అధికారి లేదా అతని తరఫున ప్రతినిధి,ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, అట్టి చెరువు సొసైటీ ప్రెసిడెంట్,పదిమంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అవుతుందని అలాగే సీజనల్ కుంటలలో జిల్లా మత్స్య శాఖ అధికారి తరపున ఒక ప్రతినిధి, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, అట్టి చెరువు సొసైటీ ప్రెసిడెంట్,సొసైటీలోని 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పడుతుందని తెలిపారు.
ఆయా కమిటీ ఆధ్వర్యంలోనే చేప పిల్లలను రిజర్వాయర్లు ,చెరువులు కుంటలలో పంపిణి చేయాలని ఆయా కమిటీ ఆధ్వర్యంలోనే ఎన్ని పిల్లలు వేస్తున్నారో లెక్కించి వాటి యొక్క పరిమాణం బరువులు కొలవాలని అక్కడే అందరి సభ్యులతో సంతకం తీసుకోవాలని అట్టి వివరాలను టీ మత్స్య యాప్ లో అప్లోడ్ చేయాలని చెరువులో చేప పిల్లలను విడుదల చేసేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల్ని తప్పనిసరిగా ఆహ్వానించాలని తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని సొసైటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరిస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు చొరవ తీసుకుని చేప పిల్లలు మంచిగా ఎదిగేలా సహకరించి మత్స్య కారుల జీవనాధారం మెరుగుపడేలా చూడాలని, మంచిగా చేపలను పెంచటం ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ కు జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి బి నాగులు నాయక్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



