– సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు సారా సురేష్
– ఆర్మూర్ లో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యాన్ని ఉచితంగా అందించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు సారా సురేష్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యాలయంలో నిర్వహించిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్య, వైద్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా అందివ్వాలనే డిమాండ్ తో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2025 ఆగస్టు 10న ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.విద్యా రంగంలో విదేశీ పెట్టుబడిదారులకు, వైద్య రంగంలో బహుళ జాతి వ్యాపార వర్గాలకు ఈ ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నాయన్నారు.ప్రజాసేవ రంగాన్ని అంగట్లో సరుకు మాదిరిగా మార్చేస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా ఐక్య ఆందోళన చేసేందుకు ఈనెల 10న ఉదయం 11గంటలకు ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలని ఆయన ప్రజా సంఘాల, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పిఓడబ్ల్యు నాయకురాలు సత్యక్క మాట్లాడుతూ సంక్షేమ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యల పట్ల నిర్లక్ష్య వహిస్తున్నారని, విద్యని అంగట్లో సరుకుగా మార్చేసారని, దీనికి వ్యతిరేకంగా ఐక్య ఆందోళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కమ్మర్ పల్లి మండల కార్యదర్శి బసిరి అశోక్, నాయకులు, జి.కిషన్, తదితరులు పాల్గొన్నారు.