Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉన్నోడికీ ఉచితం.. బోర్డుకు తీరని నష్టం

ఉన్నోడికీ ఉచితం.. బోర్డుకు తీరని నష్టం

- Advertisement -

విల్లాలు, హైరైజ్‌డ్‌ బిల్డింగ్స్‌లోని వారికీ ఫ్రీ నీరు
వాహనాలు కడిగేందుకూ తాగునీరే..
పెరిగిన పరిధి.. మారేనా పరిస్థితి
లేదంటే మరింత నష్టాల్లోకి జలమండలి
పేదలు, మధ్యతరగతి వారికే పరిమితం చేయాలంటున్న అధికారులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
వారు కోట్లకు పడగలెత్తారు.. మూడు, నాలుగు, ఐదు, పది కోట్లయినా వెచ్చించి విల్లాలు.. గ్రేటర్‌ కమ్యూటీలో ఇండిపెండెంట్‌ ఇండ్లు, హైరైజ్‌డ్‌ భవనంలో ఫ్లాట్‌ కొనేందుకు వెనుకాడరు.. ఖరీదైన కార్లలో తిరుగుతూ లక్షలాది రూపాయలను నీళ్లలా ఖర్చుచేసే వారికి పేదోళ్లతో సమానంగా ఉచిత వాటర్‌ సరఫరా అవుతోంది. వాటర్‌ బిల్లులు కట్టాల్సి వస్తుందని ఎవరైనా చెబితే చాలు ఎందుకు కడ్తామంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీరో బిల్లులకే మొగ్గుచూపుతున్నారు.. దాంతో జలమండలి తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతోంది. ఇక విస్తరించిన పరిధిలో సైతం ఉన్నోడికి సైతం ఉచితంగా తాగునీరు అందిస్తే జలమండలి మరింత నష్టాల్లోకి కూరుకుపోవడం తప్పదని అధికారులు అంటున్నారు.

‘ఉచితం’గా తాగునీరు ఎవరికి ఇవ్వాలనేది ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని అంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత పథకం దుర్వినియోగం అవుతోంది. దాంతో జలమండలి ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయింది. జలమండలి మరింత విస్తరించింది. ప్రస్తుతం 12జోన్లు, 60సర్కిళ్లు, 300 వార్డులతో 1450.2 నుంచి 2.053.2చ.కిమీతో ఓఆర్‌ఆర్‌ వెలుపల వరకు విస్తరించింది. ఇప్పటికే 14.44లక్షల నల్లా కనెక్షన్లలో 10లక్షల కనెక్షన్లకు ఉచిత వాటర్‌ అందిస్తున్నారు. వీటిలో దాదాపు నాలుగు లక్షల కనెక్షన్ల వరకు బస్తీల్లో ఉండగా.. మిగిలిన ఆరు లక్షల నల్లా కనెక్షన్లలో ధనికులతోపాటు విల్లాలు, గ్రేటర్‌ కమ్యూనిటీ, హైరైజ్‌డ్‌ బిల్డింగ్‌లు, కోట్లకు పడగలెత్తిన వ్యాపారులున్నారు.

పీకల్లోతు అప్పుల్లోకి..
జలమండలి నీటి సరఫరా ద్వారా నెలకు రూ.90 కోట్లు ఆదాయం వస్తోంది. సింగిల్‌ విండో ద్వారా రూ.25 నుంచి 30కోట్ల వరకు మరికొంత ఆదాయం సమకూరుతోంది. ఇలా మొత్తం దాదాపు రూ.115 నుంచి 120 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే జీతభత్యాలు, బోర్డు మెయింటెనెన్స్‌తోపాటు ఇతర అవసరాలకు కలిపి నెలకు రూ.200కోట్లకుపైగా జలమండలి ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ప్రతి నెలా వంద కోట్లకుపైగా భారం మోయాల్సిన పరిస్థితి నెలకొంది.

నష్టాల్లో కూరుకుపోతున్న జలమండలిని గట్టెక్కించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. పేదలకు, మధ్యతరగతి వర్గాల వారికి ప్రభుత్వం ఫ్రీ వాటర్‌ అందిస్తే పర్వాలేదుగానీ, రూ.కోట్లు వెచ్చించి విల్లాలు, హైరైజ్‌డ్‌ బిల్డింగ్స్‌ ఖరీదు చేసిన వారికి సైతం ఉచిత తాగునీరు సరఫరా చేస్తే నష్టాలు కాకుండా లాభాలు ఎలా వస్తాయని అంటున్నారు.

95 శాతం భారీ మోటార్లతో..
తాగునీటి తరలింపులో 95 శాతం భారీ మోటార్లతో 5శాతం గ్రావిటీ ద్వారా నగరానికి నీటిని తరలిస్తున్నారు. భారీ మోటార్ల వినియోగం, రిజర్వాయర్ల ద్వారా వినియోగదారులకు తాగు నీరు సరఫరా చేయడం కోసం నెలకు దాదాపుగా 200 నుంచి 225 మెగావాట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. వినియోగం చేస్తున్న విద్యుత్‌కు కోట్లాది రూపాయల కరెంట్‌ బిల్లు వస్తోంది. వీటన్నింటినీ భరించడానికి జలమండలిపై అదనపు భారం పడుతోంది.

ప్రతిరోజూ 583 ఎంజీడీల నీటి సరఫరా
హెచ్‌ఏండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో నగరంలో నీటి సరఫరా జరుగుతోంది. ప్రతిరోజూ 583 ఎంజీడీల నీటిని వందల కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి శుద్ధి చేస్తున్న జలమండలి ఆ నీటిని ఇంటింటికీ అందజేస్తోంది. లీటర్‌ నీటిని తరలించి, శుద్ధి చేయడానికి రూ.47 ఖర్చు చేస్తోంది. ఎంతో విలువైన నీటిని పొదుపుగా వినియోగించాల్సిన బాధ్యత నగరవాసులపై ఉంది. కానీ కొందరు అక్రమ నల్లా కనెక్షన్లను తీసుకున్నారు. ఇంకొందరైతే ఏకంగా నల్లాకే మోటార్‌ పెట్టి నీళ్లు తోడేస్తున్నారు.

మరికొందరు తాగు నీళ్లను కార్లు, బైక్‌లను శుద్ధిచేసేందుకు ఉపయోగిస్తున్నారని జలమండలి అధికారుల సర్వేలో తేలింది. మరికొందరు రోడ్లపై, మోరీల్లో వదిలేస్తున్నారు. ఇవి కూడా జలమండలి నష్టాలకు కారణమవుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం హామీలు ఇచ్చినా అందులో అర్హుల కంటే అనర్హులే ఎక్కువ మంది లబ్దిపొందుతున్నారని అధికారుల అభిప్రాయం. గట్టిగా నిలదీస్తే రాజకీయ నేతల అండదండలతో బెదిరిస్తుంటారని ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -