Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరిటైర్డ్‌ సీపీఎస్‌ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి

రిటైర్డ్‌ సీపీఎస్‌ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి

- Advertisement -

సీఎస్‌కు టీఎస్‌సీపీఎస్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో రిటైర్డ్‌ సీపీఎస్‌ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ అమలుపై స్పష్టత కరువైందని టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆందోళన వ్యక్తం చేసింది. వారి నుంచి ప్రతినెలా 1.5 శాతం చందా వసూలు చేయడం అసాధ్యమని తెలిపింది. రిటైర్డ్‌ సీపీఎస్‌ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్టారావును బుధవారం టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌ కలిసి రాష్ట్రంలోని 2.5 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఈహెచ్‌ఎస్‌పై వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) బలోపేతం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం నుంచి 1.5 శాతం చందా వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై స్పష్టత లేదని తెలిపారు. దీనివల్ల ఇప్పటివరకు రిటైర్డ్‌ అయిన 2,316 మందితోపాటు సీపీఎస్‌ ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) పెన్షనర్లకు, సీపీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఉన్న సాంకేతిక వ్యత్యాసాన్ని ప్రభుత్వం గమనించాలని కోరారు. సీపీఎస్‌ ఉద్యోగికి రిటైర్‌ ఐయ్యాక ప్రభుత్వానికి సంబంధం ఉండదని చెప్పారు. పెన్షనర్‌ ఐడీ ఉండబోదని వివరించారు.

ఓపీఎస్‌ పెన్షనర్లకు ప్రభుత్వం ట్రెజరీ (ఐఎఫ్‌ఎంఐఎస్‌) ద్వారా పెన్షన్‌ చెల్లిస్తుందనీ, వారి పెన్షన్‌ నుంచి 1.5 శాతం ఈహెచ్‌ఎస్‌ చందా మినహాయించడం సాధ్యమవుతుందని చెప్పారు. కానీ 2004, సెప్టెంబర్‌ ఒకటి తర్వాత ఉద్యోగంలో చేరి రిటైర్‌ అయిన సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి పెన్షన్‌ రాదని అన్నారు. వారి పెన్షన్‌ షేర్‌ మార్కెట్‌ విలువ ఆధారంగా పీఎఫ్‌ఆర్‌డీఏ నియమించిన ప్రయివేట్‌ ఏజెన్సీల నుంచి వస్తుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం తమ పెన్షన్‌ నుంచి నేరుగా డబ్బులు కట్‌ చేయడం సాంకేతికంగా అసాధ్యమని అన్నారు. అందుకే రిటైర్డ్‌ సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉచిత ఆరోగ్య బీమాను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈహెచ్‌ఎస్‌ ట్రస్ట్‌లో సీపీఎస్‌ యూనియన్‌ నుంచి సభ్యుడికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కల్వ శ్రవణ్‌ కుమార్‌, కోటకొండ పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -