నవతెలంగాణ – బజార్ హాత్నూర్
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరం నిర్వహించిందని స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ భీమ్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక కృషి చేస్తుందని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
పల్లెల్లో పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిందన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఉచిత వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు చిన్న పిల్లలు జనరల్ ఫిజీషియన్ కంటి దంత ఎముకల వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో సుమారు 312మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.
ఇందులో 18 మందికి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ తేజస్విని, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ సౌజన్య, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీజ, జనరల్ మెడిసిన్ డాక్టర్ వినీత్, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శరత్ రావు, దంత వైద్య నిపుణులు డాక్టర్ వినోద్, స్థానిక వైద్యులు డాక్టర్ శిల్ప ,డాక్టర్ అలేఖ్య, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



